పర్యావరణ పరిరక్షణ కోసం…

Dec 6,2023 10:28 #Jeevana Stories

పర్యావరణ పరిరక్షణకు అడవులు, వాటిలోని మొక్కలు ఎంతగానో దోహదం చేస్తాయి. అలాంటి అడవుల పరిరక్షణ కోసం కర్ణాటక రాష్ట్రం మంగుళూరుకు చెందిన పర్వతారోహకుడు, పర్యావరణ వేత్త జీత్‌మిలన్‌ రోచె కృషి చేస్తున్నారు. అంతరించిపోతున్న అడవులను కాపాడేందుకు తనవంతుగా పాటుపడుతున్నారు. రోచె నేతృత్వంలోనే కంఠవరంలో వన చారిటబుల్‌ ట్రస్ట్‌ అటవీ సంరక్షణ ప్రాజెక్టును చేపట్టింది. దీనికి అటవీశాఖ సహకారం అందిస్తోంది. క్రమేపి తగ్గిపోతున్న అడవులను పచ్చదనంగా మార్చేందుకు మొక్కలు నాటడం, అడవులను శుభ్రం చేయటంలో జీత్‌ వాలంటీర్లు, పర్యావరణ వేత్తలు సహకారం అందిస్తున్నారు.

మంగుళూరు పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు ఎక్కువగా ఉండటం, పట్టణీకరణ, నగరీకరణల నేపధ్యంలో అడవుల విస్తీర్ణం తగ్గిపోతోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు, వాణిజ్య అభివృద్ధి పేరుతో ఏళ్లతరబడి చెట్లు నరికివేయ బడుతున్నాయి. ఈ క్రమంలో గతంలో వినిపించిన పక్షుల కిలకిలారావాలు మూగబోతున్నాయి. అడవిలో జంతువులు తమ ఆవాసాలను కోల్పోయాయి. ఇలాంటి పరిస్థితులను స్వయంగా చూసి, తెలుసుకున్న పర్యావరణ వేత్త జీత్‌మిలన్‌ రోచె, మంగుళూరు నగరానికి పచ్చని తోరణం తేవాలని భావించారు. అదే క్రమంలో మొక్కలు నాటేందుకు, పచ్చదనం ఉద్యమం ముందుకు సాగే ఆలోచనలు చేయాలని భావించారు. ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యం, క్షీణిస్తున్న పర్యావరణ పరిస్థితులను తెలుసుకున్న రోచె 2004లో తన కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలిపెట్టారు. ఎలాంటి ప్రత్యేక ప్రణాళికలు లేకుండానే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడానికి బయలుదేరారు. చుట్టూ కనిష్టంగా ఉన్న పచ్చదనాన్ని గమనించి ఒక్కో మొక్కను నాటడాన్ని ప్రారంభించారు. ఈ విధంగా ప్రారంభించిన ప్రయాణంలో మరికొందరు చేరటంతో ఆయనకు మరింత బలం చేకూరింది. అంతరించిపోతున్న అటవీ విస్తీర్ణాన్ని విస్తరించాలనే అభిరుచి అందరికీ వంటబట్టడంతో ‘పర్యావరణం… పచ్చదనం.. అడవిని విస్తరిద్దాం’ నినాదంతో ముందుకు సాగారు. వందలు, వేలల్లో మొక్కలు నాటుతున్నారు.కంఠవరాన్ని కాపాడుతున్నారుఉడిపి జిల్లాలోని కర్కల తాలూకాలోని రిజర్వు ఫారెస్ట్‌ కంఠవరంలో వన చారిటబుల్‌ట్రస్ట్‌, రోచె నేతృత్వంలోని అటవీ సంరక్షణ ప్రాజెక్టును చేపట్టింది. దేశంలో అడవులు తగ్గిపోతుండటం, క్షీణిస్తున్న అడవుల పరిరక్షణ, పునరుద్ధరణ గురించి పిల్లలు, ఉపాధ్యాయులు, ప్రజలకు అవగాహన కల్పించటమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. అటవీశాఖ సహకారంతో పనిచేస్తూనే లోపల అడవిలో కార్యకలాపాలపై నిఘా ఉంచుతుంది. ఉల్లంఘనలు ఏమైనా ఉంటే అటవీశాఖకు ట్రస్ట్‌, ప్రాజెక్టు ప్రతినిధులు తెలియజేస్తుంటారు. ‘అడవుల్లో ఎవరైనా చెట్లను నరకటం, జంతువులను వేటాడటం, ఆక్రమించుకోవటం వంటివి చూసినప్పుడు స్థానికంగా నివసించే వారు మమ్మల్ని అప్రమత్తం చేస్తారు. వారు మాకు లొకేషన్‌ పంపుతారు. మేము వెంటనే అటవీశాఖకు సమాచారం అందిస్తామని రోచె తెలిపారు. కంఠంవరలో పరిరక్షణ ప్రాజెక్టులో భాగంగా అడవుల ప్రాముఖ్యత- వాటి పరిరక్షణ గురించి మరింతగా తెలుసుకోవటానికి చాలా ప్రాంతాల నుంచి కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు సైతం వస్తున్నారు. వాలంటీర్‌ గ్రూపులు కూడా వారాంతాల్లో కంఠవర బేస్‌ క్యాంపులకు వస్తున్నారు. వారికి భోజనం, బస, ఇతర ఏర్పాట్లు నిర్వాహకులు చేస్తున్నారు. ఆయా బృందాలకు స్థానికులు, అటవీశాఖ ద్వారా అడవుల ప్రాముఖ్యత, వాటిని ఎలా పునరుద్ధరించాలిపై అవగాహన కల్పిస్తున్నారు. అడవులను శుభ్రపర్చటం, చెట్ల పెంచటం కార్యకలాపాల్లో కూడా వారు పాలు పంచుకుంటున్నారు.

మంగుళూరుకు పచ్చని శోభ 2004 నుంచి ప్రారంభమైన ఈ పచ్చనియజ్ఞం 2016 నాటికి ఉధృతి రూపు దాల్చింది. మంగుళూరు చుట్టూ మొక్కలు పెద్దఎత్తున నాటడంతో హరితవనంలా మారింది. రోసె 2 లక్షల మొక్కలు నాటారు. ఏటేటా సుమారు 12 వేల చెట్లు, పాఠశాలలు, శ్మశాన వాటికలు, చుట్టుపక్కల డంపింగ్‌యార్డులు, నిర్మానుష్యంగానూ, భయానకంగా ఉండే శ్మశాన వాటికల వరకూ వెళ్లి మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు. మంగుళూరు నగరం ఇప్పుడు పచ్చటితోరణంగా ఎటుచూసిన మొక్కలు, చెట్లతో అలరారుతోంది. చెట్లు పెరగటానికి సురక్షితమైన ప్రదేశాలు శ్మశానవాటికలని చెబుతారు రోచె. ‘నేను 20 శ్మశాన వాటికల్లో 8000 మొక్కలను నాటాను. అక్కడ మానవ జోక్యం లేకపోవటంతో అవి సురక్షితంగా ఉంటున్నాయి.’ అని పేర్కొన్నారు. 2020లో ప్రపంచం మొత్తం కరోనాతో అల్లాడుతున్నప్పుడు కూడా రోచె పచ్చనాడి డంప్‌యార్డులో 3000 మొక్కలను నాటారు. రోచెకు పర్యావరణ ఇంజనీర్‌ మధు కూడా సహకరించారు. ఇలా మొక్కలు నాటడంతో గ్రీన్‌ కవర్‌ దుర్వాసన తగ్గటానికి దోహదపడుతుందని వారు అంటున్నారు.

➡️