తోటపల్లిని పూర్తి చేస్తాం

టిడిపి-జనసేన ప్రభుత్వాన్ని గెలిపిస్తే తొలి ఏడాదిలోనే తోటపల్లి

మాట్లాడుతున్న లోకేష్‌

అభివృద్ధి కేంద్రంగా ఉన్న ఎచ్చెర్లను అవినీతిమయం చేశారు

సొంత పార్టీ నాయకులనూ హత్య చేస్తున్నారు

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌

జిల్లాలో ముగిసిన శంఖారావం యాత్ర

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి, లావేరు

టిడిపి-జనసేన ప్రభుత్వాన్ని గెలిపిస్తే తొలి ఏడాదిలోనే తోటపల్లి పెండింగ్‌ కాలువ పనులను పూరి చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ హామీనిచ్చారు. ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తం చేసేందుకు ఈనెల 11న ఇచ్ఛాపురంలో ప్రారంభమైన శంఖారావం యాత్ర లావేరులో గురువారం నిర్వహించిన ఎచ్చెర్ల నియోజకవర్గ సభతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ టిడిపి హయాంలో ఎచ్చెర్లలో ట్రిపుల్‌ ఐటికి 200 ఎకరాలు కేటాయించామని, ఆ పనులనూ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. అంబేద్కర్‌ యూనివర్సిటీలో స్టేడియం నిర్మిస్తామని హామీనిచ్చారు. బుడగట్లపాలెంలో జెట్టీ నిర్మాణానికి నిధులు కేటాయించినా పనులు చేయలేదన్నారు. టిడిపి వస్తే వాటిని పూర్తి చేస్తామని చెప్పారు. మత్స్యకారులకు అనేక సబ్సిడీలు రద్దు చేశారని, వాటిని అమలు చేస్తామని హామీనిచ్చారు.సొంత పార్టీ నాయకులనూ హత్య చేస్తున్నారువైసిపి నాయకులు సొంత పార్టీ నాయకులను హత్య చేసే స్థితికి వచ్చారని చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపిపి ఏకంగా వాళ్ల పార్టీకే చెందిన వైస్‌ ఎంపిపి ప్రతినిధి జరుగుల శంకర్‌ను చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అభివృద్ధి కేంద్రంగా ఉన్న ఎచ్చెర్లను అవినీతిమయంగా మార్చారని విమర్శించారు. నియోజకవర్గాన్ని కేట్‌ కట్‌ చేసినట్లుగా ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ ఒక్కొక్కరికీ ఒక్కో ప్రాంతం ఇచ్చి దోచుకోమంటున్నారని ఆరోపించారు. ఒక్క ఇసుకలోనే రూ.50 కోట్లు దోచుకున్నారని, నాలుగు కొండలు మింగేశారని చెప్పారు. సొంత ఊరిలో నకిలీ పత్రాలు సృష్టించి భూములు దోచుకున్నారని ఆరోపించారు. రెండు నెలలు ఓపిక పడితే వీటిపై విచారణ చేపట్టి, ఆ భూములను గ్రామస్తులకు తిరిగి ఇప్పించే బాధ్యత తీసుకుంటామన్నారు.దుర్మార్గ పాలనను అంతమొందించాలిటిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కిమిడి కళా వెంకటరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లుగా పంటలకు సాగునీరు అందించకపోవడంతో రైతులు రూ.600 కోట్లు నష్టపోయారని విమర్శించారు. ప్రభుత్వ అప్రజాస్వామిక, తప్పుడు విధానాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిన వైపిపి ప్రభుత్వాన్ని ఓడించి, దుర్మార్గ పాలనను అంతమొందించాలని ఆయన పిలుపునిచ్చారు.ఎమ్మెల్యే మా భూమిని ఆక్రమించారురణస్థలం మండలం కోటపాలెంకు చెందిన పలువురు లోకేష్‌ను కలిశారు. కోటపాలెంలో వందెకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని టిడిపి ప్రభుత్వం నియోజకవర్గ పరిధిలోని 15 గ్రామాల పేదలకు పంచాలని నిర్ణయించిందని వివరించారు. గ్రామస్తులు సొంత ఖర్చులతో భూమిని చదును చేసుకొని సిద్ధం చేసుకున్నారని చెప్పారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ పూర్వీకుల ద్వారా తమకు భూమి సంక్రమించిందని తీసుకున్నారని తెలిపారు. టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంబంధిత భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచేలా చర్యలు తీసుకుంటామని లోకేష్‌ హామీనిచ్చారు. సభలో టిడిపి విజయనగరం జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌ నాయుడు, జనసేన జిల్లా అధ్యక్షులు పి.చంద్రమోహన్‌, నియోజకవర్గ ఇన్‌ఛార్జి విశ్వక్సేన్‌, తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి ముప్పిడి సుజాత, జెడ్‌పి మాజీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి, టిడిపి మండల అధ్యక్షులు ముప్పిడి సురేష్‌, ఎఎంసి మాజీ చైర్మన్‌ ఐ.తోటయ్యదొర, టిడిపి జిల్లా మాజీ అధ్యక్షులు చౌదరి నారాయణమూర్తి పాల్గొన్నారు.

 

➡️