తాడిపత్రికి వ్యవసాయకళాశాలనిస్తాం..

Apr 28,2024 22:28

తాడిపత్రి బహిరంగ సభలో మాట్లాడుతున్న సిఎం జగన్మోహన్‌రెడ్డి

                  అనంతపురం ప్రతినిధి : ఈ ఐదేళ్ల పాలనలో సంక్షేమాన్ని నేరుగా ప్రజలకు అందించామని, అదే విధంగా తాము అధికారంలోకి వస్తే తాడిపత్రికి వ్యవసాయ కళాశాలను మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి హామీనిచ్చారు. ఆదివారం తాడిపత్రిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. తాడిపత్రి పట్టణంలోని వైఎస్‌ఆర్‌ సర్కిల్‌లో జరిగిన బహిరంగ సభకు పెద్దఎత్తున జనం తరలొచ్చారు. ఈ సభలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించడంతోపాటు తాడిపత్రిలోని అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఇచ్చిన హామీల్లో 99 శాతం పూర్తి చేసామని చెప్పారు. ప్రజలకు మరింత మేలు జరగాలంటే వైసిపిని గెలిపించాలని కోరారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిని విమర్శించారు. మరోమారు మోసం చేయడానికే ఆ మూడు పార్టీలు జతకట్టాయని విమర్శించారు. గతంలో 2014లో ఇదే రకంగా జతకట్టి వచ్చి హామీలిచ్చి మోసం చేసారని దుయ్యబట్టారు. 2014 మెనిఫెస్టోను చూపించారు. రైతుల రుణాలుమాఫీ చేస్తానని, మహిళా సంఘాల రుణాలు మాఫీ చేస్తానని ఇలా అనేక హామీలిచ్చి అమలు చేయలేదని చెప్పారు. ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలోనూ ముగ్గురు కలసి ప్రజల ముందుకు సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవన్‌ అంటూ మయ మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చంద్రముఖి లాంటోడని అతడిని మళ్లి తెచ్చుకునే ప్రయత్నం చేయొద్దని సూచించారు. వీరి మాటలను నమ్మవద్దని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ వైసిపి అని పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమ పాలనను అందించామన్నారు. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి నేరుగా లబ్దిదారుల ఇంటి వద్దకే పథకాలు అందించే కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ ఐదేళ్లలో రూ.2.70 లక్షల కోట్ల నిధులను నగదు బదిలీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందజేసామన్నారు. విద్య, వైద్యంలోనూ సమూలమైన మార్పులు తీసుకొచ్చామని వివరించారు. ఆంగ్ల విద్యను అందించడం ద్వారా రాబోయే తరం పూర్తిగా నైపుణ్యవంతంగా మారుతుందని చెప్పారు. ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న వైసిపికి మరోమారు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధికి అవరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. వైసిపి అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి అభ్యర్థన మేరకు ఇక్కడ వ్యవసాయ కళాశాల ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసిపి ఎంపీ అభ్యర్థి శంకర నారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️