ఆత్మస్తుతి..పరనిందలు..ముగిసిన ఎన్నికల ప్రచారం

ఆత్మస్తుతి..పరనిందలు..ముగిసిన ఎన్నికల ప్రచారం

ఆత్మస్తుతి..పరనిందలు..ముగిసిన ఎన్నికల ప్రచారంప్రజాశక్తి-తిరుపతి సిటి సార్వత్రిక, సాధారణ ఎన్నికల ఘట్టం చివరి అంకానికి చేరుకుంది.. దాదాపు 40 రోజులకు పైనే ఎన్నికల ప్రచార ఘట్టం సాగింది. నామినేషన్ల పర్యం ముగిసి ముగియగానే ఏఫ్రిల్‌ 18 నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని కూటమిలు, రాజకీయ పార్టీలు, స్వతంత్రులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నాలుగు ప్రధాన పార్టీలకు చెందిన అధినేతలు జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేశారు. ఎన్నికల సభల్లో అభివృద్ధి గురించి చెప్పడం మరిచి, ప్రత్యర్థులపై విమర్శలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్నికల ప్రచార శైలిని పరిశీలిస్తే ఆద్యంతం ఆత్మస్తుతి.. పరనిందలుగానే సాగింది. జిల్లాలో రెండు నెలలకు ముందే ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికల కమిషన్‌ నోటిఫికెషన్‌ విడుదల చేయకముందే బూర్జువ పార్టీలకు చెందిన నాయకులు సీట్ల కోసం పైరవీలు ముమ్మరం చేశారు. అందులో కొంత మంది టిక్కెట్‌ సాధించగా, మరికొంత మందికి రిక్తహస్తం తప్పలేదు. ఆ తర్వాత అసంతృప్తి నేతలను బుజ్జిగించడం, మరికొంత మందిని ప్రలోబాలు పెట్టడం, కొంత మందిని బెదిరించడం చేసి, ఎలాగోలా వారిని దారికి తెచ్చుకున్నారు. నామినేషన్ల పర్వం ముగియగానే, రెబల్స్‌ బెడదను దాటేందుకు విత్‌డ్రాలు చేయించేలా పలువురుని మొప్పించారు. ఆ ఘట్టం కూడా పూర్తికాగానే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా 7అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంట్‌ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. 177 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 18, 12, 980 మంది ఓటర్లు ఓటు అనే ఆయుధం ద్వారా అభ్యర్థుల జయపజయాలను నిర్ణయించనున్నారు. శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. గడిచిన వారమంతా ఎన్నికల ప్రచారాలు ముమ్మరంగా జరిగాయి. చివరి సమయంలో పలు ప్రధాన పార్టీల కీలక నేతలు జిల్లాలో ప్రచారం, బహిరంగ సభలు నిర్వహించారు. జనసేన, బిజెపి, టిడిపి కూటమీ నుంచి ఈ నెల 8వ తేది టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. బిజెపి నుంచి ప్రదానమంత్రి నరేంద్రమోడి ఉమ్మడి జిల్లాల తరుపున అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగిన సభకు హాజరయ్యారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో పలువురు నాయకులతో ముచ్చటించారు. వైఎస్‌ఆర్‌సిపి తరుపున ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటించి, పలు చోట్ల ఎన్నికల సభలు నిర్వహించారు. శనివారం తిరుపతి కేంద్రంగా బిజెపి జాతీయ అద్యక్షులు నడ్డా ర్యాలీ నిర్వహించారు. ఇండియా కూటమి తరుపున సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తిరుపతిలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. బూర్జువా రాజకీయ పార్టీల నాయకులంతా ప్రజా సమస్యలపై గాని, అభివృద్ధి విషయంపై గాని మాట్లాడకుండా, భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తారో చెప్పకుండా ప్రతిపక్షాలపై అధికార పక్షం, అధికార పక్షంపై ప్రతిపక్షాలు విమర్శలకు ప్రాధాన్యత ఇచ్చాయి. సాక్షాత్తు దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రే ఎన్నికల్లో సభల్లో స్వయంగా పాల్గొన్న వారు చేసిన అభివృద్ధి, చేయబోయే అభివృద్ధి గురించి చెప్పకుండా, ప్రత్యార్ధులపై విమర్శలకే ప్రాధాన్యత ఇవ్వడం శోచనీయం. ఇండియా కూటమి అభ్యర్థులు మాత్రం ఇప్పటి వరకు తాము చేసిన పోరాటాలను, ప్రజల కోసం నడిపిన ఉద్యమాలు, తదితర వాటిపై ప్రచారం చేస్తూ, తాము గెలిస్తే భవిష్యత్తులో ఏఏ పనులు చేపడతామో వివరిస్తూ ప్రచారం చేయడం గమనార్హం. ఈ సుదీర్ఘ ప్రచార పర్వంలో గెలుపోటములు ఎవ్వరిని వరిస్తాయో వేచి చూద్దాం.

➡️