సమస్యలపై ఎన్నికలలో పార్టీలను నిలదీయండి

Apr 25,2024 14:01 #Eluru district
  •  జన చైతన్య యాత్రలో వక్తలు, కళాకారులు ఉద్ఘాటన

ప్రజాశక్తి- చింతలపూడి(ఏలూరు) : ప్రస్తుత పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఎదుర్కొంటున్న సమస్యలు,వాటి పరిష్కారాల గురించి ఓటు కోసం వచ్చే పార్టీలను నిలదీయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు-కూలీ సంఘం రాష్ట్ర నాయకులు సింగోతి నాగేంద్రరావు, కొండా దుర్గారావులు అన్నారు. నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు ఏప్రిల్‌ 14 నుండి మే 5 వరకు 20 రోజులు పాటు సాగుతున్న జన చైతన్య యాత్ర ఈ రోజు ఉదయం చింతలపూడి చేరుకొని ప్రధాన కూడలిలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తూ ఆనాటి కేంద్ర ప్రభుత్వం శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా అనేక హామీలు ఇచ్చిందని తదుపరి అధికారంలోకి వచ్చిన మోడీ, బిజెపి ప్రభుత్వం, ప్రత్యేక హోదాను, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ, తదితర హామీల అమలు చేయలేదన్నారు. ఫలితంగా పారిశ్రామిక అభివృద్ధి ఆగిపోయిందని, ప్రజలకు ఉపాధి ఉద్యోగాలు కరువైపోయాయన్నారు. పారిశ్రామిక వ్యవసాయ రంగాలు మధ్య సమతుల్యతా సైతం దెబ్బతిని సాగురంగం సంక్షేమంలో కూరుకుపోయిందన్నారు. చింతలపూడి, టి నర్సాపురం తదితర ప్రాంతాల భూములకు సాగునీరు అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని, ఫలితంగా పచ్చగా కళ కళలాడాల్సిన గ్రామాలు వల్లకాడుగా మారాయి అన్నారు. ప్రజలు ఈ సమస్యలపై పార్టీలను నిలదీయడంతో పాటు ఎన్నికల అనంతరం ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు జెఎస్‌.భాస్కర్‌, కొండా రాము, బి.రమేష్‌, ప్రగతిశీల మహిళ సంఘం స్త్రీ విమక్తి నాయకురాలు బి.గంగా, అరుణోదయ కళాకారులు, మల్సూర్‌, సుధాకర్‌, రమేష్‌, రాకేష్‌ రాములు ,అరుంధతి ,రాజేశ్వరి, నిష తదితరులు పాల్గొన్నారు.

➡️