‘ల్యాండ్‌ టైట్లింగ్‌’పై దుష్ప్రచారం

ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై

సమావేశంలో మాట్లాడుతున్న తమ్మినేని సీతారాం

  • శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

ప్రజాశక్తి – పొందూరు

ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై టిడిపి కూటమి నాయకులు అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆమదాలవలస వైసిపి అభ్యర్థి, శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. పొందూరు మండలం ధర్మపురంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ చట్టంపై గెజిట్‌ తీసుకురాగా, రాష్ట్రంలో అప్పటి టిడిపి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. నాడు శాసనసభలో టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఈ చట్టం తేవాల్సిన అవసరముందన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ చట్టంలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకుని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చట్టంతో ఎక్కడ భూములు లాక్కొంటున్నామో చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్‌, లోకేష్‌ ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదన్నారు. ముందు ఈ చట్టంపై సరిగ్గా అవగాహన తెచ్చుకుని తర్వాత మాట్లాడాలని సూచించారు. ఓటమి భయంతోనే ఇలా మాట్లాడుతున్నారని తెలిపారు. ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మరుమజ్జిలిపేటలో టిడిపి ప్రచారంలో కత్తితో దాడి చేశారంటూ ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు విశ్వసించరని చెప్పారు. 2014లో ఇలాగే నందివాడలో దాడి చేశారని చెప్పి టిడిపి అభ్యర్థి రవికుమార్‌ చేయి విరిగిందంటూ కట్టు కట్టి డ్రామాలు ఆడారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు ఓటమి భయంలో కత్తితో దాడి అంటూ కొత్త డ్రామాలకు తెర తీస్తున్నారని దుయ్యబట్టారు. ఏ డ్రామాలు, ఎన్ని బుర్రకథలు వేసినా అవన్నీ అయిపోయినవేనని, ఇంకా ఏం చేస్తావో చెప్పాలని రవికుమార్‌ను ప్రశ్నించారు. సమావేశంలో వైసిపి నాయకులు మొదలవలస పాపారావు, గాడు నాగరాజు, పప్పల అన్నాజీ, వాసు, రమణ, రామకృష్ణ, ముఖలింగం తదితరులు పాల్గొన్నారు.

➡️