రాచగున్నేరిలో ‘కబ్జా’ల పర్వంనిద్రావస్థలోనే అధికార యంత్రాంగంచెరువు స్థలమైనా రెవెన్యూకు పట్టదా

Mar 26,2024 23:27
రాచగున్నేరిలో 'కబ్జా'ల పర్వంనిద్రావస్థలోనే అధికార యంత్రాంగంచెరువు స్థలమైనా రెవెన్యూకు పట్టదా

రాచగున్నేరిలో ‘కబ్జా’ల పర్వంనిద్రావస్థలోనే అధికార యంత్రాంగంచెరువు స్థలమైనా రెవెన్యూకు పట్టదాపజాశక్తి – శ్రీకాళహస్తి రూరల్‌ ‘కాదేది కవితకు అనర్హం’ అన్నాడు ఓ విప్లవ కవి… ‘కాదేది కబ్జాకు అనర్హం’ అన్నది శ్రీకాళహస్తి కబ్జారాయుళ్ల మనోగతం.. వీరంతా ఎపుడూ జనంతోనే ఉన్నట్టుంటారు.. అయితే ఓ కన్ను మాత్రం ఖాళీస్థలాలపైనే ఉంటుంది.. ‘ముక్కంటి’ పుణ్యక్షేత్రంలో రెవెన్యూ యంత్రాంగం నిద్రావస్థలో ఉండడంతో కబ్జారాయుళ్లు చెరువుల్లోనే పునాదులు తీసేస్తున్నారు. రెవెన్యూ అధికారులను వివరణ అడిగితే ‘తెలియదని’ చావుకబురు చల్లగా చెబుతారు.. కబ్జాలపర్వం ఊరంతా తెలిసిపోతుంది.. అదేంటో మరి.. రెవెన్యూ వారికి మాత్రం తెలియనంటోంది. శ్రీకాళహస్తి రూరల్‌ పరిధిలో 131 చెరువులు ఉన్నాయి. వీటిలో 48 మేజర్‌, 83 మైనర్‌ చెరువులు ఉన్నాయి. మైనర్‌ చెరువులు ఆయకట్టు కింద దాదాపు 100 ఎకరాల లోపు పంటలకు సాగునీటిని అందించగలిగే సామర్థం కలిగి ఉన్నాయి. వీటిలో ఒకటి రాచగున్నేరి చెరువు. ఈ చెరువుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రీకాళహస్తి మండలంలో ఉన్న కర్మాగారల్లోకి అతిపెద్దదైన ఈసిఎల్‌ కర్మాగారం ఈ చెరువు పరిసర ప్రాంతాల్లోనే ఉంది. అలాగే ప్రస్తుతం నాయుడుపేట – పూతలపట్టు ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుండడంతో చుట్టుపక్కల ఉన్న భూములకు ఒక్కసారిగా రెక్కలు వచ్చేశాయి. ఇదే అదునుగా కొంతమంది కబ్జాదారులు ఎక్కడా స్థలం లేనట్టుగా ఏకంగా రాచగున్నేరి చెరువు సర్వే నంబర్‌ 296లో దర్జాగా పెద్దపెద్ద భవనాలను నిర్మించడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే కొంతకాలానికి ఒకప్పుడు ఇక్కడ ఓ చెరువు ఉండేదట అని చరిత్ర పుటల్లో చెప్పుకోవాల్సి ఉంటోంది. ఈ చెరువు పరిధిలో 72 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కబ్జాలపర్వం ఇలాగే కొనసాగితే ఇంకాన్నాళ్లు పోతే పొలాలన్నీ బీడును తలపిస్తాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి రాచగున్నేరి చెరువులో జరుగుతున్న అక్రమ కట్టడాలను వెంటనే తొలగించి చెరువును కాపాడాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఎంఆర్‌ఒ జనార్ధన్‌రాజును చరవాణిలో వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని, సంబంధిత అధికారులను పంపించి అక్రమ కట్టడాలను కూల్చేస్తామని చెప్పారు.

➡️