గ్రామీణ బంద్‌ విజయవంతం

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం

కోటబొమ్మాళి : ర్యాలీ నిర్వహిస్తున్న సిఐటియు నాయకులు, కార్మికులు

  • పారిశ్రామిక కార్మికుల సమ్మె సక్సెస్‌
  • జిల్లావ్యాప్తంగా ప్రదర్శనలు, బైక్‌ ర్యాలీలు
  • కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాల హోరుసంఘీభావం తెలిపిన వామపక్షాలు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి, యంత్రాంగం

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన శుక్రవారం చేపట్టిన గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మె విజయవంతమైంది. జిల్లావ్యాప్తంగా ప్రదర్శనలు, బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. మోడీ ప్రభుత్వ కార్మిక, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలని… పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని… నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలంటూ పెద్దపెట్టున నినదించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు ఆయా కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించి సమ్మెకు తమ మద్దతు తెలిపారు. జిల్లాలో పలుచోట్ల నిర్వహించిన ర్యాలీలకు వామపక్ష పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు.శ్రీకాకుళం నగరంలో ఏడు రోడ్ల కూడలి నుంచి జిటి రోడ్డు మీదుగా సూర్యమహల్‌ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. అక్కడ బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు. అనంతరం సభ నిర్వహించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి తాండ్ర అరుణ, ఎపి రైతుసంఘం జిల్లా అధ్యక్షులు పి.చందర్రావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.ప్రసాదరావు మాట్లాడారు. ఢిల్లీలో రైతాంగం చేసిన పోరాటం సందర్భంగా స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు పంటకు కనీస మద్దతు ధర చెల్లిస్తామన్న హామీని బిజెపి ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు. కేరళ తరహా రుణ విమోచన చట్టం తీసుకురావాలని, అన్ని బ్యాంకింగ్‌ సంస్థల నుంచి ఒకేసారి రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. మూడు రైతు చట్టాల రద్దు సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని సుదీర్ఘకాలంగా సంయుక్త కిసాన్‌ మోర్చా చేస్తున్న డిమాండ్లను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉపాధి హామీని ఎత్తివేయాలని బిజెపి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని చెప్పారు. సిఐటియు, రైతుసంఘం, బిఎస్‌ఎన్‌ఎల్‌, పోస్టల్‌, నాగార్జున అగ్రికం, పెన్షనర్స్‌, భవన నిర్మాణ, కళాసీ, జన విజ్ఞాన వేదిక, మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ యూనియన్లు, ప్రజాసంఘాల నాయకులు డి.కృష్ణారావు, ఎన్‌.గణపతిరావు, ఎం.గోవర్థనరావు, ఎల్‌.వరదరాజు, వై.గోపాలుడు, కె.సూరయ్య, కె.అప్పారావు, డి.పార్వతీశం, ఎం.ఆదినారాయణమూర్తి, డి.వి.టి రాజు తదితరులు పాల్గొన్నారు.బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్దసమ్మెలో భాగంగా బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు సూర్యమహల్‌ కూడలిలోని స్థానిక కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఎం.గోవర్థనరావు, పి.వెంకటరావు మాట్లాడారు. సమ్మెకు బిఎస్‌ఎన్‌ఎల్‌ పూర్వ జిల్లా కార్యదర్శులు వెంకటరావు పాణిగ్రాహి, ఎం రమేష్‌, పోస్టల్‌ ఉద్యోగ సంఘం నాయకులు గణపతి, జ్యోతీశ్వరరావు, చంద్రశేఖర్‌ సంఘీభావం తెలిపారుశ్రీకాకుళం ప్రధాన తపాలా కార్యాలయం వద్దనగరంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో పనిగంటలు ముగిసిన తర్వాత పోస్టల్‌ ఉద్యోగులు ఆందోళన నిర్వహించి కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పోస్టల్‌ ఉద్యోగ సంఘాల నాయకులు యు.వి రమణ, గణపతి, బాబూరావు, పోస్టల్‌ పెన్షనర్స్‌ సంఘం నాయకులు చంద్రశేఖర్‌, జ్యోతీశ్వరరావు, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.కోటబొమ్మాళిలో కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక హక్కులను కాలరాస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు విమర్శించారు. కొత్తపేట జంక్షన్‌ నుంచి కోటబొమ్మాళి రైతుబజారు వరకు నిర్వహించిన ర్యాలీకి సంఘీభావం తెలిపారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ కార్మికులు అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్‌ కోడ్లు తీసుకువచ్చిందన్నారు. కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి పలికి 12 గంటల పని విధానాన్ని అమల్లోకి తేవాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, స్కీమ్‌ వర్కర్లకు గ్రాట్యుటీ అమలు చేయాలని, కాంట్రాక్ట్‌, కార్మిక వ్యవస్థను రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు టెక్కలి డివిజన్‌ నాయకులు హెచ్‌.ఈశ్వరరావు, నాయకులు గొండు నీలన్న, బోర శ్రీనివాసరావు, సనపల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. రణస్థలంలో పైడిభీమవరం నుంచి రణస్థలం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించిన అనంతరం రామతీర్థం జంక్షన్‌ వద్ద నిరసన చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, నాయకులు ఎం.అప్పలనర్సయ్య, ఎం.ఈశ్వరరావు, డి.ఎల్‌ నాయుడు, పి.రామకృష్ణ, వి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్లలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, నాయకులు ఎన్‌.వి రమణ తదితరులు పాల్గొన్నారు.మందసలో ఎస్‌ఆర్‌ఎస్‌ఎం జెడ్‌పి హైస్కూల్‌ నుంచి వాసుదేవ ఆలయం కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. కొర్ల హేమారావు చౌదరి, మజ్జి బాబూరావు, కె.కేశవరావు, టి.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.వజ్రపుకొత్తూరులో నగరంపల్లిలో నిర్వహించిన ర్యాలీలో సిపిఎం నాయకులు ఎన్‌.మోహనరావు, రైతుసంఘం నాయకులు బి.రామకృష్ణ, కౌలురైతు సంఘం నాయకులు బి.ఆనందరావు, ఎన్‌.ఈశ్వరమ్మ, ఐద్వా నాయకులు బి.సుగుణవతి తదితరులు పాల్గొన్నారు.టెక్కలిలో తొలుసూరిపల్లి నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ధర్నా చేపట్టారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌ కార్యాలయ సూపరింటెండెంట్‌కు సమర్పించారు. కార్యక్రమంలో సిఐటియు, రైతుసంఘం నాయకులు కొల్లి ఎల్లయ్య, పోలారావు, బి.వాసు, ఎస్‌.కృష్ణ, భవణ నిర్మాణ సంఘం నాయకులు డి.లకీëనారాయణ, తిర్లంగి అప్పన్న, గ్రానైట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పోలయ్య, వికలాంగుల సంఘం నాయకులు జి.వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.కొత్తూరులో మండల కేంద్రంలో చేపట్టిన ప్రదర్శనలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్‌, పలు సంఘాల నాయకులు చిన్నారావు, రాజు, జ్యోత్స్న, గౌరమ్మ, నిమ్మక అప్పతన్న తదితరులు పాల్గొన్నారు.పలాసలో ఆర్‌టిసి కాంప్లెక్స్‌ నుంచి కాశీబుగ్గ పాతబస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు, సిఐటియు నాయకులు ఎన్‌.గణపతి, జీడిరైతుల సంఘం జిల్లా కన్వీనర్‌ టి.అజరుకుమార్‌, పలు సంఘాల, వామపక్షాల నాయకులు సిహెచ్‌.వేణుగోపాల్‌, వి.మాధవరావు, టి.సన్యాసిరావు, ఎం.రామారావు, పి.కుసుమ తదితరులు పాల్గొన్నారు.పొందూరులో వ్యవసాయ మార్కెట్‌ యార్డు జంక్షన్‌ వద్ద ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, మండల కన్వీనర్‌ అప్పలనాయుడు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ మండల కార్యదర్శి బి.జ్యోతి, ఎ.అనురాధ, డి.తవిటమ్మ తదితరులు పాల్గొన్నారు.సోంపేటలో జామి ఎల్లమ్మ గుడి నుండి ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. సిఐటియు జిల్లా కార్యదర్శి సంగారు లక్ష్మీనారాయణ, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు టి.హైమ, హేమలత, మోహిని తదితరులు పాల్గొన్నారు.

 

➡️