సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం

శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎన్నికల పరిశీలకులు అన్బు కుమార్‌

       పుట్టపర్తి అర్బన్‌ : ఎన్నికల్లో సూక్ష్మ (మైక్రో) పరిశీలకుల పాత్ర కీలకం అని సత్యసాయి జిల్లా ఎన్నికల పరిశీలకులు అన్బు కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం స్థానిక సాయి ఆరామం అతిథి గహంలో జిల్లాలోని సూక్ష్మ పరిశీలకులకు ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి అరుణ్‌ బాబు, డిఆర్‌ఒ కొండయ్య, గ్రామ వార్డు సచివాలయాల నోడల్‌ అధికారి శివారెడ్డి, కదిరి డిఎల్‌డిఒ సూర్యనారాయణ, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్‌ మైముద్దీన్‌, మాస్టర్‌ ట్రైనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా నిర్వహించడంలో సూక్ష్మ పరిశీలకులు బాధ్యతగా పనిచేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ రహస్యంగా ప్రశాంతంగా జరగాలన్నారు. ఓటరు మినహా ఇతరులను అనుమతించరాదన్నారు. ఎక్కడైనా హింసాత్మక ఘటనలు జరిగితే సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు, పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఏదైనా సమస్య ఎదురైతే తమకు నేరుగా సంప్రదించవచ్చన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద నిరంతర నిఘా ఉంటుందని, పోలింగ్‌ కేంద్రాల వద్ద వెబ్‌ కాస్టింగ్‌ వీడియో చిత్రీకరణ ఉంటుందన్నారు. మే 12న పోలింగ్‌ సామగ్రి పంపిణీ ఉంటుందని కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షణ ఉంటుందని ఆయన వెల్లడించారు. అనంతరం కలెక్టర్‌ అరుణ్‌ బాబు మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమంలో ఎలాంటి సందేహాలు ఉన్న నివత్తి చేసుకోవాలన్నారు. పోలింగ్‌ రోజున ఓటింగ్‌ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మైక్రో అబ్జర్వర్లు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలన్నారు. ఓటింగ్‌ ప్రారంభానికి 90 నిమిషాల ముందే మైక్రో పరిశీలకులు పోలింగ్‌ స్టేషన్‌ లో ఉండాలని సూచించారు. మాస్టర్‌ ట్రైనర్లు విధివిధానాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేశారు. ఈవీఎం, వివి ప్యాడ్స్‌ పై డెమో ద్వారా అవగాహన కల్పించారు.

➡️