నైతిక విలువలు ఉంటే వెంటనే రాజీనామా చేయండి

Jun 29,2024 21:53

 సమావేశంలో మాట్లాడుతున్న రత్నప్ప చౌదరి

                  పుట్టపర్తి అర్బన్‌ : ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా మున్సిపాలిటీ చైర్మన్‌ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని టిడిపి కౌన్సిలర్‌ ఫ్లోర్‌ లీడర్‌ రత్నప్ప చౌదరి డిమాండ్‌ చేశారు. శనివారం మున్సిపాలిటీ అత్యవసర సమావేశం చైర్మన్‌ తుంగ ఓబుళపతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రత్నప్ప చౌదరి మాట్లాడుతూ ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో మునిసిపాలిటీలో టిడిపికి 4700 ఓట్లు మెజార్టీ వచ్చిందన్నారు. దీనిని రెపరండంగా తీసుకొని వైసిపి చైర్మన్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాంద్‌ చేశారు. చైర్మన్‌ మాట్లాడుతూ కౌన్సిల్‌ సమావేశంలో ప్రజల సమస్యలు సమావేశంలో చర్చించాలి తప్ప రాజకీయాలు చేయడం తగదన్నారు. దీంతో రత్నప్ప చౌదరి మాట్లాడుతూ తాగునీరు, వీధిలైట్లు, పారిశుధ్యం తదితర సమస్యలపై ప్రశ్నించారు. చైర్మన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రెండవ వార్డులో నీటి సమస్య పరిష్కరించాలని ఇటీవల అవార్డు మహిళలు మున్సిపల్‌ కార్యాలయం ముందు నిరసన తెలిపారని గుర్తు చేశారు. వైసిపి కౌన్సిలర్లు చెరువు భాస్కర్‌ రెడ్డి, సూర్య గౌడ్‌ మాట్లాడుతూ మూడు నెలల నుంచి ఏఈని నియమించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొడి చెత్త తడి చెత్త తీసుకెళ్లే వాహనాలు కొత్తవి ఉన్నా అవి నిరుపయోగంగా పడి ఉన్నాయన్నారు. కౌన్సిలర్‌ లక్ష్మీపతి మాట్లాడుతూ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో నీటి సమస్య, పారిశుధ్యం లోపించడం సరికాదన్నారు. గోకులం వెంకటరమణ మాట్లాడుతూ పారిశుధ్యం పై తాము ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు. కమిషనర్‌ అంజయ్య మాట్లాడుతూ అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు అయినందున తాము గట్టిగా చెప్పలేకపోతున్నామన్నారు. నిధులు ఉన్న పారిశుధ్యం, వీధి దీపాలు, తాగునీరు సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని చైర్మన్‌ ఓబుళపతి అధికారులను ప్రశ్నించారు. సభ్యులు సభ దృష్టికి తెచ్చిన సమస్యలు పరిష్కరిస్తామని కమిషనర్‌ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్సెపెక్టర్‌ సోమశేఖర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ నరసింహులు, వైస్‌ చైర్మన్లు శ్రీ లక్ష్మీ నారాయణ రెడ్డి, తిప్పన్న తదితరులు పాల్గొన్నారు.

➡️