ఆదాయం ఫుల్‌… సౌకర్యాలు నిల్‌

పురపాలక సంఘ పరిధిలోని ఏడో వార్డు చింతాడ సంతలో సౌకర్యాలు

సంతలో నేలపై ఏర్పాటు చేసిన దుకాణాలు

ప్రజాశక్తి- ఆమదాలవలస

పురపాలక సంఘ పరిధిలోని ఏడో వార్డు చింతాడ సంతలో సౌకర్యాలు లేక వ్యాపారులు, రైతులు, ప్రజలు నానా ఇబ్బందు లకు గురవు తున్నారు. ప్రతి శనివారం ఈ సంతలో లక్షల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అలాగే పురపాలక సంఘానికి ఈ సంత ద్వారా ప్రతి ఏటా అధిక ఆదాయం వస్తున్నప్పటికీ సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు ప్రజల నుంచి బహిరంగంగా వినిపిస్తున్నాయి. ప్రతిఏటా మార్చిలో పురపాలక సంఘం ఈ సంతకు బహిరంగ వేలం పాట నిర్వహిస్తూ ఉంటుంది. అయితే గడిచిన రెండేళ్లుగా సంత వేలంపాటలో ఎవరు పాల్గొనకపోవడంతో పురపాలక సంఘం, రెవెన్యూ అధికారులు, చింతాడ సచివాలయం అధికారులు కలిసి సంయుక్తంగా సంత ఆశీలు వసూలు చేస్తున్నారు. 2021 – 22 సంవత్సరానికి సుమారు రూ.8 లక్షల వరకు చింతాడ గ్రామానికి చెందిన వ్యక్తులే సంత ఆశీల పాటను కైవసం చేసుకున్నారు. ఆ తరువాత ప్రభుత్వం ప్రతి ఏటా ఆశీల పాటను కొంత మొత్తంలో పెంపుదల చేయడంతో పాటలో పాల్గొనడానికి ఎవరు ముందుకు రాలేదు. దీంతో పురపాలక సంఘ సచివాలయ సిబ్బంది ఆశీలను వసూలు చేస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల నుంచి గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు శనివారం నిర్వహించే చింతాడ సంతకు వచ్చి వారికి కావాల్సిన వస్తువులను కొనుక్కొని వెళ్తుంటారు. అయితే ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మున్సిపల్‌ అధికారులు కల్పించడం లేదని పలువురు వాపోతున్నారు. వేసవికాలంలో ఎండకు ఎండి వర్షాకాలంలో వానకు తడిసి వ్యాపారాలు కొనసాగిస్తున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక మొత్తంలో ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నప్పటికీ తమకు కనీస స్థాయిలో కూడా సౌకర్యాలు కల్పించడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. ప్రతిఏటా మున్సిపాలిటీ పన్నులు పెంచుకుంటూ ఆర్థికంగా ఆదాయాన్ని సమకూర్చు కుంటుందని, వ్యాపారులకు, సంతకు వచ్చే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో అటు ప్రభుత్వం ఇటు అధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదని ఇప్పటికైనా నిద్రమత్తు విడనాడాలని పలువురు కోరుతున్నారు. సంతకు వచ్చే ప్రజలు, మూగజీవాలు ఎండ, వాన వంటి ప్రకృతి వైపరీత్యాలకు బలి కావాల్సిందేనని తమ ఆవేదనను వ్యక్త పరుస్తున్నారు. సంతలో షెడ్లు, ఫ్లోరింగ్‌ తదితర సదుపాయాలను కల్పించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ వాటి పరిష్కారానికి నేటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని పలువురు వాపోతున్నారు. సంతకు వస్తువులను కొనుగోలు చేయడానికి వచ్చే మహిళలు, వృద్ధులు కాలకృత్యాలు తీర్చుకోవాలంటే పొలాలు, ముళ్ల పొదల చాటుకు వెళ్లాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు. కనీసం తాగేందుకు మంచినీరు లేక పలు వురు ఇక్కట్ల పాలవుతున్నారు. సంతలో కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన బోరు మాత్రమే ఉంది. ఆ నీరు తాగేందుకు పనికిరావని పలువురు చెబుతున్నారు. నేలపై దుకాణాలు ఏర్పాటు చేయడంతో వర్షాకాలంలో సరుకులు తడిచి ఇబ్బందుల పాలవుతుంటామని పలువురు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. సంతకు వచ్చే రైతులు, ప్రజలు కూడా వర్షంలో తడవకుండా చెట్ల కిందకు పరిగె ట్టాల్సిందేనని పలువురు చెబుతుండడం విశేషం. పాలకులు, అధికారులకు ఆదాయమే కావాలని, ప్రజల సమ స్యలు వారికి పట్టవని పలువురు వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు సంతపై దృష్టి పెట్టి కనీస సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.స్వచ్ఛ భారత్‌ నిధులతో మరుగుదొడ్లు 2019 సంవత్సరం తరువాత పురపాలక సంఘంలో కొలువుదీరిన టిడిపి పాలకవర్గం స్వచ్ఛభారత్‌ పథకం కింద రూ.5 లక్షల నిధులతో మరుగుదొడ్లను అట్టహాసంగా సంతలో నిర్మించారు. మరుగుదొడ్లు నిర్మించడంతో కొంతమేర ఇబ్బందులు తొలగాయన్న రైతులు, ప్రజలు ఆశలు ఎంతో కాలం నిలవలేదు. వాటి నిర్వహణ బాధ్యతలు సక్రమంగా నిర్వహించకపోవడంతో శిథిలమై మూలకు చేరాయి. మరుగుదొడ్లు తలుపులు తదితర సామాగ్రీ నాసిరకంగా ఉండడం, సరైన పర్యవేక్షణ లేకపోవడంతో మూన్నాళ్లకే మూలకు చేరాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

 

➡️