హీరోలతోనే సినిమా హిట్‌ కాదు..

Apr 28,2024 09:06 #celebrity, #Sneha

‘సినిమాలో పెద్ద పెద్ద హీరోలు నటించడం వల్ల మాత్రమే ప్రేక్షకులను థియేటర్లలోకి రప్పించలేం. కథే అసలైన హీరో’ అంటున్నారు కృతి సనన్‌. టబు, కరీనాకపూర్‌లతో కలిసి ఆమె నటించిన ‘క్రూ’ వంద కోట్ల రూపాయల వసూళ్లను దాటిన నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కొన్ని అభిప్రాయాలను చాలా నిర్మొహమాటంగా వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

‘చిత్ర పరిశ్రమలోని వ్యక్తులు మొహమాటానికి ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకోవడం కన్నా.. ఆపదల్లో ఉన్న వారికి నిజాయితీగా, అండగా నిలబడితే బాగుంటుంది. సినీ రంగంలో సహనటీనటుల మధ్య ఐక్యతను నేను అంతగా చూడలేదు. ఒక సినిమా హిట్‌ అయినప్పుడు ఎంత మంది సంతోషిస్తున్నారో.. ఎంత మంది ఏడుస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక సినిమా విజయం, వైఫల్యం ఏ ఒక్కరిపైనో ఆధారపడి ఉండవు. పూర్తి బాధ్యత మొత్తం చిత్రబృందంపైనే ఉంటుంది.


దర్శకుడు సంజరులీలా భన్సాలీ కేవలం మహిళ పాత్రనే ఎంచుకొని ‘గంగూబాయి కాఠియావాడీ’ తెరకెక్కించారు. ఇందులో హీరో లేడు. అయినా బడ్జెట్‌ విషయంలో రాజీ పడలేదు. ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు, రికార్డు వసూళ్లు రాబట్టింది కదా! కళ్ల ముందే ఇలాంటి సాక్ష్యం కనిపించినప్పుడు హీరోయిన్ల చిత్రాలకు బడ్జెట్‌ పరిమితులు ఎందుకో తెలియడం లేదు.
సినిమాలో ఒక పెద్ద హీరో ఉన్నంత మాత్రానే ప్రేక్షకులు థియేటర్లలోకి పరుగులెత్తుకుని రారు. కథ బాగుంటే.. అందులో ప్రధాన పాత్రధారులు ఆడా? మగా? అని ఎవరూ చూడరు. దురదృష్టవశాత్తూ కొందరు దర్శక నిర్మాతల్లో సైతం.. ”మహిళా ప్రాధాన్య సినిమాలకు ప్రేక్షకులు రారు. తాము చెల్లించిన టిక్కెట్టుకి సరైన న్యాయం జరగదని ప్రేక్షకులు భావిస్తారు” అనే అభిప్రాయం ఉంది. ఇది అపోహ మాత్రమే.. వాస్తవం కాదు.
కథా నాయకులెవరూ లేకపోయినా ‘క్రూ’ గొప్పగా ఆడుతోంది. ఇది చూశాకైనా.. పరిశ్రమలో కొద్దిగానైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. ప్రేక్షకులు సైతం మారాలి. బాక్సాఫీసు నెంబర్లు చూస్తుంటే.. కథానాయకలు ప్రధాన పాత్రధారులుగా ఉన్న సినిమాలు సైతం అద్భుతాలు చేస్తాయనే విషయం అర్థమవుతుంది.
ప్రస్తుతం కాజోల్‌తో కలిసి ‘దో పత్తీ’ చేస్తున్నా. దీని చిత్రీకరణ పూర్తయ్యి, నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. ముస్సోరీ, నైనిటాల్‌, మనాలీ లాంటి హిల్‌ స్టేషన్లతో పాటు దాదాపు దేశమంతా తిరిగాను. నిర్మాతగా నాకు ఈ చిత్రం సరికొత్త అనుభవాన్ని ఇచ్చింది. నా మనసుకి నచ్చింది చేయడానికి, మహిళలకు మరిన్ని అవకాశాలు ఇవ్వడానికి తప్పకుండా ఇంకా సినిమాలు నిర్మిస్తా’ అంటూ తన అభిప్రాయాలను వెల్లడించారు కృతి సనన్‌.


కృతి సనన్‌ హిందీ చిత్ర పరిశ్రమలో ప్రధానమైన పేరు కలిగిన భారతీయ నటి, మోడల్‌. ఎన్నో పెద్ద కంపెనీల కమర్షియల్స్‌లో నటించారు. కృతి తెలుగులో మహేష్‌బాబు సరసన ‘నేనొక్కడినే’ సినిమాతో నటిగా తెరంగేట్రం చేశారు. అటు హిందీలో జాకీష్రాఫ్‌ కొడుకు టైగర్‌ ష్రాఫ్‌ సరసన ‘హీరోపంతి’ సినిమాతో తెరంగేట్రం చేశారు. ‘ఆదిపురుష్‌’ హిందీ చిత్రంలో కృతిసనన్‌ నటించారు.
కృతిసనన్‌ జేపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ నుండి ఇంజినీరింగ్‌ పట్టా పొందారు. డిగ్రీ పూర్తిచేసిన తర్వాత మోడల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలోకి అడుగుపెట్టారు. హీరోపంతి చిత్రం ఆమెకు ఫిల్మ్‌ఫేర్‌ ఉత్తమ నూతన నటిగా అవార్డు అందించింది. ఆ తర్వాత కృతి బాలీవుడ్‌లో వాణిజ్యపరంగా విజయవంతమైన మూడు సినిమాల్లో భాగస్వామ్యమయ్యారు.
కృతిసనన్‌ వెండితెర అరంగేట్రం చేయడానికి ముందు.. క్లోజప్‌, వివెల్‌, సామ్‌సంగ్‌, బాటా, అమూల్‌ వంటి పలు టెలివిజన్‌ వాణిజ్య ప్రకటనలలో కనిపించారు. సనన్‌ 2015లో తన రెండవ హిందీ చిత్రంలో కనిపించారు. అది రోహిత్‌ శెట్టి యొక్క దిల్‌వాలే. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా కనిపించింది. కృతిసనన్‌ 2017లో రెండు హిందీ సినిమాల్లో భాగంగా రాబ్తా, బరేలీకి బర్ఫీ, 2019లో రొమాంటిక్‌ కామెడీ చిత్రమైన ‘లుకా చుప్పి’లో కార్తీక్‌ ఆర్యన్‌ సరసన నటించారు. కృతిసనన్‌ ‘స్త్రీ’ (2018) చిత్రం నుండి ‘ఆవో కభీ హవేలీ పే’, కళంక్‌ (2019) చిత్రంలోని ‘ఐరా గైరా’ వంటి పాటల్లో కూడా ప్రత్యేక పాత్రలు చేశారు.


బరేలీకి బర్ఫీకి ప్రధానపాత్ర (మహిళ) లో చిరస్మరణీయమైన నటనకు కృతిసనన్‌ 2018లో దాదాసాహెబ్‌ ఫాల్కే ఎక్సలెన్స్‌ అవార్డును అందుకున్నారు. కృతిసనన్‌ 2017లో మోస్ట్‌ స్టైలిష్‌ యూత్‌ ఐకాన్‌ (ఫిమేల్‌) కోసం హెచ్‌టి స్టైల్‌ అవార్డులను గెలుచుకున్నారు. అదే సంవత్సరంలో ఆమె ఫ్యూచర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ (ఫిమేల్‌) కోసం ఫిల్మ్‌ఫేర్‌ గ్లామర్‌, స్టైల్‌ అవార్డులను కూడా అందుకున్నారు. ఆమె సల్మాన్‌ఖాన్‌కి వీరాభిమాని. ఆమె ఎవర్‌గ్రీన్‌ నటి రేఖ, కాజోల్‌ను మెచ్చుకుంటారు. ఆమె కాజోల్‌తో కలిసి ‘దిల్‌వాలే’లో కూడా పనిచేశారు.

పుట్టింది : 27 జులై, 1990
(33 ఏళ్లు), న్యూఢిల్లీ
తల్లిదండ్రులు : గీతా సనన్‌, రాహుల్‌ సనన్‌
విద్యాభ్యాసం : జైపూర్‌ యూనివర్శిటీలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చేశారు.
తోబుట్టువులు : నుపుర్‌ సనన్‌

➡️