‘ఆడుదాం ఆంధ్రా’ పోస్టర్లు ఆవిష్కరణనేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం

Nov 27,2023 21:57
'ఆడుదాం ఆంధ్రా' పోస్టర్లు ఆవిష్కరణనేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా సంబరానికి సంబంధించిన మస్కట్‌ (లోగో) పోస్టర్లను సోమవారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ షన్మోహన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్రా క్రీడాసంబరాలకు సంబంధించిన పోటీలకు ఈనెల 27 సోమవారం నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. డిసెంబర్‌ 15వ తేదీ నుండి ఆడుదాం ఆంధ్రా క్రీడాపోటీలు ప్రారంభం అవుతాయన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ అంశాలలో డిసెంబర్‌ 15వ తేదీ నుంచి 2024 ఫిబ్రవరి 3వ తేదీ వరకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనుటకు ఈనెల 27 నుంచి డిసెంబర్‌ 13వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన 15 సంవత్సరాలు నిండిన స్త్రీ, పురుషులు అందరూ అర్హులేనని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. రిజిస్ట్రేషన్లు సమీప గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్‌ ద్వారా నమోదు చేసుకోవాలని లేదా టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1902, ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ బాలాజీ పాల్గొన్నారు.

➡️