ఎన్నికల బాండ్లతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం

ఎన్నికల బాండ్ల విధానం వెనుక బిజెపి, దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ రహస్య ఎజెండా ఉంది. అత్యంత సంపన్న కార్పొరేట్‌ కంపెనీల నుండి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి ఎన్నికల వ్యవస్థను తమకు అనుకూలంగా మలచుకోవడం, మతోన్మాద కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ధనాన్ని పోగు చేయడమనే ఎజెండాలో భాగమే ఎన్నికల బాండ్ల వ్యవస్థ. గుండు సూది మీద కూడా లాభాలు దండుకుని, చట్టబద్ద పన్నులు ఎగ్గొట్టి, బ్యాంకులను దివాళా తీయిస్తున్న ఈ కార్పొరేట్‌ కంపెనీలు ఏ పార్టీకీ విరాళాలు ఊరికే ఇవ్వవు. డబ్బు ఊరికే రాదన్నట్లు కార్పొరేట్‌ కంపెనీల నుండి రాజకీయ పార్టీలకు అందునా అధికార పార్టీకి భారీ స్థాయిలో విరాళాలు ఊరికే రావు. ‘నేను కొంత ఇస్తాను, ఆ తర్వాత అంతకంత, మరింత’ కావాలనే ఈ కంపెనీలకు దోచిపెడితే అందులో కొంత అధికార పార్టీలకు దానం చేస్తారు. అందుకే సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల విధానం క్విడ్‌ప్రోకోకు దారితీస్తుందని వాఖ్యానించింది. నేటి వాస్తవ పరిస్థితిని ఈ తీర్పు ప్రతిబింబించింది. 2018 నుండి ఎన్నికల బాండ్ల ద్వారా జాతీయ, ప్రాంతీయ పార్టీలకు రూ.16,437 కోట్ల విరాళాలు అందగా, అందులో రూ.10,117 కోట్లు బిజెపి ఖాతాలోకి వెళ్ళాయంటే ఈ విధానం ఎవరి కోసం వచ్చిందో అర్థమవుతుంది. బిజెపి పాలనా కాలంలో కార్పొరేట్‌, మతతత్వ శక్తుల బంధం బలపడిందని, అది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని చాలా ముందుగానే సిపిఎం హెచ్చరించింది. సుప్రీంకోర్టులో కేసు వేసింది. నేటి తీర్పుకు కారణమైంది. రాజ్యాంగ విరుద్ధమైన ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పుల్లో న్యాయమూర్తులు పరస్పర విరుద్ధంగా తమ నిర్ణయాలను ప్రకటిస్తూ వచ్చిన నేపథ్యంలో ఎన్నికల బాండ్ల మీద ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా 232 పేజీల తీర్పునివ్వడం సంచలనమే. ప్రజాస్వామ్య వ్యవస్థకు కార్పొరేట్‌ కంపెనీల చెదలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో ఈ తీర్పు తేటతెల్లం చేసింది. ఇప్పటి వరకు విక్రయించిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6వ తేదీ నాటికి ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని, ఎవరు, ఏ పార్టీకి ఎంత మొత్తంలో జమ చేశారనే వివరాలు మార్చి 13 నాటికి బహిరంగంగా ఉంచాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశం అమలయితే పాలక బిజెపి లోగుట్టు మరింత రట్టు అవుతుంది. మతం చాటున, దేశభక్తి ముసుగున సాగింది ఏమిటో కొంతైనా బట్టబయలు అవుతుంది.

ఎన్నికల బాండ్లు ఎందుకు?

దేశంలోని రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు 2017-18 బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2018 మార్చి 1 నుండి 10 వరకు మొదటి విడత బాండ్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. జూన్‌ 29 నుండి ఇది పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చింది. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెయ్యి రూపాయల నుండి కోటి విలువ చేసే బాండ్లను విడుదల చేస్తుంది. ఎవరైనా ఈ బాండ్లను ఎంత మొత్తంలోనైనా కొని తమకు ఇష్టమైన పార్టీకి అందించవచ్చు. రిప్రజెంటేటివ్‌ ఆఫ్‌ పీపుల్స్‌ యాక్ట్‌ ప్రకారం నమోదైన రాజకీయ పార్టీలు ఈ బాండ్ల నుండి విరాళాలు పొందవచ్చు. ఈ బాండ్లను ప్రతి సంవత్సరం జనవరి, ఏప్రిల్‌, జులై, అక్టోబర్‌ నెలల్లో విడుదల చేస్తారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో మరో 30 రోజులు అదనంగా అందుబాటులో ఉంచుతారు. ఈ ఏడు సంవత్సరాల్లో 30 సార్లు 28 వేల బాండ్లను విడుదల చేశారు. వాటి మొత్తం విలువ రూ.16,437 కోట్లు.

తమకు ఇష్టమైన పార్టీకి నేరుగా విరాళం ఇవ్వొచ్చు కదా. ఈ బాండ్లను కొనడం, ఇవ్వడం ఎందుకనే సందేహం వస్తుంది. ఎవరి నుండి ఎంత మొత్తం విరాళాలు అందాయో ఆ వ్యక్తులు, సంస్థల పేర్లు ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు తెలిపే విధానం గతంలో వుండేది. దీనివల్ల పారదర్శకత లోపించిందని, అందుకు ఎన్నికల బాండ్లు పరిష్కారమని బిజెపి వాదించింది. అయితే ఈ విధానం ప్రకారం కొన్నవారి పేర్లు, తీసుకున్న పార్టీల పేర్లు ఎక్కడ నమోదు కావు. నల్లడబ్బును వెలికితీయడానికి రూ.500 నోట్లు రద్దు చేసి రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టడం, పారదర్శకత చాటున ఎలక్టోరల్‌ బాండ్లు తెచ్చి రూ. వేల కోట్లను తమ ఖాతాల్లో వేసుకోవడం బిజెపి బహు నాలుకల విధానం. ఎన్నికల బాండ్ల ప్రవాహానికి ఏ ఆటంకాలు లేకుండా ఉండేందుకు అనేక చట్టాలకు సవరణలు చేశారు.

ఉదా: కంపెనీలు తమ రాజకీయ విరాళాల వివరాలను బ్యాలెన్స్‌ షీట్‌లో రాయాల్సిన అవసరం లేకుండా కంపెనీల చట్టానికి 2013లో సవరణలు తెచ్చింది. విదేశీ సంస్థలు కూడా విరాళాలు అందించేందుకు వీలుగా ఎఫ్‌సిఆర్‌ఎ చట్టానికి సవరణలు చేసింది. ఈ ఎన్నికల బాండ్ల పథకం అమలు కావాలంటే పార్లమెంట్‌ ఆమోదం కావాలి. రాజ్యసభలో బిజెపి కి పూర్తి మెజారిటీ లేదు. అందుకోసం దొడ్డిదారిన ఈ పథకాన్ని బడ్జెట్‌లో మనీ బిల్‌గా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి రాజ్యసభ ఆమోదం అవసరం లేకుండా ఆమోదించుకున్నారు. సేవా దృక్పథంతో నడిచే అనేక స్వచ్ఛంద సంస్థలు బిజెపి పాలనా కాలంలో మూతబడ్డాయి. ఈ సంస్థలపై తనిఖీలు, వేధింపులు, దుష్ప్రచారాలు పెరిగాయి. ఇప్పటి వరకు అమ్మిన ఎన్నికల బాండ్లలో కోటి రూపాయల విలువ చేసే బాండ్లు 54 శాతం, పది లక్షల బాండ్లు 41 శాతంగా ఉన్నాయి. ఇందులో అత్యధికం బిజెపి ఖాతాలోకి చేరాయి. అధికారంలో ఎవరుంటే వారి ఖాతాల్లోకి ఈ ఎన్నికల బాండ్లు వెళతాయి. మన రాష్ట్రంలో తెలుగుదేశం, వైసిపిలకు అందిన ఈ విరాళాలు అధికారాన్ని బట్టి అందాయి.

ప్రజాస్వామ్యానికే ప్రమాదం

ప్రజాస్వామ్యానికి పునాది ప్రజాభిప్రాయం. అందుకే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన పాలించేది ప్రజాస్వామ్యం అన్నారు. ఈ ప్రక్రియ ఎన్నికల ద్వారా జరుగుతుంది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తాము చేసే పనుల ద్వారా, ఎన్నికల సమయంలో ప్రకటించే ప్రణాళికల ద్వారా ప్రజాభిప్రాయాన్ని తమవైపు ఆకర్షిస్తారు. అయితే పాలక పార్టీలు ఎప్పుడూ ప్రజలను, వారి అభిప్రాయాలను గౌరవించడం, ప్రజలకు తాము సేవకులమనే విషయాలను చాలాకాలం క్రితమే మరచిపోయారు. అందుకే ఎన్నికలంటే డబ్బులు పెట్టి ఓట్లు కొనడంగా మార్చివేశారు. ముఖ్యంగా సరళీకరణ విధానాలు అమలులోకి వచ్చిన తర్వాత ప్రజలు పోరాడి సాధించుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థ తీవ్ర ప్రమాదంలో పడింది. డబ్బున్నవారిదే ఎన్నిక లాగా మారింది. ఎన్నికల ముందు నోట్ల కట్టలతో పార్టీల చుట్టూ తిరిగి ఏదో పార్టీలో సీటు సంపాదించుకోవడం, గెలిచిన తర్వాత అధికారంలో ఏ పార్టీ వుంటే ఆ పార్టీలో చేరడం ఇటీవల సర్వసాధారణమైంది. ఎన్నికల బాండ్ల విధానం ఈ పరిస్థితిని మరింతగా దిగజార్చింది. నల్లడబ్బు గుట్టలు గుట్టలుగా ఈ బాండ్ల రూపంలో పాలక పార్టీల ఖాతాల్లోకి వెళ్తుంది. ఈ డబ్బుతో ఓట్లను కొనడం అనేక రెట్లు పెరిగింది. ప్రజల చేత కాకుండా డబ్బు చేత ఎన్నుకోబడడంగా మారింది. చట్టసభల్లో బిల్లులు, విధాన నిర్ణయాల్లో ఎంఎల్‌ఏ, ఎంపీల పాత్ర కుదించుకు పోయింది. అధినేత మాటలే సిద్ధాంతాలుగా, ఏ పూటకు ఏది లాభం అనుకుంటే అదే విధానంగా మారిపోయింది. పెద్ద మొత్తంలో బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చిన కంపెనీలే ప్రభుత్వ విధానాలను రూపొందించే పరిస్థితి వచ్చింది. అనంతరం వారు బ్యాంకులు, బీమా సంస్థలతో మొదలై బిఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వే, ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్లు, గనులు, నీళ్ళు, ప్రభుత్వ సంస్థలు ఇలా ఒక్కటేమిటి సర్వ సంపదను సులభంగా కాజేస్తున్నారు. ఎన్నికల బాండ్ల వ్యవస్థ ఒకవైపు ప్రజాస్వామ్య వ్యవస్థను నిస్సారంగా మారుస్తుంది. మరోవైపు దేశ సంపదను లూటీ  చేస్తుంది.

హెచ్చరికలు బేఖాతరు

కేంద్రంలో పది సంవత్సరాలుగా అధికారాన్ని చెలాయిస్తున్న బిజెపి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విధానాన్ని ఎంత బలహీనం చేయాలో అంతగా చేసేసింది. పారిశ్రామిక విప్లవం బూర్జువా ప్రజాస్వామ్యాన్ని సృష్టించుకుంది. దాని అభివృద్ధికి ఆటంకమైతే ఆ ప్రజాస్వామ్యాన్ని కూడా భక్షిస్తుందనేది వర్తమాన సత్యం. అయితే బిజెపి సిద్ధాంతమే బూర్జువా ప్రజాస్వామ్యం కంటే మరింత వెనుకటిది. రాజరిక పాలనా వ్యవస్థ, మను ధర్మ వర్ణ వ్యవస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం. ఆధునిక శాస్త్రీయత దానికి గిట్టదు. ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేయడానికి అనేక విధాల ప్రయత్నిస్తున్నది. అందులో ఒక భాగం ఎన్నికల బాండ్ల విధానం. ఈ విధానం పారదర్శకతకు ముగింపు అని, విదేశీ కార్పొరేట్‌ శక్తులు దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి వీలుంటుందని 2019లో సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌లో ఎన్నికల కమిషన్‌ తెలిపింది. రాజకీయ పార్టీలకు విరాళాలు అందించడం కోసమే ‘షెల్‌’ (బూటకపు) కంపెనీలు పుట్టుకొస్తాయని పేర్కొంది. రిజర్వు బ్యాంకు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేసింది. అనేకమంది నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా కేంద్ర బిజెపి బేఖాతరు చేయడానికి దాని పురాతన సిద్ధాంత అవగాహనే కారణం.

సిపిఎం విశిష్టత

ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు పొందని ఏకైక రాజకీయ పార్టీ సిపిఎం. గత 20 సంవత్సరాల క్రితం టాటా కంపెనీ చెక్‌ రూపంలో జాతీయ పార్టీలకు విరాళాలు పంపింది. ఈ విరాళాన్ని బహిరంగంగా వెనక్కు పంపిన ఏకైక రాజకీయ పార్టీ సిపిఎం మాత్రమే. ఆ సమయంలో సిపిఎం నాయకత్వంలో మూడు రాష్ట్రాల్లో వామపక్ష ప్రభుత్వాలున్నాయి. కేంద్రంలో యుపిఎ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది. ఎన్నికల బాండ్ల విధానాన్ని ప్రారంభం నుండి అభ్యంతరం చెబుతూ చట్టసభల్లో, బయట అనేక రూపాల్లో ఆందోళనలు చేసింది. రాజకీయ పార్టీలు ప్రజల నుండి పోషించబడాలే కాని కార్పొరేట్‌ కంపెనీల నుండి కాదన్నది దాని అవగాహన. కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు పంటల సమయంలో శ్రమదానం చేసి విరాళాలు సేకరించడం కమ్యూనిస్టు ఉద్యమ ప్రత్యేకత. ఈ సంప్రదాయాన్ని సిపిఎం కొనసాగిస్తున్నది. ఈ తీర్పుతో సంబంధం లేకుండానే ఈ నెల ఒకటో తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం శ్రేణులు ఇంటింటికి తిరిగి ప్రజానిధి వసూలు చేస్తున్నారు. రాజకీయమంటే వ్యాపారం కాదు, ప్రజాసేవ అని ప్రజల నుండి ఒత్తిడి పెంచడమే ప్రజాస్వామ్యానికి రక్ష.

ram bhupal

వ్యాసకర్త : వి. రాంభూపాల్‌, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

 

➡️