బాపనయ్య జీవితం స్ఫూర్తిదాయకం

వర్థంతి సభలో వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి వీరభద్రరావు
ప్రజాశక్తి – తణుకు రూరల్‌
ఉద్యమాల ముద్దుబిడ్డ గుంటూరు బాపనయ్య జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ల చినవీరభద్రరావు అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం వ్యవస్థాపక నిర్మాతల్లో ఒకరైన బాపనయ్య 46వ వర్థంతి కార్యక్రమాన్ని వేల్పూరు స్థానిక సాలిపేటలో సోమవారం నిర్వహించారు. బాపనయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా చినవీరభద్రరావు మాట్లాడుతూ పేద దళిత కుటుంబంలో జన్మించిన బాపనయ్య అంటరానితనం, పేదరికం కారణంగా అనేక అవమానాలు భరించారన్నారు. ఈ సమాజంలో పేదరికం, అంటరానితనం పోవాలంటే కమ్యూనిజంతో తప్ప మరో మార్గం లేదని భావించిన బాపనయ్య చదువు పూర్తి చేసుకుని స్వగ్రామం వచ్చిన అనంతరం 1942లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం స్వీకరించి పార్టీ అభివృద్ధి కోసం పని చేసిన నాయకుడని వీరభద్రరావు తెలిపారు. 1947లో రాష్ట్రవ్యాప్తంగా పాలేర్ల జీతాల పెంపుదల, పని గంటలు తగ్గింపు కోసం జరిగిన పోరాటానికి ఆయన నాయకత్వం వహించిన విషయాన్ని గుర్తు చేశారు. 1948లో జమిందారీ విధానం రద్దు చేసి దున్నేవాడికి భూమి అనే నినాదంతో సాగిన పోరాటాలు, భూ సంస్కరణలు అమలు చేసి బంజర భూములను పేదలకు పంచాలాని జరిగిన పోరాటాల కారణంగా ప్రభుత్వం బాపనయ్యను అక్రమంగా అరెస్టు చేసి రాజమండ్రి, కడలూరు జైళ్లలో పెట్టి 1951 వరకు నిర్బంధించిందన్నారు. మూడుసార్లు శాసనసభ్యునిగా, ఎంఎల్‌సిగా ఎన్నికైన ఆయన తుది శ్వాస విడిచే వరకూ ప్రజల కోసం పని చేసి ప్రజల మన్ననలను పొందిన గొప్ప పోరాట యోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సభ్యులు విశ్వనాథం సుబ్బారావు, వాటాల నాగేశ్వరరావు, బళ్ల నాగలక్ష్మి, వాసా వెంకటేశ్వరరావు, సోరపల్లి రామకృష్ణ, కురేళ్ల రాంబాబు పాల్గొన్నారు.

➡️