ప్రకృతి ఒడిలో జంట ప్రయాణం

Apr 21,2024 08:39 #feachers, #Jeevana Stories

వాళ్లిద్దరూ అధ్యాపకులు. ఒకరు వృక్షశాస్త్రం. మరొకరు జంతుశాస్త్రం. ఇద్దరూ కలిస్తే జీవశాస్త్రం. ఇద్దరూ ప్రకృతి ప్రేమికులు. పర్యాటకులు. ఫొటోగ్రాఫర్లు. ఇలా ఆసక్తులూ, అభిరుచులూ ఒక్కటైన దంపతులు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలు చుట్టొచ్చారు. ముఖ్యంగా వైల్డ్‌ ఫొటోగ్రఫీ మీద ఇష్టంతో కెన్యాలోని ప్రసిద్ధ అటవీ ప్రాంతాల్లో తిరిగారు. చాలామంది తమ జీవిత కాలంలో చూడడం తటస్థించని జంతు ప్రపంచాన్ని, వాటి జీవన విధానాన్ని అత్యంత సమీపంలోంచి చూశారు. తమ కెమెరాల్లో భద్రంగా బంధించారు. ఈ అపురూప ఫొటోలతో పుస్తకం ముద్రించి, మన కళ్ల ముందుంచారు.
డాక్టర్‌ సోమంచి శ్రీనివాసరావు.
డాక్టర్‌ కంభంపాటి సీత.

దొరికిన జీవితాన్ని, కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు సీతా శ్రీనివాస్‌ దంపతులు. ఇరువురి అభిరుచులు ఒక్కటే కావడంతో వారి ప్రయాణం నిరంతరాయంగా సాగుతోంది. తమ ఉద్యోగ విరమణ తరువాత విస్తృతంగా పర్యటిస్తూ, తాము చూసిన ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధించి, అనుభవాలను అక్షరీకరించి పత్రికల ద్వారా పాఠకులకు పంచుతున్నారు. భిన్న భౌగోళిక పరిస్థితులు, వాతావరణం, సుందర ప్రదేశాలున్న భారత దేశం నలుమూలలా పర్యటించారు. దాదాపు 20 ఇతర దేశాలూ తిరిగారు. తాము చూసిన ప్రతి అందాన్ని నిశ్చల చిత్రం గానో, వీడియోలోనో బంధించారు.
1970 నుంచి వరంగల్‌ ఫిల్మ్‌ సొసైటీలో అనేక బాధ్యతలు వహించిన శ్రీనివాసరావు, నాటి తరం కెమెరాలతో ప్రయోగాలు చేశారు. తరువాత వచ్చిన ఆధునిక కెమెరాలతోనూ ఎన్నో ఫొటోలు తీశారు. చెట్లలో, కలపలో ఆయన ప్రత్యేక దృష్టి ఎన్నో అద్భుత దృశ్యాలను ఆవిష్కరించింది. ఆయన రూపొందించిన దారుశిల్పాలు ఎందరి అభినందనలతో అందుకున్నాయి. కాక్టస్‌ మొక్కల పెంపకంపైనా ఆయనకు ప్రత్యేకమైన అవగాహన ఉంది. ‘కేక్టో ఫైల్‌’గా కూడా ఆయన ప్రసిద్ధులు. డాక్టర్‌ సీత భర్త శ్రీనివాసరావు నుంచే ఫొటోగ్రఫీ నేర్చుకున్నారు. డిజిటల్‌ కెమరాలు వచ్చాక తాను ఫొటోలు తీయటం సులభం అయిందని ఆమె చెప్పారు. ఫొటోగ్రఫీలోనే కాదు, ఈతలో కూడా ఆమెకు ప్రావీణ్యం ఉంది. తెలంగాణా మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో ఇప్పటికి 27 పతకాలు సాధించారు.
ఈ దంపతులకు వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ అంటే అమితమైన ఇష్టం. ఆ కారణం చేతనే కెన్యాలోని మసైమరా నేషనల్‌ పార్కును ఇప్పటికి మూడు సార్లు సందర్శించారు. 2023 సెప్టెంబరులో మూడోసారి వన్యప్రాణుల మహా వలస సమయంలో అక్కడికి వెళ్లారు. అనేక జంతువులను దగ్గరగా చూశారు. తమ కెమెరాల్లో బంధించారు. వారం రోజుల పాటు ఆ పార్కు మధ్యలోనే ఓల్గా తునీ క్యాంపులో ఉంటూ, ప్రతిరోజూ అడవిలో తిరుగుతూ వన్యప్రాణులను వీక్షించారు. ఆ అనుభవం అత్యంత ఉద్వేగమూ, ఉత్కంఠ కలిగించిందని సీతా శ్రీనివాస్‌ దంపతులు చెప్పారు.


”వన్య ప్రాణులను చూడటానికి ప్రపంచంలో అనేక పార్కులు ఉన్నాయి. గొప్ప వైవిధ్యాన్ని, వందలాది జంతువుల సమూహాలను చూడాలంటే కెన్యాలోని మసైమరా నేషనల్‌ పార్కు గొప్ప ప్రదేశం. ఏడాదికోసారి వాతావరణ పరిస్థితులను అనుసరించి అక్కడి నుంచి జంతువులు టాంజానియా అడవుల్లోకి వలస పోతాయి. ఆ మహా వలస ప్రయాణాన్ని చూడడం ఒక గొప్ప దృశ్యం. ఆ పార్కుకు గతేడాది మూడో పర్యటన గొప్ప అనుభవం. అనేక జంతువులను, వాటి జీవన విధానాన్ని అతి దగ్గరగా చూశాం. వేలాది ఫొటొలూ తీశాం.
జంతు ప్రపంచం చాలా ప్రత్యేకమైనది. వాటి నుంచి మనం చాలా నేర్చుకోవొచ్చు కూడా. సింహాలు బాగా ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే వేటాడతాయి. ఏ కొన్ని సింహాలు వేటాడినా, మొత్తం ఆ గుంపు ఆహారం తినేలా సహకరిస్తాయి. అవి ఆహారాన్ని దాచుకోవు. హైనాలు సొంతంగా వేటాడవు. వేటాడేలా చీతాలను ప్రేరేపిస్తాయి. అవి వేటాడి, తినగా మిగిలిన ఆహారాన్ని తింటాయి. మగ హిప్పోలు తమ మగ సంతానాన్ని చంపటానికి వెనుకాడవు. ఆడ హిప్పోలపై తమ ఆధిపత్యం కొనసాగేలా అవి అలా చేస్తుంటాయి. కానీ, ఆడ హిప్పోలు అందుకు అంగీకరించవు. తమ పిల్లల చుట్టూ రక్షణగా నిలుస్తూ, వాటిని కాపాడుకుంటాయి. ప్రతి జంతువూ తమ పిల్లలకు తొలి దశలో ఆహారం సేకరించి అందిస్తాయి. తరువాత పిల్లలే స్వయంగా వేట సాగించేలా ప్రోత్సాహాన్నిస్తాయి.
కెన్యా అడవుల నుంచి వన్యప్రాణులు వలస వెళ్లటానికి ఒక నదిని దాటాల్సి ఉంటుంది. వేటికవి సొంతంగా దాటిపోవు. గుంపులు గుంపులు వందలాది జంతువులూ వచ్చి, నది ఇవతలే నిలిచిపోతాయి. తొట్టతొలిగా జీబ్రాలే నదిని దాటాలి. ప్రవాహ తీవ్రతను బట్టి అవి నదిని దాటాలో లేదో నిర్ణయించుకుంటాయి. జీబ్రాలు నదిని దాటుతున్నాయి అంటే- ప్రయాణం సురక్షితమని మిగతా జంతువులు గ్రహిస్తాయి. తరువాత వాటిని అనుసరిస్తాయి.
ప్రకృతిలో జంతువులకు, పక్షులకు ఉన్న సహజమైన తెలివిడి అది. ఆహారం కోసం వేటాడ్డం ఉన్నా ఊరకనే వృథాగా వేటాడవు. కొన్ని సందర్భాల్లో వైరి జంతువులు తారసపడ్డా పరస్పరం చంపుకోవు. అవసరానికి మించి దోచుకోవు, దాచుకోవు. ప్రతినిత్యం బతకటానికి ఆశగా సాగుతూనే ఉంటాయి. నిన్నటి విషాదమో, మొన్నటి ఆనందమో వాటిని వెన్నాడదు. సింహం దాడిలో చిక్కిన జింక ఆఖరి క్షణం తనను తాను రక్షించుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆకలి తీరిన క్రూర జంతువు చంపటమే పనిగా ఏ సాధు జంతువునూ బలిగొనదు.


ఈ విషయాలను బోధించే సన్నివేశాలు ఎన్నిటితో మేం కెన్యాలో చూశాం. మా సఫారీ వ్యాన్లను అనేక సార్లు సింహాల గుంపు చుట్టుముట్టడం ఉత్కంఠభరితమైన అనుభవం. వ్యాన్లకు వీపును రాస్తూ, ఎదురుగా వచ్చి నిలబడుతూ, రోడ్డు మీదనే పడుకొని చూస్తూ … అవి చేసిన విన్యాసాలు ఎప్పుడూ గుర్తుండిపోతాయి. ప్రకృతిలోకి ప్రయాణించటం అంటే మనలోకి మనం ప్రవేశించినట్టుగా ఉంటుంది. అనేక ఆదిమ జీవన సత్యాలను అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్టు ఉంటుంది.
మా పర్యటన అనుభవాలను వివరిస్తూ ఇప్పటికే రెండు పుస్తకాలు తెచ్చాం. మసైమరా పర్యటన వివరాలు, ఫొటోలతో ”కాల్‌ ఆఫ్‌ వైల్డ్‌” పేరుతో టేబుల్‌ బుక్‌ తీసుకొచ్చాం. పర్యటన మా ఇష్టమైన హామీ. ఫొటోగ్రఫీ మాకు ప్రియమైన వ్యాపకం. మేం ఆహ్లాదంగా, ఆరోగ్యంగా ఉండటానికి ఈ రెండూ ఎంతో దోమదపడుతున్నాయి.” అని వివరించారు సీతా శ్రీనివాస్‌ దంపతులు. మనిషి జీవితం ఒక్కటే. దానిని నిత్య నూతనంగా మలచుకోవడం మన ఆలోచనలో, ఆచరణలో ఉంటుంది. సీతా శ్రీనివాస్‌ విశ్వ విహంగాలై ప్రకృతిలోకి ప్రయాణిస్తూ తమను తాము తాజా పర్చుకుంటున్నారు. వారు మరిన్ని పర్యటనలతో, అపురూప ఫొటోలతో సాగాలని ఆశిద్దాం.

– డాక్టర్‌ శమంతక మణి

➡️