ఛార్జ్‌ మెమోలు ఉపసంహరించుకోవాలి

Nov 27,2023 22:01
ఛార్జ్‌ మెమోలు ఉపసంహరించుకోవాలి

యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లుప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ చిన్నచిన్న కారణాలతో ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనంకు విఘాతం కలిగించే ఛార్జ్‌ మెమోలను తక్షణం ఉపసంహరించుకోవాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. సోమవారం చిత్తూరు జిల్లా కార్యాలయంలో ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశం సోమశేఖర నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈసమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆర్థిక నేరాలు చేసేవారికి విధించే శిక్షలు ప్రయోగిస్తూ, ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఉత్తర్వులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులు పాఠశాలలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా, పాఠశాలలో ఏ పొరపాటు జరిగినా ఉపాధ్యాయులనే బాధ్యత చేయడం తగదని అన్నారు. విద్యార్థులకు చదువు రాకపోవడానికి కారణాలు విశ్లేషణ చేయకుండా, పాఠశాలలపై దాడి చేయడం తగదని, ప్రభుత్వం విద్యారంగం అభివద్ధికి మీ పర్యవేక్షణ ఉపయోగపడుతుందా లేక ప్రభుత్వ విద్యారంగం బలహీనపడటానికి దోహదపడుతుందో లేదో విశ్లేషణ చేసుకోవాలని హితవు పలికారు. అత్యంత ప్రతిభతో ఉపాధ్యాయులుగా సెలెక్ట్‌ అయ్యారు తప్ప ఎవరి దాయాదాక్షణ్యం మీద ఆధారపడి ఉద్యోగం సంపాదించుకోలేదని ఉపాధ్యాయులను విమర్శలు చేసేవారు గ్రహించాలని కోరారు. విద్యార్థికి చదువు చెప్పడానికి నియామకం చేయబడ్డ ఉపాధ్యాయులను బోధనేతర పనులకు మాత్రమే పరిమితం చేయడం గమనించాలని విమర్శించారు. తక్షణం ఛార్జ్‌ మెమోలను ఉపసంహరించుకోకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజ మాట్లాడుతూ మున్సిపల్‌ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్స్‌ వెంటనే నిర్వహించాలని కోరారు. మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, అన్ని పోస్టులను అప్గ్రేడ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పిఎఫ్‌ సౌకర్యం, మెడికల్‌ బిల్స్‌ సమస్య పరిష్కారం చేయాలని కోరారు. మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ దశలు వారి ఆందోళన పోరాట కార్యక్రమాలకు పిలుపునిచ్చారని తెలిపారు. ఈ ఆందోళన పోరాట కార్యక్రమంలో ఉపాధ్యాయులందరూ హాజరై విజయవంతం చేయాలని, సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమని డిసెంబర్‌ 30వ తేదీ రాష్ట్ర కేంద్రంలో జరిగే ధర్నాని విజయవంతం చేయాలని కోరారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి టి.రఘుపతిరెడ్డి మాట్లాడుతూ జీపీస్‌ని బలవంతంగా అమలు చేస్తే యూటీఎఫ్‌గా ప్రతిఘటన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో యూటీఎఫ్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు పి.సుధాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జీవి రమణ, నాయకులు పిఆర్‌.మునిరత్నం, ఎస్‌.రెహానా బేగం, కే.ప్రసన్న కుమార్‌, జిల్లా కోశాధికారి ఏ.కష్ణమూర్తి, కె.రెడ్డెప్పనాయుడు, ఎన్‌.మణిగండన్‌, డి.ఏకాంబరం, బి.ఈశ్వర్‌ మహేంద్ర, పీసీ బాబు, ఎస్పీ బాషా, ఎంవి రమణ, సాధన కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️