వీ (వా)ళ్లు మారరంతే!నానాటికీ పెరుగుతున్న ప్రలోభాల ఖర్చు రూ.100 కోట్లు

వీ (వా)ళ్లు మారరంతే!నానాటికీ పెరుగుతున్న ప్రలోభాల ఖర్చు రూ.100 కోట్లు

వీ (వా)ళ్లు మారరంతే!నానాటికీ పెరుగుతున్న ప్రలోభాల ఖర్చు రూ.100 కోట్లు చొప్పున ఎన్నికల వ్యయంఅధికారికంగానే రూ.750 కోట్ల తాయిలాలుఏ నోట విన్నా…ఇదే ముచ్చట..!మీకు ఎంత ఇచ్చారు.. వైసిపి మూడువేలు ఇస్తుందంట కదా, టిడిపి కూడా అంతేనంట.. శ్రీకాళహస్తిలో అయితే చీరలు, ముక్కుపుడకలు, మెట్టెలు కూడా అదనంగా ఇస్తున్నారంట.. పలానా చోట ఐదువేలు ఇస్తున్నారంట.. మా ఊరికేమో ఇంతవరకూ రాలేదు. రేపేమన్నా వస్తారేమో చూడాలి.. ఆు ఇచ్చారులే చీరలు వంద రూపాయలు కూడా గిట్టదు.. కొన్నిచోట్ల ఆదివారాలు కిలో చికెన్‌ ఇచ్చారంట.. రోజూ బిర్యానీ ప్యాకెట్లే.. ఇంట్లో వంట చేసి వారం రోజులయ్యింది.. మీ ఊళ్లో ఎలా ఉంది ట్రెండ్‌.. వైసిపి గెలుస్తుందా.. టిడిపి గెలుస్తుందా..ఈ వారమంతా ఇదే ముచ్చట..! వామపక్ష నాయకులు మాత్రం ఎక్కడా డబ్బు పంపిణీలో పాలు పంచుకోకుండా, తమకు అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తామని, పోరాటాల్లో అండగా ఉంటామని ఓటర్లకు భరోసా ఇస్తున్నారు. ప్రత్యేకించి కొంతమంది మేథావులు, సిపిఎం, సిపిఐ నాయకులు నిక్కచ్చిగా ఓటుకు నోటును తిరస్కరిస్తున్నారు. ‘మీ నోటు మాకొద్దు.. మా ఓటు మా ఇష్టం’ అని మొహానే చెప్పి డబ్బు పంపిణీ చేసే ఏజెంట్లను తిప్పి పంపించేయడమూ కొన్నిచోట్ల ‘ప్రత్యేకంగానే’ కనిపించింది. ప్రజాశక్తి-శ్రీకాళహస్తిఓటు వజ్రాయుధం..ఒక్క ఓటుతో అవినీతిపై వేటు..నేటి ఓటు రేపటి మన భవిష్యత్తు..అంటూ ఎన్నికల సందర్భానో, లేక జాతీయ ఓటర్ల దినోత్సవం నాడో ఊకదంపుడు నినాదాలు చేసుకోవడం తప్పా..ఆ ఓటుతో అవినీతిపై వేటు వేసింది లేదు. పైగా ఆ ఓటుతోనే ఓటర్లు తమ జీవితాలపై గొడ్డలి పెట్టు వేసుకుంటున్నారు. ఓటును ప్రత్యామ్నాయ రాజకీయవాదులకు, విద్యావంతులకు, నిస్వార్థపరులకు వేయడం మాని, ప్రలోభాలకు లోబడి అవినీతిపరులకు వేస్తుండడంతో ఈ పరిస్థితులను ఓటర్లు కొని తెచ్చుకుంటున్నారు. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు అభ్యర్థుల నుండి మరింతగా ఓటర్లు ప్రలోభాలను ఆశిస్తుండడంతో నానాటికి ఎన్నికల వ్యయం పెరిగిపోతుంది. 2019లో ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల వ్యయం రూ.50 కోట్లు కాగా నేటి ఎన్నికలకు రూ.100 కోట్ల మార్కు చేరుకుందంటే నాయకులు ఏ స్థాయిలో ప్రలోభ పెడుతున్నారో. ఓటర్లు ఏ స్థాయిలో ప్రలోభ పడుతున్నారో ఇట్టే అవగతమవుతుంది. ఏటేటా పెరుగుతున్న ఎన్నికల ఖర్చుల నేపథ్యంలో ఎమ్మెల్యే గానో, ఎంపీగానో గెలుస్తున్న అభ్యర్థులు అభివద్ధిని మరిచి వచ్చే ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టాలంటే ఎంత వెనకేసుకోవాలనే ఆలోచనలతో ముందుకెళ్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో అవినీతి కుంభకోణాలకు నాయకులు తెర తీయాల్సి వస్తుందన్న ఆరోపణ ఉంది. దీంతో రాజకీయ నాయకులు ప్రలోభ పెట్టడం మానరు..ఓటర్లు ప్రలోభ పడడం మానరు అంటూ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. జిల్లాలో 18 లక్షలపై చిలుకు ఓటర్లు ఉన్నారు. ఇందులో మెజార్టీగా 15 లక్షల మంది ఓటర్లు ప్రలోభాలకు గురై ఉంటే జిల్లాలోనే అధికారికంగా, బాహాటంగానే 700 కోట్ల రూపాయలు ప్రలోభపెట్టినట్లన్నమాట. అంటే ఒక్కో నియోజకవర్గం వంద కోట్లు ప్రలోభాలకే తెరదీసినట్లు. రూ.100 కోట్లు దాటిన ఎన్నికల వ్యయం!!శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుతం 2.45లక్షల ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి తమ ఎన్నికల ఖర్చుతోపాటు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సుమారు రూ.50 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఒక్కో అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.100 కోట్ల మార్కును తాకేటట్లుగా ఉందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని పార్టీలు ఓటర్లకు చీరలు, ముక్కుపుడకలు పంపిణీ చేసినట్లు సమాచారం. వీటికి తోడు ఒక్కో ఓటుకు రూ.2 నుంచి రూ.3 వేలు చొప్పున ప్రలోభ వ్యయం కింద పంపిణీ చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఈ లెక్కన ఒక్క అభ్యర్థి కనీస ఖర్చు రూ.100 కోట్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పాలన సాగుతున్నా, అడుగడుగునా అధికారుల నిఘా ఉన్న ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రక్రియ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోందని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు ప్రలోభ పడటం మానేదెన్నడు.. అవినీతిపరుల భరతం పట్టేందుకు ఓటును వజ్రాయుధంగా మార్చుకునేది ఎన్నడు.. నిస్వార్ధంగా సేవ చేసే ప్రత్యామ్నాయ రాజకీయవాదులు, విద్యావంతులు ప్రజా ప్రతినిధులయ్యేదెన్నడని ప్రతి సామాన్యుడి ప్రశ్నగా మారుతోంది.

➡️