కర్నూలు నుండి రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలకు రైళ్లు నడపాలి

Mar 10,2024 15:35 #Kurnool, #meetings
  • మహబూబ్‌ నగర్‌ నుండి డోన్‌ వరకు రైల్వే డబ్లింగ్‌ పనులు సత్వరమే పూర్తి చేయాలి
  • రైల్వే వ్యాగన్‌ వర్క్‌ షాప్‌ నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి
  • కర్నూల్‌ – నంద్యాల, కర్నూలు – మంత్రాలయం మధ్య కొత్త రైల్వే లైన్లు వేయాలి
  • పట్టణ పౌర సంక్షేమ సంఘం నిర్వహించిన చర్చ గోష్టిలో ప్రముఖుల డిమాండ్‌

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : కర్నూలు నుండి రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, మచిలీపట్నం, కాకినాడ వంటి ప్రధాన పట్టణాలకు కొత్త రైళ్లు నడపాలని, మహబూబ్‌ నగర్‌ – డోన్‌ మధ్యలో రైల్వే ట్రాక్‌ డబ్లింగ్‌ పనులు సత్వరమే పూర్తి చేయాలని, పంచలింగాల వద్ద నిర్మిస్తున్న రైల్వే వ్యాగన్‌ వర్క్‌ షాప్‌ నిర్మాణం పనులు వెంటనే పూర్తి చేయాలని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జిల్లా అధ్యక్షులు విజరు కుమార్‌ రెడ్డి, రవీంద్ర విద్యా సంస్థల డైరెక్టర్‌ జి పుల్లయ్య, సుందరయ్య స్ఫూర్తి కేంద్రం చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి తదితరులు డిమాండ్‌ చేశారు. ఆదివారం పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ముడుమాల యాకోబ్‌ అధ్యక్షతన బి ఏ ఎస్‌ ఫంక్షన్‌ హాల్లో జరిగిన చర్చా గోష్టి కార్యక్రమంలో ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జిల్లా అధ్యక్షులు, రైల్వే బోర్డు మెంబర్‌ విజరు కుమార్‌ రెడ్డి, రవీంద్ర విద్యా సంస్థల డైరెక్టర్‌ జి పుల్లయ్య, పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు పుల్లారెడ్డి, సుందరయ్య స్ఫూర్తి కేంద్రం చైర్మన్‌ కె. ప్రభాకర్‌ రెడ్డి, కర్నూల్‌ జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ నాయకులు రామచంద్రారెడ్డి, బ్రహ్మయ్య, ఐలు ( ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌) జిల్లా అధ్యక్షులు ఎస్‌. లక్ష్మణ్‌, న్యాయవాది రాము, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు నాగరాజు, ఏ. వెంకటేశ్వర్లు, మద్దిలేటి, సీనియర్‌ జర్నలిస్ట్‌ నరేందర్‌, తదితరులు పాల్గొన్నారు.
చర్చగోష్టిలో ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ కర్నూల్‌ నుండి ప్రాతినిద్యం వహిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు కర్నూల్‌ ప్రజల రైల్వే ప్రయాణ అవసరాలను గుర్తించి పరిష్కరించడంలో విఫలమయ్యారని, రానున్న ఎన్నికలలో ప్రజల రైల్వే రవాణా అవసరాలను తమ ఎన్నికల అజెండాలో చేర్చేలాగా రాజకీయ పార్టీలపై పట్టణ పౌర సంక్షేమ సంఘం ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సాధారణ రైల్వే ప్రయాణికుల అవసరాలను గుర్తించడం లేదని, ప్యాసింజర్‌ రైళ్లు కనుమరుగవుతున్నాయని అత్యంత ఖరీదైన వందే భారత్‌ రైళ్లు తమ ప్రాధాన్యతగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, సామాన్య రైలు ప్రయాణికుల అవసరాలను తీర్చేలాగా ప్రభుత్వం రైల్వే శాఖ వివరించాలని కోరారు. కర్నూలు నుండి విజయవాడ, విశాఖ, మచిలీపట్నం, కాకినాడ వంటి ముఖ్య పట్టణాలకు తక్షణమే రైళ్లు నడపాలని డిమాండ్‌ చేశారు.


చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ రైల్వే స్టేషన్‌ అభివద్ధి కోసం తన వంతు కషి చేస్తున్నానని, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు సహకరిస్తే మన కర్నూలు ప్రజలకు మరింత మెరుగైన రైల్వే సౌకర్యాలను సాధించుకోవచ్చని తెలిపారు. కర్నూల్‌ లో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కొరకు రైల్వే గూడ్‌ షెడ్‌ ను దూపాడు దగ్గరలోకి మార్చాలని, హ్యాంగ్‌ అవుట్‌ హౌటల్‌ సమీపంలో నేషనల్‌ హైవే నుండి నంద్యాల రోడ్‌ వైపుకు రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మించాలని, కర్నూలు నుండి మంత్రాలయం, కర్నూల్‌ నుండి నంద్యాల రైల్వే లైన్లు వేయాలని, మహబూబ్నగర్‌ నుండి డోన్‌ వరకు రైల్వే డబ్లింగ్‌ పనులు పూర్తయితే కొత్త రైళ్లు నడిపేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అందరం కలిసి కర్నూల్‌ ప్రజల రైల్వే సౌకర్యాల మెరుగు కోసం కషి చేద్దామని విజ్ఞప్తి చేశారు.రవీంద్ర విద్యాసంస్థల డైరెక్టర్‌ జి. పుల్లయ్య మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ, విశాఖ పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం ప్రజలకు పెరిగిందని దానికి అనుగుణంగా రైల్వే రవాణా సౌకర్యం పెంచాలన్న అవసరం ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని గుర్తించాలని తెలిపారు.
పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు పుల్లారెడ్డి మాట్లాడుతూ రైల్వే స్టేషన్‌ అభివద్ధికి నిధులు వెచ్చిస్తున్నారు కానీ, కర్నూల్‌ నుండి రైళ్లను పెంచే విషయంలో, పంచలింగాల దగ్గర నిర్మిస్తున్న వాగన్‌ వర్క్‌ షాప్‌ నిర్మాణాన్ని వేగవంతం చేయటంలో కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ శ్రద్ధ చూపడం లేదని అన్నారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం నగరంలోని అన్ని వర్తక, వాణిజ్య సంఘాలను, వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులను కదిలించి కర్నూల్‌ ప్రజల రైల్వే సౌకర్యాల మెరుగు కొరకు కేంద్ర ప్రభుత్వంపై, ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తీసుకు వస్తుందని తెలిపారు.
మహబూబ్‌ నగర్‌ నుండి డోన్‌ వరకు తక్షణమే రైల్వే డబ్లింగ్‌ పనులు పూర్తి చేయాలని, కర్నూలు నుండి విజయవాడ, విశాఖ, మచిలీపట్నం, కాకినాడ వంటి ప్రధాన పట్టణాలకు రైళ్లు నడపాలని, ఎక్స్ప్రెస్‌ రైళ్లలో జనరల్‌ బోగీల సంఖ్య పెంచాలని, కరోనా సమయంలో రద్దు చేసిన ప్యాసింజర్‌ రైళ్లను పునరుద్ధరించాలని, రైల్వేలలో సీనియర్‌ సిటిజనులు, వికలాంగులు, జర్నలిస్టులకు రాయితీ పునరుద్ధరించాలని, పంచలింగాల వద్ద రైల్వే వ్యాగన్‌ వర్క్‌ షాప్‌ నిర్మాణం సత్వరమే పూర్తి చేయాలని, కర్నూలు – నంద్యాల, కర్నూలు – మంత్రాలయం మధ్య కొత్త రైల్వే లైన్లు నిర్మించాలని సమావేశం తీర్మానించింది.

➡️