అసమ్మతుల దారెటు?

జిల్లాలో అధికార వైసిపికి ఇబ్బందికరం గా ఉన్న నియోజకవర్గాల్లో

పొందూరు మండలం రాపాకలో ప్రచారం చేస్తున్న సువ్వారి గాంధీ

టిక్కెట్ల ప్రకటనతో భంగపడ్డ వైసిపి ఆశావహులు

రకరకాల ప్రయత్నాల్లో నాయకులు

ఇండిపెండెంట్లుగా కొందరు

టిడిపికి మద్దతు పలకాలని మరికొందరు నిర్ణయం

వైసిపి అభ్యర్థుల ప్రకటనతో అసమ్మతులు రకరకాల ప్రయత్నాలు సాగిస్తోంది. టిక్కెట్లు వస్తాయని గట్టి నమ్మకంతో ఉన్న నాయకులు జాబితాలో పేరు లేకపోవడంతో భంగపాటు గురయ్యారు. పార్టీ నిర్ణయంపై కొంత మంది నాయకులు వెంటనే స్పందించి తమ పదవులకు రాజీనామా చేశారు. మరికొంత మంది తమవర్గం నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారు. వీరిలో కొందరు ఇండిపెండెంట్లుగా బరిలో దిగాలని నిర్ణయించారు. ఆమదాలవలస నియోజకవర్గంలో వైసిపి మాజీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సువ్వారి గాంధీ ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. కొంతమంది అసమ్మతివర్గం నాయకులు తమ ఎమ్మెల్యేను ఈ సారి ఎన్నికలో ఎలాగైనా ఓడించాలనే కసితో టిడిపి అభ్యర్థికి లోపాయికారిగా మద్దతు పలికేందుకు సైతం సిద్ధమవుతున్నారు.

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

జిల్లాలో అధికార వైసిపికి ఇబ్బందికరం గా ఉన్న నియోజకవర్గాల్లో ఆమదాలవలస, ఎచ్చెర్ల, నరసన్నపేట, పాతపట్నం ఉన్నాయి. ఆమదాలవలస లో శాసనస స్వీకర్‌ తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యుల వైఖరిపై గత కొంతకాలంగా నియోజకవర్గ నాయకులు తీవ్ర అసమ్మతితో రగిలిపోతున్నారు. నియోజకవర్గంలో పోటాపోటీ కార్యక్రమాలు చేస్తూ తమ్మినేని సవాల్‌ విసిరారు. టిక్కెట్‌ కోసం అన్ని రకాల ప్రయత్నాలు సాగించారు. ఒకానొక దశలో తమ్మినేని సీటు ఇవ్వరనే ప్రచారమూ సాగింది. పార్టీ అధిష్టానం మాత్రం తమ్మినేని సీతారాం వైపే మొగ్గుచూపింది. దీనిపై అసమ్మతి నాయకులు భగ్గుమన్నారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సువ్వారి గాంధీ పార్టీకి రాజీనామా చేశారు. ఇండిపెండెంట్‌గా బరిలో దిగాలని నిర్ణయించారు. ఇప్పటికే పొందూరు మండలం రాపాకలో ప్రచారం మొదలు పెట్టారు.ఎచ్చెర్లలో ఇండిపెండెంట్‌గా అసమ్మతి వర్గం అభ్యర్థిఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొర్లె కిరణకుమార్‌కు టిక్కెట్‌ రావడంపై అసమ్మతివర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యే తీరుపై అక్కడి కేడర్‌ తీవ్ర అసమ్మతితో రగిలిపోతోంది. జగన్‌ ముద్దు… కిరణ్‌ వద్దు అంటూ నినదించారు. అభ్యర్థిని మార్చకపోతే ఓడిస్తామంటూ అధిష్టానానికి ఆల్టిమేటం సైతం జారీ చేశారు. వీటిని ఏ మాత్రం పట్టించుకోని అధిష్టానం ఎచ్చెర్ల స్థానానికి కిరణ్‌కుమార్‌కే మళ్లీ అవకాశం ఇచ్చింది. అధిష్టానం నిర్ణయంపై మండిపడ్డ అసమ్మతివర్గ నాయకులు సమావేశమై ఎచ్చెర్ల వైస్‌ ఎంపిపి ప్రతినిధి, మాజీ సర్పంచ్‌ జరుగుల శంకరరావును ఇండిపెండెంట్‌గా బరిలో దించాలని నిర్ణయించినట్లు తెలిసింది. పాతపట్నంలో ఆచితూచి వ్యవహరిస్తున్న వ్యతిరేక గ్రూపుజిల్లాలో తీవ్ర అసమ్మతిని ఎదుర్కుంటున్న అధికార పార్టీ ఎమ్మెలేల్లో రెడ్డి శాంతి మొదటి స్థానంలో ఉన్నారు. చాలా కాలంగా ఇక్కడి అసమ్మతి కార్యకలాపాలు తీవ్ర స్థాయిలో ఉన్నారు. ఎమ్మెల్యే తీరుకు వ్యతిరేకంగా పలు సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్యే నిర్వహించిన సమావేశాలను సైతం బహిష్కరించారు. అసమ్మతి కార్యకలాపాలు సాగిస్తున్నారంటూ జిల్లా కోశాధికారి లోతుగడ్డ తులసీప్రసాదరావు పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులూ ఎమ్మెల్యేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టిడిపి ప్రకటించనున్న అభ్యర్థి ఎవరనేది తేలితే వారికి మద్దతు పలకాలని నిర్ణయించినట్లు సమాచారంనరసన్నపేటలో గుంభనంగా అసమ్మతి వర్గీయులునరసన్నపేటలో వైసిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ సైతం తీవ్ర అసమ్మతిని ఎదుర్కుంటున్నారు. కృష్ణదాస్‌ ఒంటెత్తు పోకడలు, కుటుంబం వ్యవహారశైలిపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా రు. కృష్ణదాస్‌కు టిక్కెట్‌ ఇస్తే మాత్రం తాము సహకరించమంటూ ఒకానొక దశలో తేల్చిచెప్పారు. అభ్యర్థిని మార్చకపోతే తాము భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామంటూ అధిష్టానానికి ఆల్టిమేటం సైతం ఇచ్చారు. పార్టీ వీటిని లెక్క చేయకుండా ఎమ్మెల్యే కృష్ణదాస్‌ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. దీంతో అసమ్మతి వర్గం నాయకులు తలోదారి చూసుకుంటునట్లు తెలుస్తోంది. కొంతమంది టిడిపిలోకి వెళ్లాలని నిర్ణయించగా, మరికొందరు స్తబ్ధుగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలిసింది.

 

➡️