పట్టణ రిక్షా కార్మిక సంఘ అధ్యక్షుడు గుండెపోటుతో మృతి

ప్రకాశక్తి-చిలకలూరిపేట (గుంటూరు) : పట్టణ రిక్షా కార్మిక సంఘ యూనియన్‌ అధ్యక్షులు (పెదనందిపాడు బస్టాండ్‌ రిక్షా స్టాండ్‌ కమిటికి) దార్ల ఆదాం (72) దండమూడి గ్రామంలో ఆయన నివాసంలో సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. పెదనందిపాడు బస్టాండ్‌ రిక్షా సెంటర్‌ యూనియన్‌ అధ్యక్షులుగా గత 30 సంవత్సరాల నుంచి పని చేస్తున్నారని సిఐటియు మండల కన్వీనర్‌ పేరుబోయిన వెంకటేశ్వర్లు మంగళవారం వివరించారు. ఆదాం మృతదేహానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ …. రిక్షా కార్మికుల సమస్యలపై ఆదాం నిత్యం పోరాడేవారన్నారు. అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. అంతేకాకుండా ఇతర ప్రజా సమస్యలను బలపరుస్తూ వచ్చారన్నారు. సిపిఎం పార్టీకి సానుభూతిపరులుగా కూడా పనిచేశారన్నారు. పార్టీలో కూడ చురుగ్గా పాల్గొని సభలో సమావేశాలకు హాజరయ్యే వారని అన్నారు. అనేక సిపిఎం, సిఐటియు ఉద్యమాల్లో పాల్గొనేవారు అని చెప్పారు. ఆదాం ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేస్తామని వెంకటేశ్వర్లు అన్నారు. ఆదాంకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో రిక్షా సంఘ అధ్యక్ష కార్యదర్శులు కంపా.నాగేశ్వరరావు, పాలపర్తి.సుబ్బారావు, బి.కొటా నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️