ప్రమాదవశాత్తూ రాతి క్వారీలో పడి బాలికలు మృతి

May 8,2024 21:41

కంచికచర్ల మండలం పరిటాల శివారు దొనబండ రాతి క్వారీ నీటి గుంటలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది.. దీనిపై స్థానిక ఎస్సై సుబ్రహ్మణ్యం అందించిన సమాచారం మేరకు మండల పరిధిలోని దొనబండ రాతి క్వారీ రోజువారి పనులు చేసుకునే లీవన్‌ జానీ, సావిత్రికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. వారిలో లక్ష్మీ జానీ (13) రాధా జానీ (12) ఇద్దరూ బుధవారం ఉదయం దొనబండ రాతి క్వారీలోని నీటి గుంటలో బట్టలు ఉతికేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు అక్కచెల్లెళ్లలో ఒకరు నీటి గుంటలో పడిపోవడంతో ఆమెను కాపాడేందుకు మరొకరు నీటి గుంటలో దిగటంతో లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు. ఈ ఏడాది లక్ష్మీ జానీ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేయగా, రాధా జానీ 8వ తరగతి పూర్తి చేసి వేసవి సెలవులతో ఇంటి వద్ద తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. బట్టలు ఉతికేందుకు వీరితో పాటు బంధువుల పిల్లవాడు చంటి నీ తోడుకి తీసుకుని వెళ్లారు. లక్ష్మీ జానీ రాధా జానీ ఇద్దరు నీటిలో మునిగిపోవడంతో అది గమనించిన చంటి వెంటనే ఇంటికి వెళ్లి సమాచారం అందించడంతో హుటాహుటిన తల్లిదండ్రులు బంధువులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే నీటిలో మునిగిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు విడిచారు. వీరి తల్లిదండ్రులు స్వస్థలం ఒరిస్సా రాష్ట్రం. పొట్టకూటి కోసం 30 సంవత్సరాల క్రితమే దొనబండ ఏరియాకు వచ్చి కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నీటి గుంటలో మునిగిన ఇద్దరు చిన్నారుల యృతదేహాలను బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

➡️