ఓటర్లను చైతన్యపరచడం ద్వారా ప్రజాస్వామ్యం బలోపేతం : జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : స్వీప్‌ ద్వారా ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం, షార్ట్‌ ఫిల్మ్‌ పోటీల్లో విజేతలకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ మంగళవారం తమ చాంబర్స్‌ లో విజేతలను అభినందించి మెడల్స్‌, నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ … ఓటర్లను చైతన్య పరచడం ద్వారా ప్రజాస్వామ్యం బలోపేతం కాగలదని, ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ వంటివని అన్నారు. ప్రతి ఒక్కరు ఎన్నికలలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. స్వీప్‌ ద్వారా ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమాలలో భాగంగా జిల్లాలో వివిధ పాఠశాలలకు చెందిన 8, 9, 10 తరగతుల విద్యార్థులకు చిత్రలేఖనం, షార్ట్‌ ఫిలిం ద్వారా ఓటర్లను చైతన్యపరచడం వంటి పోటీలు నిర్వహించారు. చిత్రలేఖనం పోటీలలో పాల్గొన్న విద్యార్థులలో ఉయ్యూరు శ్రీ శ్రీనివాస అక్షరాలయం విద్యార్థిని కె.కళ్యాణి, స్థానిక జై హింద్‌ హై స్కూల్‌ కు చెందిన విద్యార్థిని తిరుమని వెంకటేశ్వరమ్మ, అవనిగడ్డ ప్రభుత్వ హైస్కూల్‌ కు చెందిన విద్యార్థి పి.సుహాస్‌ ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందగా, ప్రథమ బహుమతి విజేతకు రూ.5 వేలు ద్వితీయ బహుమతి విజేతకు రూ.3 వేలు, తృతీయ బహుమతి విజేతకు రూ.2 వేలుచొప్పున నగదు బహుమతులు, మెడల్స్‌ కలెక్టర్‌ అందజేశారు. షార్ట్‌ ఫిలిం విజేతలలో స్థానిక ఎస్వి పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థిని ఆర్‌.జగదీశ్వరి, బాపులపాడు మండలం ఆరుగొలను జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ కు చెందిన బయోలాజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఏ.ఉషాకుమారి, కృత్తివెన్ను మండలం సంగమూడి జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ కి చెందిన డ్రాయింగ్‌ టీచర్‌ వి.పౌలురాజు ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు పొందగా, ప్రధమ బహుమతి విజేతకు రూ.10, వేలు, ద్వితీయ బహుమతి విజేతకు రూ.8 వేలు, తఅతీయ బహుమతి రూ.7 వేలు నగదు బహుమతులు, మెడల్స్‌ కలెక్టర్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో డి ఆర్‌ ఓ కే చంద్రశేఖర రావు, స్వీప్‌ నోడల్‌ అధికారి, జిల్లా సహకార శాఖ అధికారి కె చంద్రశేఖర్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ సీఈవో ఆనంద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️