రిటర్న్స్‌ దాఖలు చేసుకోవడానికి నూతన సాఫ్ట్‌వేర్‌ ఎంతో ఉపయోగకరం

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: ఆదాయపుపన్ను రిటర్న్స్‌ దాఖలు చేసుకోవడానికి ఏర్పాటు చేసిన నూతన సాఫ్ట్‌వేర్‌ అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ చీఫ్‌ కమిషనర్‌ ఎస్‌ నరసమ్మ తెలిపారు. ఒంగోలులోని రామనగర్‌ 8వ లైన్‌లో ప్రకాశం జిల్లా ఆదాయపు పన్ను శాఖ అధికారుల నూతన అతిథి గహాన్ని ఆదివారం నాడు ఆమె ప్రారంభించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వాస్తవ్యురాలైన నరసమ్మ ఆదాయపన్ను శాఖలో అంచలంచెలుగా ఎదిగి తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చీఫ్‌ కమిషనర్‌గా నియమితులవడం జిల్లాకి గర్వకారణమని పలువురు అధికారులు ప్రశంసించారు. ఈ సందర్భంగా చీఫ్‌ కమిషనర్‌ నరసమ్మ మాట్లాడుతూ సొంత జిల్లాకు ముఖ్యఅతిథిగా వచ్చి.. నూతన అతిథి గహం ప్రారంభోత్సవం చేయడానికి రావడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. రిటర్న్స్‌ దాఖలు చేసుకోవడానికి ఏఐఎస్‌లో పొందుపరిచిన సమాచారానికి అనుగుణంగా నమోదు చేసుకున్నట్లయితే సరిపోతుందని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చార్టెడ్‌ అకౌంటెంట్లకు వివరించారు. ఈ సందర్భంగా ఆమెకు గురువులైన వెంకటేశ్వర్లు మాస్టారికి ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమానికి విజయవాడ ఇన్కమ్‌ టాక్స్‌ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ బి.సునీత, గుంటూరు జాయింట్‌ కమిషనర్‌ సంధ్యారాణి, ఆదాయపన్ను శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సెల్వన్‌ రాజు, ఒంగోలు శాఖ అధికారి ఎం.దాసు, చీరాల, నరసరావుపేట, తెనాలి, బాపట్ల, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఆదాయ పన్ను శాఖ అధికారులు చీఫ్‌ కమిషనర్‌ నరసమ్మకు ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆదాయపన్ను శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️