రాష్ట్రంలో సమ్మెల సైరన్‌

anganwadi strikes in ap anti labour policies ycp govt protest article

వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులపై అతి జుగుప్సాకరమైన బూతులు, కులాల చిచ్చులు, రాజకీయ దాడులు, ప్రతిదాడులు, కేసులు, కోర్టులు, జైల్లు ఇవే గత కొద్ది రోజుల క్రితం వరకు ఆంధ్రనాట ప్రధాన రాజకీయ పార్టీల అజెండాలు. అధికారం కోసం ఇంత దిగజారడం ఏమిటని పెద్దలు, రాజకీయమంటే ఇలా వుంటుందా అని యువతరం నిస్తేజపోతున్నవేల, కష్టజీవుల ఉద్యమ బాట కొత్త ఆశలను చిగురుస్తుంది. చెత్తచెదారలన్నింటిని ఉప్పెన వచ్చి ఊడ్చేసినట్లు అన్ని పార్టీల నేతల నోట కార్మికుల, శ్రమజీవుల గురించి మాట్లాడేటట్లు ఈ సమ్మెలు చేయగలుగుతున్నాయి. లక్ష మందికి పైగా అంగన్‌వాడీ మహిళలు గత 17 రోజులుగా మొక్కవోని దీక్షతో సమ్మె చేస్తుండడం ఆంధ్రదేశంలో మబ్బుల చాటున ఆగాయనుకుంటున్న అరుణకాంతులు ప్రకాశించడం రాష్ట్రానికి నవోదయం. వాస్తవంగా గత సంవత్సరంలోనే ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుబాటపట్టారు. కాని ఆ ఉద్యమాన్ని, ఆ తర్వాత ఆ ఉద్యోగులను అనేక రకాలుగా పాలకులు వేధిస్తూనే ఉన్నారు. ఇంతటితో అంతా ప్రశాంతం అనుకుంటున్న వేళ రాష్ట్రంలో వరుస సమ్మెల సైరన్‌ మారు మ్రోగుతుంది. అంగన్‌వాడీల తో మొదలైన ఈ సమ్మెల పరంపరలో ప్రస్తుతానికి సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు, మున్సిపల్‌ కార్మికులు చేరారు. ఇంకా ఆశా కార్మికులు, వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు సమ్మెలకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే బాటలో మరికొందరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమ్మె చేస్తున్నా, లేదా చేయడానికి సిద్ధమవుతున్న కార్మికుల, ఉద్యోగుల మొదటి డిమాండ్‌ తమకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చేయాలని, రెండవ డిమాండ్‌ సుప్రీం కోర్టు ఇచ్చిన సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని. అన్ని హామీలు అమలు చేసామని అధికార పార్టీల నేతలు చెబుతుంటే మా హామీల మాటేమిటని కార్మికులు, ఉద్యోగులు అడుగుతున్నారు. ‘ఇప్పుడు అమలు చేయకపోతే ఇంకెప్పుడు’ అని పోరుబాట పట్టారు. సినిమాలో చెప్పినట్లు నిశ్శబ్ధం ఎంత భయంకంరంగా వుంటుందో లేదో కాని నిజం చాల భయంకరమైంది. దాన్ని ఎంత దాచాలని చూసినా అది దాగదు. సమయానకూలంగా అది బయటకు వచ్చి తన విశ్వరూపాన్ని చూపుతుంది. నేడు ఆంధ్రరాష్ట్రంలో ఆ నిజమే కార్మిక, ఉద్యోగుల చేత సమ్మె సైరన్‌ మ్రోగిస్తుంది. ఆంధ్ర రాజకీయాలను కార్మికుల, శ్రమజీవుల మార్గం పట్టిస్తుంది.

రాజకీయం అంటే ప్రజాసేవ అనే అర్థం మారిపోయి చాలా కాలమైంది. పేదరికం, దారిద్య్రం, సాంఘికవివక్ష లాంటి అనేక రుగ్మతల కంబధహస్తాల్లో చిక్కుకున్న అత్యధికులకు సేవచేయడం, వారి జీవితాలను మెరుగుచేయడమే మనిషి పుట్టుకకు పరమార్థమని, అందుకు రాజకీయం, తద్వార వచ్చే పదువులు మార్గాలని నాటి తరం భావించింది. అందుకే వారు సుఖసౌఖ్యాలను, ఆస్థులను, వారసులను అన్నింటిని ఒదలుకొని ప్రజాసేవ చేశారు. ఆదర్శనీయులుగా చరిత్రలో మిగిలారు. అందులో కమ్యూనిస్టులు అందరికంటే మరింత ముందుభాగాన నిలిచారు. లక్షలాది జనం గుండెల్లో చెదరని ముద్ర వేశారు. కాలం మారిందనే పేరుతో విలువల వలువలు ఊడదీసే నేతలే నేడు రాజకీయాల్లో రాణిస్తున్నారు. వీరు చేసే అక్రమాలకు, అవినీతికి, దోపిడికి, దౌర్జన్యానికి అక్రమ సంపాదనలకు ప్రజల్లో వచ్చిన మార్పులే కారణమని సిగ్గువిడచి సమర్థించుకుంటున్నారు. నాటి నేతలకు జాతీయోద్యమ స్ఫూర్తి, ప్రపంచ పరిణామాలు ఆదర్శంగా ఉన్నాయి. నేటి నేతలకు ప్రపంచబ్యాంకు ఆదేశిత ఆర్థిక విధానాలు అవి నేర్పిన అబద్ధాలు, అక్రమాలు, అవినీతి మార్గదర్శకంగా ఉన్నాయి. అందుకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాల గురించి మాట్లాడి, అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సుఖాలు మాత్రమే చూసుకుంటున్నారు. అధికారం కోసం ఎన్ని అబద్ధాలైన, ఎన్ని హామీలైన ఇవ్వాలి, అధికారం వచ్చాక ప్రజలను, కష్టజీవులను అణచివుంచాలన్నది నేటి నేతల విధానంగా మారింది. ఇలాంటి వారికి ఢిల్లీ మోడీ అప్రకటిత గురువు అయ్యారు.

 

  • సమ్మెలకు ఎవరు కారణం?

అంగన్‌వాడీ ఉద్యోగులకు 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణా కంటె వెయ్యి రూపాయలు అదనంగా వేతనం ఇస్తానని వాగ్దానం చేశారు. ఇప్పుడు తెలంగాణ లో వర్కర్‌ కు రూ.13,650, మినీ వర్కర్‌కు, హెల్పర్‌కు రూ.7,800 ఇస్తుండగా ఆంధ్ర ప్రదేశ్‌లో వరుసగా రూ.11,500, రూ.7,000 మాత్రమే ఇస్తున్నారు. అంటే పొరుగు రాష్ట్రం కంటె వర్కర్‌కు రూ. 2,150, మినీ వర్కర్‌కు,హెల్పర్‌కు రూ. 800లు తక్కువ. తెలంగాణ లో మిని అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చారు. రూ. 1800లు వేతనం పెంచుతామని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. తానకు తాను తెలంగాణ పోలికతెచ్చి మాట ఇచ్చి నేడు మాట తప్పడం ఏమిటని అంగన్‌వాడీలు అడుగుతున్నారు. రాత్రికి రాత్రి సమ్మె చేసింది కాదు. గత నాలుగున్నరేళ్ళుగా విధులకు ఇబ్బందులు లేకుండా ప్రాజెక్టుల వద్ద అధికారులకు వినతిపత్రాలు, ధర్నాలు, చవరకు ఛలో విజయవాడ నిర్వహించి ముఖ్యమంత్రి కి తమ సమస్యలు చెప్పుకోడానికి ప్రయత్నించారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఎక్కడి వారిని అక్కడ అరెస్టులు చేసి సమ్మెకు కారణమయ్యారు.

అంగన్‌వాడీలకు గ్రాట్యుటీ చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మన రాష్ట్రంలో అమలు చేసి తమకు గ్రాట్యుటీ చెల్లించాలనీ అంగన్‌వాడీలు అడుగుతుంటే కోర్టుకు వెళ్లి డైరెక్షన్‌ తీసుకరండి అని మంత్రి గారు సెలవిస్తున్నారు. అంగన్‌వాడీ నాయకులను చర్చలకు పిలిచి ముఖ్యమంత్రికి మహిళల మీద ప్రేమ ఉంది సంక్రాంతి వరకు సమ్మెను ఆపండి అని సూక్తిరత్నావళి బోధించాలని చూస్తున్నారు. త్వరలో ఎన్నికలు రానున్నాయని ఒకవైపు ముఖ్యమంత్రి చెబుతుంటే, మరోవైపు సంక్రాంతి వరకు ఆగమనడంలోని ఆంతర్యాన్ని అంగన్‌వాడీ సంఘాల నాయకులు గుర్తించారు. ఇప్పటికే చాలా ఆగాము, ఇప్పుడు పరిష్కరించకపోతే ఇంకెప్పుడు అని పట్టుదలతో సమ్మెను కొనసాగిస్తున్నారు.

సమగ్ర శిక్షా ఉద్యోగులు వారం రోజులకు పైగా సమ్మె చేస్తున్నారు. విద్యాశాఖ పరిదిలో పనిచేస్తున్న వీరికి పిఆర్సీ అమలు చేయకుండా, నెలలు తరబడి వేతనాలు విడుదల చేయకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మినిమం ఆఫ్‌ టైమ్‌ స్కేల్‌ అమలు చేస్తామని ఈ ప్రభుత్వమే జీఓలు మీద జీవోలు ఇచ్చి, అమలు చేయడంలేదు. ప్రాజెక్టులో ఒకే క్యాడర్‌ ఉద్యోగులకు రకరకాల వేతనాలు చెల్లిస్తూ, కొత్త విధానాలకు తెరలేపి, పాత వారికి జీతం పెంచకుండా, కొత్తగా నియమితమైన వారికి జీతం పెంచే సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు.సమగ్రశిక్ష కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, పార్ట్‌టైం ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్‌ చెయ్యాలని, హెచ్‌.ఆర్‌ పాలసీ అమలు చెయ్యాలనే వారి డిమాండ్లు వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు న్యాయమైనవిగా, అధికారంలోకి వచ్చాక అన్యాయమైనవిగా కనిపించడానికి ఎవరు కారణం?

మున్సిపల్‌ ఉద్యోగ, కార్మికులు గత నాలుగు రోజులుగా సమ్ము చేస్తున్నారు. నేటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి 2019 ఎన్నికలకు ముందు, తర్వాత కూడా మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులందర్నీ ”మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 నెలల్లో పర్మినెంట్‌ చేస్తానని, సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని, పర్మినెంట్‌ సిబ్బందికి సిపిఎస్‌ ను వారం రోజుల్లోనే రద్దు చేస్తామని హామీలు ఇచ్చారు” అధికారం వచ్చి 5 సం||లు పూర్తికావస్తున్నా ఆ హామీలు అమలు చేయలేదు. గత నాలుగున్నరేళ్లలో అనేక రూపాల్లో తమ సమస్యలను అధికారుల, మంత్రుల దృష్టికి ఈ కార్మికులు తెచ్చారు. మున్సిపల్‌ కార్మిక సంఘాలతో జాయింట్‌ మీటింగ్‌లు జరిపి ఆమోదించన వాటిని కూడా అమలు చేయలేదు. ఉదా: 2022 జూలైలో ఈ కార్మికులు చేసిన ఐదు రోజుల సమ్మె సందర్భంగా ఇంజినీరింగ్‌ కార్మికులకు జీఓ ఆర్టీ నెం. 30 సవరించి వాటర్‌ సెక్షన్‌, అండర్‌ గ్రౌండ్‌ డ్రేనేజీ, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ తదితర కేటగిరీలకు కార్మికశాఖ ప్రతిపాదించిన జీతాలు చెల్లించాలి. కాని అమలు చేయలేదు. ఈ సంవత్సరం జూన్‌ 27న ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఆగస్టు 10న మంత్రులు చర్చలు జరిపి అంగీకరించిన హామీలు నేటికీ అమలు కాలేదు. పబ్లిక్‌ హెల్త్‌ పరిధిలోని చెత్త తరలించే వాహన డ్రైవర్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, మలేరియా, పార్క్‌ల్లో పనిచేసే కార్మికులకు గత మూడేళ్లుగా హెల్త్‌ అలవెన్సు చెల్లించడం లేదు. మున్సిపల్‌ కార్మికులను ఆప్కాస్‌లో చేర్చి, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీంటికి దూరం చేశారు.

ప్రస్తుతం సమ్మె చేస్తున్న కార్మికులే కాదు ఉద్యోగ, ఉపాధ్యాయులు అదే బాట పట్టే పరిస్థితులు వచ్చాయి. ఇందుకు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అధికారం వచ్చిన ఆరు వారాల్లో సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తాననే ముఖ్యమంత్రి హామీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోకపోగా, ప్రతి నెల మొదటివారంలో వేతనాల కోసం, గతంలో ఉన్న సదుపాయాల రక్షణ కోసం ఉద్యోగులు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి.

  • ప్రతిపక్షాల వైఖరి

తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సమ్మెలకు మద్ధతు ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో నాయకులు సమ్మె శిబిరాలకు వెళ్ళి సంఘీభావం తెలపడమే కాకుండా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సమస్యలన్నీ తీరుస్తామని చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు. కానీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అమలు చేయలేదు? అని కార్మికులు అడుగుతున్న ప్రశ్నలకు వారి వద్ద సమాధానాలు లేవు. కారణం వారు, వీరు, బిజెపి, దాని కూటమిలో భాగస్వామైన జనసేన ఈ పార్టీల ఆర్థిక విధానాలన్నీ ఒక్కటే. కాకులను కొట్టి గద్దలకు వేసే విధానాలే నేటి కార్మిక వర్గం ఎదుర్కొంటున్న దురవస్థలన్నింటికీ మూలం. ఆ విధానాల్లో మార్పు రాకుండా కార్మికుల కష్టాలను తీరుస్తామని ఎవరు చెప్పిన అది వంచన, బూటకం అన్నది అనుభవ సత్యం. అందుకే శ్రమజీవులకు, ప్రజలకు వినాశకరమైన ఆ ఆర్థిక విధానాలు మారాలి. అందుకు పోరాటాలు, సమ్మెలు మార్గాలు.

  • సిపిఎం ప్రజా పోరు మార్గం

రాష్ట్ర రాజకీయాలను ప్రజామార్గం పట్టిస్తామని విజయవాడలో జరిగిన ప్రజారక్షణ భేరి సభలో సిపిఎం విస్పష్టంగా ప్రకటించింది. అందుకు ముందుగా పోలవరం నిర్వాసితుల పాదయాత్ర చేసింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రజా ప్రణాళిక రూపొందించింది. నిర్ధిష్టమైన డిమాండ్ల ఆధారంగా ఉద్యమాలకు ఊపిరిగా నిలుస్తుంది. రాజకీయం అంటే వ్యక్తిగత విమర్శలు చేయడం, బూతులు మాట్లాడడం, ఎదో ఒక పార్టీ పక్షాన నిలవడం కాదు, ప్రజల పక్షాన నిలచి పోరాడడం, పోరాటాలకు దన్నుగా నిలవడం అని ఆచరించి చూపుతుంది. కార్మిక, కర్షక ఉద్యమాలే రాష్ట్ర భవిష్యత్‌కు దిక్సూచి.

 

ram bhupal

– సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులువి. రాంభూపాల్‌

➡️