సమగ్ర శిక్ష ఉద్యోగుల భిక్షాటన

సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని డిమాండ్‌ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు తొమ్మిదోరోజు ఆందోళన కొనసాగించారు. నిరవదిక సమ్మెలో భాగంగా నగరంలో ఎన్‌జిఒ హోమ్‌ ఆవరణ నుంచి పాతబస్టాండ్‌ కూడలి, పొట్టి శ్రీరాములు కూడలి ప్రాంతాల్లో

భిక్షాటన చేస్తున్న సమగ్రశిక్ష ఉద్యోగులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని డిమాండ్‌ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు తొమ్మిదోరోజు ఆందోళన కొనసాగించారు. నిరవదిక సమ్మెలో భాగంగా నగరంలో ఎన్‌జిఒ హోమ్‌ ఆవరణ నుంచి పాతబస్టాండ్‌ కూడలి, పొట్టి శ్రీరాములు కూడలి ప్రాంతాల్లో గురువారం బిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. అనంతరం పొట్టి శ్రీరాములు కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల జెఎసి అధ్యక్షులు మురళీకృష్ణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు హాజరై మాట్లాడుతూ ముఖ్యమంత్రికి ఉద్యోగుల గోడు చెవిన పడేంతవరకు ఐక్యతతో ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. బిక్షాటన ద్వారా ఉద్యోగుల ఆకలి మంటలను ప్రభుత్వానికి తెలియజేస్తున్నామన్నారు. సిఎం పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. అనంతరం నగరంలో జ్యోతిరావు పూలే పార్కు వద్ద సమ్మె శిబిరం వద్దకు చేరుకుని నిరసన కొనసాగించారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి పి. తవిటి నాయుడు, కోశాధికారి డి.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు జి.శ్రీనివాసరావు, యుగంధర్‌, గిరిధర్‌, రామకృష్ణ, వైకుంఠరావు, కార్యవర్గ సభ్యులు అరుంధతి, చంద్రకళ, విమల కుమారి పాల్గొన్నారు.

డిమాండ్లు నెరవేర్చాలి

సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తగుచర్యలు తీసుకునే విధంగా ఉన్నతాధికారుల దృష్టికి వినతిపత్రం పంపాలని యుటిఎఫ్‌ నాయకులు సమగ్ర శిక్ష ఎపిసి డాక్టర్‌ రోణంకి జయప్రకాష్‌ను కోరారు. గురువారం సాయంత్రం సమగ్ర శిక్ష కార్యాలయంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌ నేతృత్వాన రాష్ట్ర కౌన్సిలర్‌ ఎం.వాగ్దేవి, జిల్లా కార్యదర్శి జి.సురేష్‌, జిల్లా నాయకులు ఎల్‌.కోదండరామయ్య, కె.సురేష్‌ కుమార్‌లు హాజరై వినతిపత్రం అందజేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులతో పాటు సమ్మెలో భాగస్వాములవుతున్న కెజిబివి సిబ్బందిపై చర్య తీసుకుంటామంటూ జిసిడిఒ బెదిరింపులకు గురి చేస్తున్నారని ప్రస్తావించారు. ఆమె వాయిస్‌ మెసేజ్‌లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, జిసిడిఒ వైఖరి మార్చుకోవాలని కోరారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో సహకరించాలని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో యుటిఎఫ్‌ అండదండలు ఉంటాయని, వారి సమస్యల కోసం అవసరమైతే ఉపాధ్యాయులు కూడా పోరాటాల్లోకి వస్తారని హెచ్చరించారు. వెంటనే సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని కోరారు.

 

➡️