తాగు నీటి కష్టాలు

Nov 27,2023 23:22

– నీటికోసం రొడ్డు ఎక్కిన మహిళలు
-రాజకీయ కక్షతోనే నీళ్లివ్వడంలేదని ఆవేదన
– ఐదురోజులకొకసారి ఇస్తున్నారని ఆరోపణ
– నీటి వనరులున్న పట్టించుకోని అదికారులు
– మిగిలిన రోజుల్లో ట్యాంకర్లద్వారా కొనుగోలు చేస్తున్నారు.

ప్రజాశక్తి-కొండపి

జీవనానికి గాలి, నీరు, ఆహారం అవసరం. ప్రకృతిలో సహజ సిద్దంగా దొరికే గాలి, నీళ్లకు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రోజువారీ అవసరాలకు వాడుకునేం దుకు, త్రాగేందుకు సైతం నీటికి మండలంలోని మిట్టపాలెం గ్రామస్థులు అనేక కష్టాలు పడాల్సి వస్తుంది. అన్ని వసతులు ఉన్న నీటి కష్టాలకు అధికారుల వైఫల్యమే కారణమనేందుకు ఆ గ్రామమే ఉదాహరణ. ముసి నది ఏటి ఒడ్డున ఉన్న గ్రామం మిట్టాపాలెం. ఆ గ్రామంలో రెండు మంచినీటి పథకాల ట్యాంకు ఏర్పాటు చేశారు. ఆ ట్యాంకులకు ముసి నుంచి పైపు లైన్లు ద్వారా మంచినీటిని తెస్తున్నారు. కాని ఆ మోటార్లు ఇప్పుడు మరుగునపడ్డాయి. టిడిపి ప్రభుత్వం హాయాంలో రామతీర్థం జలాశయాల నుంచికొండపిలో స్టోర్‌ చేసి అక్కడ నుంచి నియోజకవర్గం లోని 27గ్రామాలకు నీటిని అందించారు. 27గ్రామాల్లో మిట్టపాలెం ఒకటి. ఆ నీటిని ఒక ఓవర్‌ హెడ్‌ ట్యాంకుకు నింపి కుళాయిలకు వదిలేవారు. వైసిపి అధికారానికి వచ్చిన తరువాత మంచినీటి కష్టాలు రోజురోజుకు పెరుగుతు న్నాయని గ్రామస్థులు అంటున్నారు. గత కొన్ని నెలల నుంచి ఐదు రోజులకు ఒకసారి నీళ్లిస్తున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. మిగిలిన రోజుల్లో ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేసుకుంటున్నారు. మంచినీరు అందక పశుపక్ష్యాదులు సైతం అల్లాడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులు మునుపెన్నడు చూడలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అదికారులు, ప్రజాప్రతినిదులు స్పందించి ఆదుకుంటారని ఎదురు చూస్తున్నారు. అయితే పట్టించుకున్న దాఖలాలు లేవని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఉన్న ఒక్క బోరు కూడా పనిచేయడం లేదు. పంచాయితీ అధికారులు వదిలే నీరే గ్రామస్థులు దిక్కని అంటున్నారు. గ్రామంలో పేరుకు కుళాయిలు ఏర్పాటు చేశారు. చుక్క నీళ్లు రావు. నీటి పన్ను బలవంతంగా వసూళ్లు చేస్తారు. కనీసం నీటి పన్నుతోనైనా ఇంటింటికి నీళ్లు వచ్చేలా ఏర్పాటు చేయాలని అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఉపయోగం లేదని వాపోయారు. ఎప్పడు నీళ్లు వదులుతారో మాకు తెలియదు. వచ్చిన నీళ్లు అందరికీ సరిపోవడంలేదని చెబుతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తాగునీటిని ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

అలంకార ప్రాయంగా మంచినీటి పథకాలు

గ్రామంలో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన మంచినీటి పథకాలు అలంకార ప్రాయంగా మారాయి. దానినుండి నీళ్లిచ్చి రోజులు గడిచిపోయాయి. నీటి పధకం ఉందన్న ఆలోచన కూడా ప్రజలు మర్చిపోయారు. కనీసం వాడుకునేందుకు బోర్లు నీరు లేక అల్లాడిపోతున్నారు.

పంచాయితీ కార్యదర్శిని చూసి ఆర్నెళ్లు

తమ గ్రామ పంచాయితీ కార్యదర్శిని చూసి 6నెలల అవుతుందని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోని అదికారులు ఎందుకు అంటూ గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయం వత్తిళ్ల కారణంగా సామన్యులను బలిపశువులను చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

మాకు వాలంటీర్లు ఎక్కడ

మిట్టపాలెం గ్రామానికి ఐదుగురు వాలంటీర్లు ఉంటే వారిని సస్పెండ్‌ చేశారు. గతంలో అశోక్‌బాబు గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో వాలంటీర్లు పాల్గొనలేదని వారిని సస్పెండ్‌ చేశారని గ్రామస్థులు చెబుతున్నారు. ఆ తర్వాత ఇంత వరకు ఎవరిని నియమించలేదు. వాలంటీర్లు ఉంటే కొంతైన తీర్చేవారని అంటున్నారు.

ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోవడంలేదు

మంచినీటి సమస్యపై ఎవరికి పిర్యాదు చేసిన పట్టించు కోలేదని గూడూరి అన్నపూర్ణ పేర్కొన్నారు. ఎంపిడిఒకు చెప్పుకు న్నా స్పందించలేదు. అదికారు లకు మా గ్రామంపై ఎందుకు అంత కక్ష. కరెంటు సక్రమంగా ఉండదు. 6నెలల నుంచి మంచినీరు లేక చాలా ఇబ్బం దులు పడుతున్నాం.

రాజకీయ కక్షతో అన్ని వసతులు నిలిపేస్తున్నారు

గ్రామంలో ఉండే రాజకీయ కక్ష కారణంగా అన్ని వసతులు నిలివేస్తు న్నారని రావెళ్ల వెంకట రమణయ్య అన్నారు. ఇంటికి వచ్చే సరికి మంచినీరు లేక అనేక ఇబ్బం దులు పడుతున్నాం. ఎండిఒకు 4సార్లు అర్జీలు ఇచ్చిన నీళ్లు ఇవ్వలేదు. కార్యదర్శి ఎవరో తమకు ఇప్పటి వరకు తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గ్రామంలో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని అంటున్నారు.

➡️