సమగ్రాభివృద్ధే ధ్యేయం

May 9,2024 17:00 #Congress
  • ఉండి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థివేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు
    ప్రజాశక్తి -కాళ్ళ
    ఉండి నియోజకవర్గ సమగ్రాభివృద్దే తన ప్రధాన అజెండా అని ఇండియా బ్లాక్‌ బలపర్చిన ఉండి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు తెలిపారు. ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని నియోజకవర్గంలో నిర్వహించారు. ఉండి నియోజకవర్గంపై తనకు పూర్తిగా పట్టు ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలు తనకు తెలుసునన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే ఆయా అంశాలకు ప్రధాన్యం ఇచ్చి సమస్యల పరిష్కరిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంభించిందన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఓటు రూపంలో తగిన గుణపాఠం చెబుతారన్నారు. సాగునీటి సంఘాలను రద్దు చేసిందన్నారు. సహకార బ్యాంకులకు ఎన్నికలు నిర్వహించకుండా త్రిసభ్య కమిటీలతో వైసీపీ ప్రభుత్వం కాలం గడిపేసిందన్నారు. బ్యాంకు సొమ్ములు పక్క దారి పట్టాయన్నారు. బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయన్నారు. ఉండి,ఆకివీడు, కాళ్ళ ప్రాంతాలకు దశాబ్ద కాలంగా ఉన్న తాగు సాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో చుట్టూ నీరు ఉన్నా త్రాగటానికి స్వచ్చమైన, రక్షిత మంచినీరు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. తాగు, సాగునీటి సమస్యలు పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. ఆక్వా చెరువుల్లోని కలుషిత నీరు పంట కాలువల్లోకి రాకుండా నిరోధానికి చర్యలు తీసుకుంటానన్నారు. లేకుంటే ప్రజలంతా కిడ్నీ బాధితులుగా మారే ప్రమాదం ఉందన్నారు. ఉప్పుటేరు ఆధునీకీకరణ పనులు చేపట్టక పోవడంతో ఏటేటా వరి రైతులు నష్టపోతున్నారన్నారు. ఆక్వారంగానికి వెన్నుముఖగా ఉన్న ఉండి నియోజకవర్గ ఆక్వారైతులకు గిట్టుబాటు ధర అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. వరి, ఆక్వా రైతుల కోసం ఒక కమిషనర్‌ ఏర్పాటు చేసి ఆదుకుంటామన్నారు. ఉండి, కోపల్లె వంతెనల నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. గ్రామాల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థని అభివృద్ధి చేస్తామన్నారు. ఆకివీడు ప్రాంతంలో ప్రధాన సమస్యగా ఉన్న ట్రాఫిక్‌ నియంత్రించడానికి బైపాస్‌ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో అన్ని వర్గాల ప్రజల నుంచి కాంగ్రెస్‌ పార్టీకి విశేష స్పందన వచ్చిందన్నారు . సిపిఎం, సిపిఐ పార్టీల మద్దతుతో ఇండియా బ్లాక్‌ తరపున కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకీ వచ్చిన తర్వాత తొమ్మిది హామీలను ఖచ్చితంగా చేస్తామన్నారు. రెండు లక్షల రైతు రుణమాఫీ, ప్రతి కుటుంబంలో మహిళకు నెలకు రూ.8,333, ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం రూ.400, ఐదు లక్షలతో పేదలకు గృహ నిర్మాణం,వృద్ధులకు పెన్షన్‌ రూ.4వేలు, వికలాంగులకు రూ.6వేలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైతులకు గిట్టుబాటు ధర, ఉచిత విద్య తదితర పథకాలను అమలు చేస్తామన్నారు.
➡️