సమస్యలశ్రీ పాణ్యం నియోజకవర్గ అభివృద్ధి పట్టని పాలకులు

May 4,2024 18:14 #cpm, #cpm pracharam, #Kurnool
  •  ఏళ్లుగా పాతుకుపోయిన సమస్యలు తిష్ట

ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : పాణ్యం నియోజకవర్గంలో సమస్యలు తిష్ట వేశాయి. ఏళ్లుగా పాలకులు అభివృద్ధికి చర్యలు తీసుకోకపోవడంతో సమస్యలు పేరకు పోయాయి. పాలకుల నిర్లక్షంతో ప్రజలకు సమస్యలు తప్పడం లేదు. కల్లూరు మండలంలో మంచినీరు, రోడ్ల సమస్య తీవ్రంగా ఉంది. చిన్నరాయునితిప్ప రిజర్వాయర్‌ పూర్తయినా కాలువలు లేవు. ఎల్‌ఎల్‌సి నీటిని గాజులదిన్నె ద్వారా నింపాలని అనుకున్నా పనులు అసంపూర్తిగా ఉన్నాయి. కాలువలు కూడా పూర్తి కావడం లేదు. హంద్రీ నది పరివాహక ప్రాంతమైన తొగర్చేడు దగ్గర రిజర్వాయర్‌ నిర్మిస్తే తాగునీటి సమస్య, సాగునీటి సమస్య పరిష్కరించవచ్చు. ఉలిందకొండ చెరువును హంద్రీనీవా సుజల స్రవంతి నీటి ద్వారా నింపితే వందల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. ఉలిందకొండ చెరువును నింపితే బొల్లవరం, బస్తిపాడుకు సాగునీరు, లక్ష్మీపురం, పందిపాడు, పెద్దపాడుకు గ్రామాల్లో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించవచ్చు. తుంగభద్ర పైపులు లీక్‌కావడం వల్ల లక్ష్మీపురానికి కలుషిత నీరు వస్తున్నాయి.
ఓర్వకల్లు మండలంలో పరిశ్రమల హబ్‌ ఏర్పాటు చేస్తామన్నా పరిశ్రమల జాడ లేదు. దీంతో స్థానికులకు ఉపాధి లేకుండా పోయింది. పరిశ్రమల ఏర్పాటు పేరుతో ఎపిఐఐసి భూములు తీసుకున్నారు. వాటికి సరైన పరిహారం ఇవ్వడం లేదు. హంద్రీ నది పక్కనే ఉన్న ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు కరువయ్యాయి. స్టీల్‌ పరిశ్రమ పేరుతో 20వేల ఎకరాలకు పైగా భూములు తీసుకున్నారు. వాటికి సరైన పరిహారం ఇవ్వడం లేదు. వ్యవసాయ భూములను తీసుకో వడం వల్ల ఆ ప్రాంత ప్రజలు సుదూర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. ఉయ్యాలవాడలో గ్రీన్‌కో సోలార్‌ పరిశ్రమ పేరుతో 2వేల ఎకరాలను తీసుకున్నారు. దాంతో పశువులకు మేత లేని పరిస్థితి ఏర్పడింది. చివరికి ఊరు ఖాళీ చేయాల్సిన దుస్థితి తలెత్తింది. విద్యుత్‌ తీసుకుపోవడానికి కోడుమూరు వరకూ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సాగునీటి బోర్లు వేసుకోవడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భూముల ధరలు కూడా పడిపోయాయి. ఉపాధినిచ్చే పరిశ్రమలు రావడం లేదు.
పాణ్యం మండలం పిన్నాపురంలో పవన, సోలార్‌ పేరుతో గ్రీన్‌కో పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. పేదలు దగ్గర భూములు తీసుకుని పట్టాలు లేవనే పేరుతో వారికి పరిహారం ఇవ్వడం లేదు. కొండజూటూరు వద్ద నానో కెమికల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చూస్తే గ్రామస్థులు అడ్డుకోవడం, పోరాటాల వల్ల వెనక్కి తగ్గారు. గోరుకల్లు వద్ద 12 టిఎంసిల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించారు. ప్రస్తుతం 3 టిఎంసిల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నారు. రిజర్వాయర్‌ నుంచి నీళ్లు ఇళ్లలోనికి బుగ్గలుగా రావడంతో ఇళ్లు దెబ్బతింటున్నాయి.
పాణ్యం, ఓర్వకల్లు మండలాల్లో నకిలీ పత్తి విత్తనాలు రైతులను నిండా ముంచుతున్నాయి. గడివేముల మండలంలో గతంలో గని, పైసోముల ప్రాంతాల్లో సోలార్‌ కోసం భూములను లాక్కున్నారు. పరిహారం ఇవ్వడం లేదు. సోలార్‌ బాధితులకు పరిహారం ఇవ్వాలని సిపిఎం అగ్రనాయకులు ప్రకాష్‌కరత్‌, బివి రాఘవులు, పి మధు, ఎంఎ గఫూర్‌ పోరాటం చేసేందుకు వస్తే వారిపై 42 కేసులు నమోదు చేశారు. తెలుగు గంగ పక్కనే ఉన్నా తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న కాటసాని రాంభూపాల్‌ రెడ్డి.. తాగునీరు, రోడ్ల సమస్యలను పరిష్కరించలేదు. మారుమూల గ్రామాల కు రోడ్లు లేక వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న కాటసాని రాంభూపాల్‌రెడ్డి భూములు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయకపోగా పేదల భూములు లాక్కున్నారన్న ఆరోపణలు వెల్లువెతున్నాయి.

➡️