మీలా మేం సురక్షితంగా లేం..

Dec 5,2023 20:45 #movies

తుపాను కారణంగా చెన్నై నగరంలో నెలకొన్న పరిస్థితులపై విశాల్‌ స్పందించారు. 2015లో వచ్చిన వర్షానికే నగరం పూర్తిగా స్తంభించిపోయిందని గుర్తు చేశారు. అది జరిగి ఏళ్లు గడుస్తున్నా నగర పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేకపోగా.. మరింత అధ్వానంగా తయారైందంటూ అసహనం వ్యక్తం చేశారు. ‘డియర్‌ ప్రియా రాజన్‌ (చెన్నై మేయర్‌), గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌, ఇతర అధికారులకు.. మీరంతా మీ కుటుంబ సభ్యులతో కలిసి సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నా. ముఖ్యంగా వర్షం కారణంగా పారే డ్రైనేజీ నీరు మీ ఇళ్లలోకి రావనుకుంటున్నా. మీ ఇళ్లకు ఎలాంటి లోటూ లేకుండా కరెంట్‌, ఆహారం, మంచి నీరు అందుతోందని భావిస్తున్నా. అయితే, ఇదే నగరంలో మీతోపాటు నివసిస్తున్న మేమంతా మీలా సురక్షితంగా లేం. మీరు చేపట్టిన స్టార్మ్‌ వాటర్‌ డ్రెయిన్‌ ప్రాజెక్ట్‌ సింగపూర్‌ కోసమా? లేక చెన్నై కోసం ఉద్దేశించిందా? 2015లో ఇలాంటి పరిస్థితి నెలకొన్నప్పుడు ప్రజలంతా రోడ్లపైకి వచ్చారు. ఆ ఘటన జరిగి 8 ఏళ్లు అయ్యింది. అయినా నగర పరిస్థితి మారకపోగా.. అంతకు మించి అధ్వానమైన పరిస్థితిని చూస్తున్నాం. ఈ సారి కూడా బాధితులకు మేమంతా ఆహారం, నీటిని సరఫరా చేసి వారిని ఆదుకుంటాం. అదేవిధంగా ప్రజా ప్రతినిధులందరూ వారివారి నియోజకవర్గాల్లో బయటకు వచ్చి బాధితులకు అండగా నిలుస్తారని నేను భావిస్తున్నా. ఇలా రాయాల్సి వస్తున్నందుకు నేను సిగ్గుతో తలదించుకుంటున్నా. మీరేమీ అద్భుతాలు సృష్టిస్తారని ఆశపడటం లేదు. కనీసం మీ బాధ్యతను నిర్వర్తిస్తే చాలు’ అంటూ విశాల్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో రాశారు.

➡️