మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి

Jun 29,2024 21:24

బొబ్బిలి: మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం కౌన్సిల్‌ సాధారణ సమావేశం జరిగింది. కౌన్సిల్‌ సమావేశానికి హాజరైన బేబినాయనకు కమిషనర్‌ రామలక్ష్మి, మేనేజర్‌ శివప్రసాద్‌, అధికారులు, కౌన్సిలర్లు ఘనంగా స్వాగతం పలికారు. మున్సిపల్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా బేబినాయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో రోడ్లు విస్తరణ చేస్తామని, పాడైపోయిన రోడ్లు బాగు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. రోజురోజుకు పట్టణం విస్తరిస్తోందని చెప్పారు. నూతనంగా ఏర్పడిన కాలనీల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి పైలెట్‌ ప్రాజెక్టు స్కీమ్‌ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేయాలని కౌన్సిల్‌ సభ్యులకు సూచించారు. అజెండాపై టిడిపి కౌన్సిలర్ల ఆగ్రహం మున్సిపల్‌ అజెండాపై టిడిపి కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ అభివృద్ధి పనులకు సాధారణ నిధుల నుంచి రూ.1.45 కోట్లు కేటాయించి గతంలో టెండర్‌ దక్కించుకుని అభివృద్ధి పనులు చేయని కాంట్రాక్టర్‌ శేషుబాబుకు టెండర్‌ ఇవ్వడంతో వారు మండిపడ్డారు. అజెండాపై డీసెంట్‌ నోటీసు ఇచ్చారు.సమస్యలపై ప్రత్యేక దృష్టి బొబ్బిలిరూరల్‌ : ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. శనివారం మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపిపి శంబంగి లక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి తొలిసారిగా హాజరైన ఎమ్మెల్యేకు ఎంపిపి ప్రతినిధి శంబంగి వేణుగోపాల్‌ నాయుడు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేయాలని సూచించారు. త్వరలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, కార్యాచరణ రూపొందిస్తామన్నారు. వర్షాలు పడుతున్న నేపధ్యంలో సీజనల్‌ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని, కాలువలు, తాగునీటి ట్యాంకులు శుభ్రం చేయాలని ఆదేశించారు. అనంతరం ఎంపిపి వివిధ శాఖలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ త్రినాథనాయుడు, వైఎస్‌ ఎంపిపి శంకర్రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.గెస్ట్‌ టీచర్లను కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా గుర్తించాలిబొబ్బిలి : మహాత్మా జ్యోతిభా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాలల్లో పని చేస్తున్న గెస్ట్‌ టీచర్లను కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా గుర్తించాలని ఆ యూనియన్‌ నాయకులు టి.సంజీవి, ఎ.పైడిరాజు, బి.సన్యాసినాయుడు కోరారు. కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా గుర్తించాలని కోరుతూ శనివారం ఎమ్మెల్యే బేబినాయనకు వినతిపత్రం అందజేశారు. ఎన్నోఏళ్ల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1035 మంది పని చేస్తున్నామని, అరకొర వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా గుర్తించి టైమ్‌స్కేల్‌ అమలయ్యేలా చూడాలని కోరారు.కార్యకర్త కుటుంబానికి బేబినాయన పరామర్శరామభద్రపురం : మండల పరిధిలోని మామిడివలస గ్రామానికి చెందిన టిడిపి సీనియర్‌ కార్యకర్త నడుపూరి చిన్నంనాయుడు ఇటీవల ఆకస్మికంగా మృతి చెందడంతో అతని కుటుంబాన్ని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన శనివారం పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తన పుట్టినరోజు వేడుకల్లో ఎంతో సరదాగా పాల్గొని ఆమరునాడే చిన్నంనాయుడు మతిచెందడం ఎంతో బాధాకరమన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు మడక తిరుపతినాయుడు, కనిమెరక శంకరరావు, వసంతుల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

➡️