వైసిపికి గుణపాఠం తప్పదు : బాలకృష్ణ

లేపాక్షిలో వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

           చిలమత్తూరు : ప్రజా సంక్షేమాన్ని అన్ని విధాలా గాలికొదిలేసి పాలన సాగిస్తున్న వైసిపి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం పరిధిలోని లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో గురువారం పర్యటించారు. లేపాక్షి మండలం సిరివరం గ్రామం, చిలమత్తూరు మండల పరిధిలోని కొడికొండ చెక్‌పోస్టు వద్ద ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత వాటర్‌ ప్లాంట్‌లను ప్రారంభించారు. ఒక్కొక్కటి రూ.8 లక్షల వ్యయంతో వీటిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ వేసవి కాలం సమీపిస్తున్న వేళ ప్రజలకు తాగునీటి కష్టాలు ఉండకూడదనే ఉద్ధేశంతో వాటర్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఇక అధికార వైసిపి ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బాలకృష్ణ పర్యటన నేపథ్యంలో కొడికొండ చెక్‌పోస్టు వద్ద టిడిపి నాయకులు చిన్నారులతో కలిసి క్రేన్‌తో భారీ గజమాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్‌ నాయకులు అంబికా లక్ష్మినారాయణతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️