కూటమిలో ‘పరిపూర్ణ’ంగా విభేదాలు.!

పరిపూర్ణానంద స్వామి

           హిందూపురం : కూటమిలో సీట్ల సర్ధుబాటు ప్రక్రియ పూర్తయ్యింది. ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్‌, 14 అసెంబ్లీ స్థానాలకు ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో భాగంగా ధర్మవరం బిజెపికి కేటాయించగా, మిగిలిన రెండు పార్లమెంట్‌, 13 అసెంబ్లీ స్థానాల్లో టిడిపి పోటీ చేయనుంది. హిందూపురం పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలో దిగేందుకు కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామీజీ ఏడాది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపి, టిడిపి మధ్య పొత్తు కుదిరితే వారికి ఉన్న ఓటు బ్యాంకుతో గెలుపొందవచ్చు అని ఆశించారు. అందులో భాగంగానే పలుమార్లు ఆయన హిందూపురం పార్లమెంట్‌ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. గత నెలలో తాను కూటమి అభ్యర్థిగా హిందూపురం పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలో ఉంటానని ప్రకటన కూడా చేశారు. ప్రకటన అయితే చేశారు గానీ టికెట్‌ను తెచ్చుకోలేకపోయారు. ఈ స్థానాన్ని పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బికె.పార్థసారధికి కేటాయిస్తూ టిడిపి నిర్ణయం తీసుకుంది. పరిపూర్ణానంద పురం పార్లమెంట్‌ టికెట్‌ కోసం దేశరాజధాని స్థాయిలో బిజెపి పెద్దలతో మంతనాలు చేసినట్లు తెలుస్తోంది. పరిపూర్ణానందకు పార్లమెంట్‌ టికెట్టు ఇస్తే ఎంపీ సీటుతో పాటు దాని పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులపై ప్రభావం పడి ఓడిపోయే ప్రమాదం ఉందని టిడిపి నేతలు బిజెపి పెద్దలకు వివరించినట్టు సమచారం. ఈ నేపథ్యంలో చివరి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసిన పరిపూర్ణానంద స్వామికి మాత్రం టికెట్టు దక్కలేదు. పరిపూర్ణానంద రాజకీయంగా ఎదగాలన్న ఉద్ధేశంతో గత కొన్ని నెలలుగా హిందూపురం పార్లమెంటు, అసెంబ్లీ కేంద్రంగా ప్రత్యేక దష్టి సారించారు. రాజకీయంగా ఎన్నికల్లో పోటీ చేయాలన్న సంకల్పంతో పలు కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. బిజెపి టికెట్‌పై పోటీ చేస్తానని కూడా ఆయన అనుయాయుల వద్ద పలుమార్లు తెలియజేశారు. రాష్ట్రంలో టిడిపి, బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడడంతో ఈ మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బిజెపి నుంచి తానే పోటీలో ఉంటానని కూడా ప్రకటనలు చేస్తూ వచ్చారు. కూటమి ఈయన ఆశలపై నీళ్లు చల్లి, టిడిపి అభ్యర్థిని ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా పరిపూర్ణానందస్వామి అయోమయంలో పడ్డారు. టికెట్‌ దక్కకపోవడంతో కూటమిపై ధిక్కార స్వరం విన్పిస్తున్నారు. టికెట్టు దక్కకపోవడంతో పరిపూర్ణానంద తనదైన శైలిలో టిడిపి, బిజెపి, జనసేనపై విమర్శలు ఎక్కుపెట్టారు. హిందూపురం పార్లమెంట్‌తో పాటు హిందూపురం అసెంబ్లీ రెండు స్థానాల్లోనూ స్వతంత్ర అభ్వర్థిగా బరిలో దిగుతానంటూ ఆయన ప్రకటన చేశారు. తనకు టికెట్టు దక్కకుండా చేసిన టిడిపి కూటమి అభ్యర్థులను ఓడించి తీరుతానంటూ ప్రతినబూనారు. పరిపూర్ణానంద ప్రకటనతో ఒక్కసారిగా కూటమిలో కలవరం మొదలైంది. పరిపూర్ణానంద స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే కూటమి అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందా… అన్న లెక్కలను టిడిపి, బిజెపి నాయకులు వేసుకుంటున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే విషయంపై నేడు(ఆదివారం) పట్టణంలో తన సన్నితులతో సంప్రదింపులు జరిపేందుకు ఆత్మీయ సమావేశాన్ని పరిపూర్ణానంద ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సమావేశం వివరాలను అయితే అధికారంగా ప్రకటించలేదు.

బిజెపి సహకారం అంతంతమాత్రమే..!

           తన సిద్ధాంతాలు, బిజెపి సిద్ధాంతాలు ఒకటే అయిన నేపథ్యంలో తాను ఆ పార్టీ నుంచి పోటీ చేస్తానని ముందునుంచి పరిపూర్ణానంద చెబుతూ వస్తున్నారు. బిజెపి మాత్రం ఆయనకు టికెట్టు ఇవ్వకుండా చేయి ఇచ్చింది. ఇక స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకుల నుంచి సహకారం అంతంత మాత్రంగానే ఉండే పరిస్థితి హిందూపురంలో కన్పిస్తోంది. కేవలం ఒక వర్గం నాయకులు మాత్రమే ఆయనకు మద్దతుగా ఉంటున్నారు. ఈ మద్దతును కూడా వారు బహిరంగంగా ప్రకటించడం లేదు. ఒకవేళ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే స్థానిక బిజెపి నేతల నుంచి ఎలాంటి సహకారం ఉంటుందనేది ప్రశ్నార్థకంగానే ఉంది. పరిపూర్ణానంద పోటీలో ఉంటే మాత్రం కూటమి ఓట్లకు గండిపడే అవకాశం ఉందనే భావనను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్‌ పరిధిలో కదిరి, హిందూపురం, ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ముస్లిం, మైనార్టీలు తనకు మద్దతుగా నిలుస్తారనే ధీమాను ఆయన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో హిందూపురం కూటమికి కొరకరాని కొయ్యగా మారిన పరిపూర్ణానందను బిజెపి అధిష్టానం ఏ మేరకు శాంతిపజేస్తుందన్నది వేచి చూడాల్సి ఉంది.

➡️