ఎల్లెడలా ప్రేమైక సౌందర్యం

Feb 14,2024 11:30 #feature

ప్రేమంటే.. ఓ మధురానుభూతి. పసిపిల్లల నవ్వంత స్వచ్ఛమైనది. గులాబీ రేకంత మృదువైనది. సెలయేరు వంపుల సొగసైనది. బిడ్డను లాలించే తల్లి ఎల్లలు లేని ప్రేమైకమూర్తిని ప్రతిబింబిస్తుంది. భార్యాభర్తల అన్యోన్యతలో గొప్ప ప్రేమ సామ్రాజ్యమే సందడి చేస్తుంది. ప్రేయసీ ప్రియుల ప్రేమలో అద్భుత సౌందర్యం తాండవిస్తుంది. ప్రేమని ఎన్ని వర్ణాలుగా వర్ణించగలం? ఇన్నని కొలమానం లేని తత్వం ప్రేమతత్వం.

కాలాలు మారినా, తరాలు మారుతున్నా మారనిది ప్రేమ భావన. సామ్రాజ్యాలు అంతరించినా, రాణీవాసాలు కనుమరుగైనా శాశ్వతంగా నిలిచిపోయింది ప్రేమే. ప్రేమ లేని ప్రపంచమే ఉండదు. మానవత్వం, దయాగుణం, సేవాతత్పరత.. పేరేదైనా.. ప్రేమే అన్నింటికీ మూలం. మనిషి సంఘజీవి. సమాజం మనకు ఎన్నో నేర్పిస్తుంది. కష్టసుఖాలను పరిచయం చేస్తుంది. గెలుపు ఓటములను అనుభవించమంటుంది. లాభనష్టాలను చవిచూపిస్తుంది. ఎక్కడా తొణకకుండా, బెణకకుండా, తడబడకుండా నిలబడాలంటే, మన మీద మనకుండే నమ్మకమనే ప్రేమే ఏకైక సాధనమని తెలియజేస్తుంది.

ప్రేమ నిండిన హృదయంతో ఆలోచిస్తే.. నిండైన ఆత్మవిశ్వాసం తోడవుతుంది. తద్వారా ఏ క్లిష్ట సమస్య అయినా ఎదుర్కొనే సామర్థ్యం వస్తుంది. ప్రేమ భావన యువతీ యువకులకే పరిమితమైంది కాదు. అమ్మ ఒడి నుండే ప్రేమ పాఠాలు మొదలవుతాయి. అలిగితే బుజ్జగించడం, కోపం వస్తే నవ్వించడం, చిరాకు పడితే సముదాయించడం, దు:ఖం వస్తే ఓదార్చడం, సంతోషపడితే భుజం తట్టడం … ఇవన్నీ ప్రేమను ప్రేమగా వ్యక్తీకరించే రూపాలే! బలవంతంతో ప్రేమ ఉద్భవించదు. అది స్వార్థానికి ప్రతీక అవుతుంది. అవకాశవాదం ప్రేమ కాదు. ఆశావాదం ప్రేమ. ప్రేమ నిండిన హృదయాలన్నీ ప్రేమనే పంచుతాయి. రాగద్వేషాలకు అతీతమైన ప్రేమ అందరిలో దాగుంది. ప్రేమించడం, ప్రేమించబడడం ప్రేమ కాదు. ప్రేమతో మసలుకోవడమే ప్రేమ. వాంఛ కలగడం ప్రేమ కాదు. వంచన లేకుండా మసలుకోవడం ప్రేమ. ఆస్తులు, అంతస్తులతో పని లేకుండా, కులమతాల భేదం చూపకుండా సమ భావంతో మసలుకోవడమే ప్రేమ గుణం. ధనిక, బీద తారతమ్యాలు పట్టించుకోకుండా స్నేహంతో మెలగడమే ప్రేమ తత్వం. మనిషిని మనిషిగా గుర్తించడం ప్రేమ లక్షణం.

అందం, ఐశ్వర్యం, హంగు, ఆర్భాటంలో ప్రేమ కనబడదు. ఆప్యాయతలో నిండిపోయేదే ప్రేమ. మనసు గాయాలను మెలిపెట్టేది ప్రేమ అనిపించుకోదు. గాయపడిన మనసుకు సాంత్వన ఇవ్వడమే నిజమైన ప్రేమ.

అమ్మానాన్న, అక్కాచెల్లి, అన్నాతమ్ముడు, ఆలుమగలు అందరిలోనూ ప్రేమే. ప్రియురాలి చిరునవ్వులోనే ప్రియుడి ప్రేమ దాగుంటుంది. ఎదుగుతున్న బుజ్జాయిని చూసి మురిసిపోయే తల్లిలో ప్రేమ కనపడుతుంది. వృద్ధిలోకొచ్చిన బిడ్డలను చూసి ఆనందించే ప్రతి అమ్మానాన్నలో ఉప్పొంగిన ప్రేమే కనిపిస్తుంది. విద్యార్థుల ఉన్నతికి గర్వపడే ఉపాధ్యాయుడిలో నిండైన ప్రేమ దాగుంటుంది.

బహుమతులతో ప్రేమ పొందడం కష్టసాధ్యం. భరోసా ఇవ్వడంతోనే ప్రేమను సాధించగలం. ప్రేమంటే అనుభూతి చెందడం. సాటి వారికి తోడు నిలవాలనే తపన ప్రేమ నుంచే పుడుతుంది. లేని వారికి పంచిపెట్టాలనే ఆలోచన ప్రేమతోనే సాధ్యపడుతుంది. ధనం పోగేసుకోవడం, ఆస్తులు సంపాదించుకోవడం కోసం చేస్తున్న పరుగులో నిజమైన ప్రేమను దాచేస్తున్నాం. చుట్టుపక్కల వారిని ఆప్యాయంగా పలకరించడం మానేస్తున్నాం. బంధుమిత్రులతో బంధాలను కొనసాగించలేకపోతున్నాం.

ప్రేమకు ఎన్ని వేల భాష్యాలో.. కవుల సృజనలో వెల్లువెత్తిన ప్రేమ సముద్రమంత విస్తారమైనది. రచనల్లో విరబూసిన ప్రేమ విశ్వమంత విశాలమైనది. కరుణ నిండిన ప్రేమ మూర్తులు ఈ జగతినంతా ప్రేమైక సౌందర్యంతో ముంచెత్తారు. భవిష్యత్తు లక్ష్యాలను ప్రేమించడం మొదలుపెడితేనే విజయం దగ్గరవుతుంది. అసాధ్యాలను సుసాధ్యాలు చేసే శక్తి ప్రేమకే ఉంది. ప్రేమతో మసలుకోండి.. ప్రేమతో మెలగండి.

➡️