రైతులపై చంద్రబాబు కపట ప్రేమ

రైతులపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

సమావేశంలో మాట్లాడుతున్న ధర్మాన ప్రసాదరావు

  • చంద్రబాబు పాలనలో చేసింది శూన్యం
  • రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

ప్రజాశక్తి – నందిగాం

రైతులపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కపట ప్రేమ కనబరుస్తున్నారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. 14 ఏళ్ల టిడిపి పాలనలో చంద్రబాబు చేసింది శూన్యమని విమర్శించారు. మండల కేంద్రంలో ఎంపిపి ఎన్‌.శ్రీరామ్మూర్తి నివాసంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 65 శాతం మంది ప్రజలు ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయాన్ని చంద్రబాబు దండగ అని అన్నారని గుర్తుచేశారు. వైఎస్‌ ప్రభుత్వ హయాంలో రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తామంటే చంద్రబాబు హేళన చేశారని చెప్పారు. మాయ మాటలు తప్ప వ్యవసాయ రంగానికి ఏమీ చేయని వారు నేడు రైతుల కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక వ్యవసాయాన్ని పండగలా మార్చిందన్నారు. విత్తనాల నుంచి పంట కొనుగోలు వరకు రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతాంగానికి అండగా నిలుస్తోందన్నారు. పంటలకు మద్దతు ధర, పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలిపారు. వంశధార రిజర్వాయర్‌తో శివారు భూములకు సాగునీరందిస్తామన్నారు. శివారు ప్రాంతాలకు సాగునీరు లేక ఇబ్బందులు పడినట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. వంశధార కాలువకు లైనింగ్‌ వేసి వచ్చే ఏడాదికి నీరందిస్తామని చెప్పారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా అడ్డంకుల దృష్ట్యా గొట్టాబ్యారేజీ వద్ద ఎత్తిపోతల పథకం పనులు చేపడుతున్నామని తెలిపారు. మరో ఆరు నెలల్లో పనులు పూర్తయి వచ్చే ఖరీఫ్‌కు నీరందిస్తామని హామీనిచ్చారు. నందిగాం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించేందుకు ప్రయత్నిస్తామన్నారు. సమావేశంలో వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌, కళింగా కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌, ఎంపిపి ఎన్‌.శ్రీరామ్మూర్తి, జెసిఎస్‌ మండల కన్వీనర్‌ జె.జయరాం, సంతబొమ్మళి జెడ్‌పిటిసి పి.వసంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️