పేదలకు ఉన్నత, విదేశీ విద్య దూరం : హైకోర్టు న్యాయవాది మహేశ్వరరావు

దీపేదలకు ఉన్నత, విదేశీ విద్య దూరం : హైకోర్టు న్యాయవాది మహేశ్వరరావు ప్రజాశక్తి-శ్రీకాళహస్తి దళితులను అన్నివిధాలా అణగదొక్కిన ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ అని సమతా సైనిక్‌ దళ్‌ రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ హైకోర్టు న్యాయవాది పాలేటి మహేశ్వరరావు విమర్శించారు. ఆదివారం ఆయన శ్రీకాళహస్తిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలంటూ కపట ప్రేమ చూపిన జగన్‌ వారి జీవితాలను ప్రణాళికాబద్ధంగా నిర్వీర్యం చేశాడంటూ మండిపడ్డారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు దశబ్దాలుగా విద్యపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్‌ లాగా లక్షల కోట్ల అక్రమ ధనం, వేలాది ఎకరాల ల్యాండ్‌ బ్యాంకులు పేదల చేతుల్లో లేవనీ, కేవలం విద్యాపథకాలతో ఉన్నత చదువులు చదివి కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలియజేశారు. అయితే జగన్‌ సీఎం అయ్యాక ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉన్నత విద్యను, విదేశీ విద్యను దూరం చేశాడని ధ్వజమెత్తారు. ఒక్క జీవోతో లక్షా 40వేల మంది పేదలను బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ళనుంచి తీసేసి రోడ్డున పదేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్‌ విదేశీ విద్యా పథకాన్ని తీసేసి జగనన్న విదేశీ విద్యా పథకం పేరుతో అర్హులకు బదులు అనర్హులను అందలమెక్కించాడంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో సీట్లను మెరిట్‌, రిజర్వేషన్ల ప్రాతిపదికన కాకుండా సగం సీట్లను అమ్ముకునే విధంగా జగన్‌ జీవో తీసుకొచ్చి పేదలకు అన్యాయం చేశాడని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీల ఫీజు రియంబర్స్మెంట్‌లు, స్కాలర్షిప్లు, పదోన్నతుల్లో కూడా కోత పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు భూములు స్థలాలు కూడా ఉండకూడదనే దురుద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షా 47వేల ఎకరాల భూములను జగనన్న కాలనీల పేరిట బలవంతంగా లాక్కొని నయా పైసా కూడా పరిహారం జగన్‌ చెల్లించలేదని వాపోయారు. దళితులను సామాజికంగా, ఆర్థికంగా బతకనీయని జగన్‌ చివరికి మనిషిగా కూడా బతకకూడదనే కక్ష్యతో దళితుడిని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు లాంటి వారిని వెనకేసుకు రావడం ఆయన కుటిల నీతికి నిదర్శనమని ధ్వజమెత్తారు. దళితులను హత్య చేసిన వారిని, దళితులకు శిరోమండనం చేసిన వారికి జగన్‌ ఎన్నికల్లో సీట్లు కేటాయించడం నిజంగా సిగ్గుచేటని విమర్శించారు. జగన్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీలపై సాగించిన అరాచకాలను ఎండగడుతూ సమతా సైనిక్‌ దళ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేస్తున్నామని వివరించారు. సమతా సైనిక్‌ దళ్‌ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు, రెడ్డప్ప, ఎస్‌.రాము, వేదముత్తు, న్యాయవాది పులి పుష్పలత, అల్లం మణి తదితరులు పాల్గొన్నారు.

➡️