నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వినతి

ప్రజాశక్తి – పోడూరు

మిచౌంగ్‌ తుపాన్‌ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులు, కౌలు రైతులకు వేరుగా పంట నష్టం నమోదు చేసి ఆదుకోవాలని, తేమ శాతం సడలించి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ సిపిఎం మండల కమిటీ సోమవారం తహశీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి పిల్లి ప్రసాద్‌ మాట్లాడుతూ తుపాన్‌ ప్రభావం వల్ల మండలంలో 70 శాతం పైగా పంటలు దెబ్బతిన్నాయని, రైతులకు నష్టపరిహారం కింద ప్రతి ఎకరాకూ రూ.25,000 చెల్లించి వారిని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బి.శ్రీనివాసరావు, కంకటాల భాస్కరరావు, కొప్పర్థి నరసింహమూర్తి, కెె.కృష్ణారావు, బూరాబత్తుల వెంకట్రావు పాల్గొన్నారు.పెనుగొండ : చినమల్లంలో మిచౌంగ్‌ తుపానుకు నేలనంటిన వరిచేలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేస్తున్న అధికార బృందాన్ని సోమవారం సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌.వెంకటేశ్వరరావు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పంట చేల వద్ద రైతు భరోసా అధికారి మనోజ్‌ ను, విఆర్‌ఒ కెవి సత్యనారాయణతో మాట్లాడారు. జరిగిన నష్టాన్ని కౌలు రైతు పేరున నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు వచ్చిన నష్టాన్ని భూ యజమాని పేరున ప్రభుత్వం నమోదు చేయించడంతో చాలామంది కౌలు రైతులు నష్టపరిహారం పొందలేకపోతున్నారన్నారు. తక్షణం ప్రభుత్వం చిన్న, సన్నకారు, కౌలు రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు బొక్క పద్మారావు, కృష్ణమూర్తి, పిల్లి రాంబాబు, గుబ్బల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

➡️