సైలెంట్‌ కిల్లర్‌

Apr 28,2024 09:09 #heart attack, #Sneha

ఇటీవలి కాలంలో గుండెజబ్బుతో మరణించే వారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో వీరి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటంతో డెన్మార్క్‌కు చెందిన ఆల్‌బోర్గ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అందుకుగాను వ్యాధికి లోనైన వారిపై పరిశోధనలు చేశారు. వారి అధ్యయనంలో ‘కర్ణికదడ’ వలన ఆకస్మిక మరణాలు కలుగుతున్నాయని తేలింది. దీని గురించి వారు చెప్పిన అంశాలు చాలా ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి.
గుండెలో నాలుగు గదులుంటాయి. పైరెండు గదులను కర్ణికలు, కింది రెండింటిని జఠరికలని అంటారు. ఈ కర్ణికల్లో దడ రావటం వలన గుండెపోటు అని గుర్తించే అవకాశం కూడా లేకుండానే చనిపోతున్నారని పరిశోధనలో తేలిందని వారంటున్నారు.

సరైన సమయంలో..
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి హృదయ స్పందన (గుండె కొట్టుకోవటం) నిమిషానికి 70-72 సార్లు ఉంటుంది. అంటే రక్త ప్రవాహానికి అనుగుణంగా గుండె కండరాల సంకోచ వ్యాకోచాలు క్రమ పరిమాణంలో జరుగుతాయి. అదే గుండెపోటుతో బాధపడేవారిలో హృదయ స్పందన అపరిమిత స్థాయిలో, క్రమరహితంగా ఉంటుంది. సరైన సమయంలో గుర్తిస్తే వైద్య సేవలందించి, ప్రమాదస్థాయి నుంచి ఆ వ్యక్తిని కాపాడవచ్చంటున్నారు.
అయితే ఇప్పుడు పరిశోధనలో తెలిసిన కర్ణికదడకు ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అకస్మాత్తుగా హృదయ స్పందనలో మార్పు వచ్చి, మరణించే అవకాశాలున్నట్లు పరిశోధక బృందం గుర్తించింది. వైద్య పరిభాషలో కర్ణిక దడను ‘ఎఫిబ్‌’ అని సంబోధిస్తారు.
ఇప్పటివరకు పెద్దవారికి మాత్రమే గుండెపోటు వస్తుందనే అపోహ అందరిలోనూ ఉండేది. కానీ రోజురోజుకూ పెరుగుతున్న హృద్రోగ మరణాల సంఖ్య పరిశోధకులను కలవరపరిచింది. వయసుతో నిమిత్తం లేకుండా పసిపిల్లలు, యువత, ఆరోగ్యంగానే ఉన్నారనుకునేవారు అకస్మాత్తుగా గుండెపోటుకు గురై, మరణిస్తున్నారు. ఈ నేపథ్యమే డెన్మార్క్‌ అధ్యయన కారులను ఈ పరిశోధనకు ప్రేరేపించింది.

పరిశోధన ఇలా..
ఈ బృందం 45 ఏళ్లు పైబడిన.. దాదాపు ముప్పై ఐదు లక్షల మందిపై అధ్యయనం చేశారు. ఆ ఫలితంగానే ఈ కర్ణికదడను గుర్తించారు. రెండు దశాబ్దాల (2000-2010, 2011-2022 మధ్య) పరిశోధనాత్మక డేటాను పోల్చి చూశారు. మొదటి దశాబ్దంలో (2000-2010) 24 శాతం కర్ణికదడ మరణాలుంటే, రెండవ దశాబ్దంలో (2011-2022) 31 శాతానికి కర్ణికదడ మరణాలు పెరిగినట్లు నివేదిక పేర్కొన్నది.
లక్షల మంది హృద్రోగులపై పరిశోధనలు చేసినప్పటికీ, కర్ణిక దడకు కచ్చితమైన కారణం తెలియరాలేదు. అయితే అధిక రక్తపోటు, ఊబకాయం ఉన్నవారిలో ఎక్కువగా వస్తుందని.. అలాగే ఆహార విషయంలో సమయపాలన లోపించటం, మద్యం తీసుకోవటం కూడా కారణాలుగా వారు చెబుతున్నారు.

సైలంట్‌గా.. సడన్‌గా..
కర్ణిక దడ ఎలాంటి లక్షణాలూ ప్రదర్శించదని.. సైలెంట్‌గా, సడెన్‌గా వస్తుందని నివేదిక తెలుపుతోంది. కర్ణికదడకు గురైన ఐదుగురిలో ఇద్దరు మరణిస్తున్నారని, ఒకరు గుండెపోటుతో బాధపడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. మహిళల్లో కంటే ఈ ప్రమాదం పురుషుల్లోనే కొంచెం ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు.

పరీక్షతో నిర్ధారణ..
కర్ణిక దడను పరీక్షించేందుకు ఛాతీ, మణికట్టు, చీలమండలంపై నొప్పిలేని చిన్న ఎలక్ట్రోడ్‌లను ఉంచుతారు. రోగి విశ్రాంతిగా ఉన్నప్పుడు లేదా, ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్నప్పుడు ఈ పరీక్ష చేస్తారు. వ్యాధిని గుర్తించిన తర్వాత జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే రక్తం పలుచబడేలా, గడ్డకట్టకుండా, స్ట్రోక్‌ రాకుండా ఉండేందుకు మందుల ద్వారా వైద్యం చేస్తారని తెలిపారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడటానికి మన జీవనశైలిలో వచ్చిన మార్పులే ముఖ్య కారణంగా పరిగణిస్తున్నారు వైద్యులు.

➡️