వైసిపి ప్రభుత్వం తన పదవీకాలంలో చివరిగా ప్రవేశ పెట్టిన ఓటన్‌ అకౌంట్‌ బడ్జె

Feb 7,2024 21:49

అడియాశల బడ్జెట్‌..!

ప్రజాశక్తి – భీమవరం

వైసిపి ప్రభుత్వం తన పదవీకాలంలో చివరిగా ప్రవేశ పెట్టిన ఓటన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి నిధుల కేటాయింపుపై అంకెల గారడీ ప్రదర్శించి గతం మాదిరిగానే బురిడీ కొట్టించింది. సాగునీటి ప్రాజెక్టులు, డెల్టా ఆధునికీకరణ పనులు, నిర్వాసితులకు ఇచ్చిన హామీలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఆక్వా, పామాయిల్‌, వరి రైతులకు ప్రోత్సాహకాలకు నిధులు ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం అరకొరగానే కేటాయించింది. ఈ నిధులనూ చాలా పరిమితంగానే ఖర్చు చేసింది. ఈ నేపథ్యంలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లోనూ అరకొర కేటాయింపులతో జిల్లావాసులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సంక్షేమం తప్ప జిల్లా అభివృద్ధిని మరిచిన వైసిపి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో వైసిపి ప్రభుత్వం చివరి బడ్జెట్‌లోనైనా జిల్లాలోని ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు భారీగా చేస్తారని ఆశించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాను అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తారని ఆశించినప్పటికీ ఆ ఆశలు ఆవిరయ్యాయి. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖామంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కేవలం గతం మాదిరిగానే అంకెల గారడీతో మాట్లాడడం తప్ప నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. గత బడ్జెట్లో కేటాయించిన నిధులను కూడా పూర్తిస్థాయిలో ఖర్చు చేసిన పరిస్థితి లేదు. 2008లో చింతలపూడి ప్రాజెక్టును రూ.1,701 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కృష్ణా జిల్లాలకు విస్తరించి 4,80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా మార్చింది. ఇప్పటివరకు భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయలేదు. గడిచిన బడ్జెట్లో రూ.272 కోట్లు కేటాయించినా చేసిన ఖర్చు నామమాత్రమే. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రెట్టింపై రూ.9,800 కోట్లకు చేరినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఈ ఖర్చు కూడా గత ప్రభుత్వాల హయాంలోనే జరిగింది. ఈ బడ్జెట్లో కనీసం రూ.1500 కోట్లు కేటాయిస్తే పనులు ముందుకు సాగే పరిస్థితి ఉంది. అయితే వైసిపి ప్రభుత్వం బడ్జెట్లో దీనిపై కనీసం దృష్టి సారించలేదు. తాడిపూడికి గత బడ్జెట్లో రూ.22 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. పనులేవీ ముందుకు సాగలేదు. ఎర్రకాలువ రిజర్వాయర్‌, తమ్మిలేరు రిజర్వాయర్‌ పనులకు సంబంధించి గత బడ్జెట్లో రూ.8.43 లక్షలు మాత్రమే కేటాయించారు. ఈ బడ్జెట్లో కేటాయింపులపై స్పష్టత లేదు.డెల్టా ఆధునీకరణపై దృష్టి ఏది వైసిపి ప్రభుత్వం డెల్టా ఆధునికీకరణపై కనీసం దృష్టిసారించిన పరిస్థితి లేదు. ఉమ్మడి జిల్లాలో దాదాపు పది లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. 11 ప్రధాన కాలువలు 300కుపైగా పిల్ల కాలువలు ద్వారా సాగునీరు సరఫరా అవుతుంది. 2007లో ఉమ్మడి జిల్లాకు రూ.1416 కోట్లతో డెల్టా ఆధునికీకరణకు ఆమోదం తెలిపింది. అయితే వైసిపి ప్రభుత్వం వచ్చాక డెల్టా ఆధునికీకరణ పనులను పూర్తిగా పక్కన పెట్టేసింది. గతేడాది బడ్జెట్లో జిల్లాకు కేవలం రూ.12 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇవి కూడా రకరకాల కారణాలతో పూర్తిస్థాయిలో ఖర్చు చేసిన పరిస్థితి లేదు. తూడు, గుర్రపుడెక్క పేరుకుపోవడమే కాకుండా, వర్షాలు తుపాన్లు సంభవించిన సమయంలో ప్రతియేటా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్న పరిస్థితి. దీనికి తోడు జల వనరులు సమృద్ధిగా ఉన్న జిల్లాలో సాగునీటి ఎద్దడి సమస్యతో రైతులు సతమతమవుతున్నారు.’పోలవరం’పై ప్రభుత్వానికి చిన్నచూపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ, నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. తాము అధికారంలోకి వస్తే పోలవరం నిర్వాసితులకు ఇస్తున్న రూ.6.25 లక్షల పునరావాస ప్యాకేజీని రూ.10 లక్షలకు పెంచుతామని, 2006కు ముందు సేకరించిన భూములకు రూ.5 లక్షలు ఇస్తామని, 18 ఏళ్లు నిండిన యువతకు పరిహారం ఇస్తామని, ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని, భూములకు భూములు ఇస్తామని వైసిపి చెప్పింది. కాపర్‌ డ్యామ్‌ నిర్మాణం పూర్తి చేయడంతోపాటు ప్రతియేటా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 107 గ్రామాల్లో 20 వేల కుటుంబాలు గోదావరి వరద ముంపు బారిన పడుతోంది. అయితే నిర్వాసితుల సమస్యలతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన వైసిపి ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లో కూడా నిర్వాసితులకు మొండిచెయ్యే చూపిందనే విమర్శలు విన్పిస్తున్నాయి.ప్రకటనలు ఫుల్‌.. పనులు నిల్‌! వైసిపి ప్రభుత్వం నాలుగున్నరేళ్ల కాలంలో హడావిడి పర్యటనలు, శంకుస్థాపనలు, ప్రకటనలకే పరిమితమైంది. పనులు చేపట్టి ముందుకు తీసుకెళ్లడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. నరసాపురం మండలం బియ్యపుతిప్పలో ఫిషింగ్‌ హార్బర్‌, కొల్లేరులోకి సముద్ర నీరు ఎగదన్నకుండా మూడు రెగ్యులేటర్ల నిర్మాణం, దగ్గులూరు మెడికల్‌ కళాశాల నిర్మాణం అన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఉమ్మడి జిల్లాకు తలమానికమని చెప్పుకునే ఆక్వా యూనివర్సిటీని ప్రారంభించినా భవనాల నిర్మాణం నేటికీ పూర్తి చేయలేదు.రైతులకు ప్రోత్సాహకాలపై నోరు మెదపని బడ్జెట్‌.. జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు, లక్షన్నర ఎకరాల్లో పామాయిల్‌, దాదాపు రెండు పంటల కింద పది లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నాయి. ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీని కుదించడం, సీడ్‌, ఫీడ్‌ ధరలు పెరిగిపోవడం, రొయ్యల ధరల తగ్గిపోవడంతో ఆక్వా సాగు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ బడ్జెట్‌లో ఆక్వా రైతులను ఆదుకునేలా ఎటువంటి ప్రోత్సాహకాలూ లేవు. పామాయిల్‌ రైతుల పరిస్థితీ ఇంతే. ముఖ్యంగా వరి రైతుల పరిస్థితీ అగమ్యగోచరంగా ఉంది. ఈ బడ్జెట్‌పై వరి రైతుల పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌ జిల్లా అభివృద్ధికిగాని, సమస్యల పరిష్కారానికిగాని దోహడపడేలా లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

➡️