సీజనల్‌ వ్యాధులను అరికట్టాలి

Jun 29,2024 20:08

రైతులకు సకాలంలో విత్తనాలు అందించాలి

జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-విజయనగరం : మలేరియా, డెంగ్యూ, డయేరియా తదితర సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు అన్నిరకాల ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. స్థాయి సంఘ సమావేశాలు జెడ్‌పి సమావేశ మందిరంలో శనివారం జరిగాయి. 1,2,3,4,7వ స్థాయి సంఘ సమావేశాలు జెడ్‌పి ఛైర్మన్‌ శ్రీనివాసరావు అధ్యక్షతన, 5వ స్థాయి సంఘ సమావేశం ఆ సంఘ ఛైర్‌పర్సన్‌ ఎస్‌.శాంతకుమారి అధ్యక్షతన, 6వ స్థాయి సంఘ సమావేశం ఛైర్మన్‌ కొర్రజన్ని సింహాచలం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా వైద్యారోగ్యశాఖపై సమీక్షలో భాగంగా సీజనల్‌ వ్యాధులను అరికట్టడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై చర్చ జరిగింది. సాధారణంగా ఏ ప్రాంతంలో ఎక్కువగా సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తాయో, ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను జెడ్‌పి చైర్మన్‌ ఆదేశించారు. ముఖ్యంగా మలేరియా వ్యాప్తి చెందే గిరిజన ప్రాంతాల్లో దోమల నివారణా చర్యలను వెంటనే ప్రారంభించాలన్నారు. ప్రత్యేక పారిశుద్య కార్యక్రమాలను నిర్వహించి, కాలువల్లో మరుగునీరు లేకుండా చూడాలని, దోమల నివారణా మందులు పిచికారీ చేయడంతోపాటు, ఫాగింగ్‌ చేపట్టాలని, చెరువులు, మురికిగుంటల్లో గంబూషియా చేప పిల్లలను వేయాలని సూచించారు. అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలంలో ఎక్కువగా మలేరియా ఉందని, ఆ ప్రాంత అధికారులను కూడా అప్రమత్తం చేయాలని సూచించారు. ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని, ప్లేట్‌లెట్స్‌ను కూడా అందుబాటులో ఉంచాలని చెప్పారు. బాడంగి, గజపతినగరం, మక్కువ జెడ్‌పిటిసి సభ్యులు తమ ప్రాంతంలోని సమస్యలను వివరించారు. వర్షాలు సక్రమంగా కురుస్తున్నందున, రైతులు విత్తనాలకు, ఎరువులకు ఇబ్బంది పడకుండా చూడాలని వ్యవసాయశాఖాధికారులను చైర్మన్‌ ఆదేశించారు. ముందుగానే విత్తనాలు, ఎరువులను తరలించి, ఆర్‌బికెల్లో, గోదాముల్లో రైతులకు పంపిణీ చేసేందుకు వీలుగా అందుబాటులో ఉంచాలన్నారు. సొసైటీలకు పాలకవర్గాలు లేనందున, ఎరువుల పంపిణీలో దుర్వినియోగం జరగకుండా, సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖకు సంబంధించిన అంశాలపై శాంతకుమారి, . సాంఘిక సంక్షేమశాఖలకు సంబంధించిన అంశాలపై కె.సింహాచలం సమీక్షించారు. ప్రవేశాలు, ఫలితాలు, అవసరాలను బట్టి బిసి సంక్షేమశాఖకు చెందిన 3, సాంఘిక సంక్షేమశాఖకు చెందిన 3 ప్రభుత్వ ప్రీమెట్రిక్‌ హాస్టళ్లను ఎంపిక చేసి, వాటి అభివృద్ధికి ప్రణాళికలను రూపొందిస్తే నిధులను మంజూరు చేస్తామని జెడ్‌పి చైర్మన్‌ హామీ ఇచ్చారు. సమావేశంలో ఎంఎల్‌సి డాక్టర్‌ సురేష్‌బాబు, జెడ్‌పి సిఇఒ శ్రీధర్‌రాజా, డిప్యూటీ సిఇఒ రాజ్‌కుమార్‌, రెండు జిల్లాల జెడ్‌పిటిసి సభ్యులు, కమిటీ మెంబర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️