పాపం…గాజా పిల్లలు!

అన్ని యుద్ధాలలో ఎక్కువగా బాధపడేది మహిళలు, పిల్లలే. యుద్ధాలకు కూడా నియమాలు ఉంటాయి. అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం ఏ ఒక్క చిన్నారి కూడా అవసరమైన సేవలకు, మానవతా దృక్పథానికి దూరం కాకూడదు. సాయుధ పోరాటంలో ఏ చిన్నారినీ బందీగా ఉంచకూడదు. ఏ విధంగానూ వారిని యుద్ధంలో భాగస్వాములను చేయగూడదు. వారిని సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. ఆసుపత్రులు, పాఠశాలల మీద బాంబు దాడులు చేపట్టకూడదు. అయితే వీటికి విరుద్ధంగా గాజాలో ఇజ్రాయిల్‌ ప్రవర్తిస్తున్నది. గాజా స్ట్రిప్‌లో పెరుగుతున్న శత్రుత్వాలు పిల్లలు, వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పిల్లలు ప్రమాదకర స్థాయిలో చనిపోతున్నారు. ఇప్పటికే వేలాది మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. గాజా స్ట్రిప్‌లో 19 లక్షలకు పైగా ప్రజలు అంతర్గతంగా వలస బాట పట్టారని అంచనా. వారిలో సగం మంది పిల్లలే. వారికి తగినంత నీరు, ఆహారం, ఇంధనం, మందులు అందుబాటులో లేవు. వారి ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వారి కుటుంబాలు చీలిపోయాయి. తల్లులు ప్రసవించే ముందు, ప్రసవ సమయంలో, తరువాత తగిన వైద్య సంరక్షణ, పోషకాహారం, రక్షణను పొందడంలో అనూహ్యమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. స్వచ్ఛమైన నీరు, శుభ్రమైన మరుగుదొడ్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచే అవకాశం లేకపోవడంతో గాజాలో హెపటైటిస్‌-ఎ అంటువ్యాధులు ప్రబలుతున్నాయు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా సమాచారం ప్రకారం సగటున 500 మంది ఒకే మరుగుదొడ్డిని వాడుతున్నారు. 2,000 మందికి పైగా ప్రజలు ఒకే షవర్‌ని ఉపయోగిస్తున్నారు. ఇది వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదాన్ని పెంచుతుంది. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో అతిసార కేసులు విపరీతంగా నమోదయ్యాయి. బలహీనంగా ఉన్న తల్లులు వారి నవజాత శిశువులకు పాలివ్వలేని పరిస్థితి గాజాలో ఉంది. వీరికి పోషకాహార లోపం, ఇతర ఆరోగ్య సమస్యలు అధికం అవుతున్నాయి. తాత్కాలిక ఆశ్రయాలు, పేలవమైన పోషణ, సురక్షితంకాని నీరు వంటి అమానవీయ పరిస్థితులు కనబడుతున్నాయి. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం దాదాపు 25,000 మంది మరణించారు. ఇందులో 70 శాతం మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. కనీసం మరో 61,500 మంది గాయపడ్డారు. పాలస్తీనాలోని పిల్లల భద్రత, సంరక్షణ కోసం యునిసెఫ్‌ పిలుపునిస్తోంది. తక్షణ, దీర్ఘకాలిక మానవతావాద కాల్పుల విరమణ ప్రకటించాలి. అపహరణకు గురైన పిల్లలందరినీ తక్షణం షరతులు లేకుండా విడుదల చేయాలి. గాజాలో పిల్లలు అత్యవసర వైద్యాన్ని, ఆరోగ్య సేవలను పొందే అవకాశం కలిగించాలి.

– జనక మోహన రావు దుంగ, అధ్యాపకుడు,

శ్రీకాకుళం, సెల్‌: 8247045230

➡️