జింక ఉపాయం పారిందోచ్‌ !

Jan 8,2024 10:39 #Jeevana Stories

ఒక దట్టమైన అడవిలో సింహం ఉండేది. అది మంచి చెడుల విచక్షణ లేకుండా కంట పడిన జంతువులను వేటాడి తినేది. దీంతో అడవిలోని జంతువులు దిన దిన గండంగా బతుకుతున్నాయి. ఆ సింహానికి నాట్యం అంటే విపరీతమైన ఇష్టం. ఒకరోజు ఆకలితో ఉండి వేటకోసం ఎదురు చూస్తున్న సింహానికి రెండు కోతులు కనిపించాయి. ‘భలే! రెండు పూటలకు సరిపడా ఆహారం’ అనుకుని వాటి మీదకు పంజా విసరబోయింది. తృటిలో తప్పించుకున్న రెండు కోతులు ‘మగరాజా! మీ కోసమే నాట్యం నేర్చుకుని వచ్చాం. మీకు రోజూ చక్కటి వినోదం కలిగిస్తాం’ అంటూ నాట్యం ఆరంభించాయి.

మృగరాజు ఆకలి మరచిపోయి వాటి నాట్యం చూసింది. కాసేపటి తరువాత నాట్యం ఆపిన కోతులు రేపు మళ్ళీ వస్తామంటూ అక్కడ నుండి సెలవు తీసుకున్నాయి. ఈ విషయం తెలిసిన మిగిలిన జంతువులు కోతుల సమయస్ఫూర్తికి అభినందించాయి.

సింహానికి ఉన్న బలహీనతను ఆధారం చేసుకుని దాన్ని మట్టుపెట్టడం ఎలా అని జంతువులన్నీ కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించుకున్నాయి.

తెలివైన జింక బాగా ఆలోచించి ఒక ఉపాయం చెప్పింది. ఆ ప్రణాళిక కోతుల ద్వారా అమలుచేయాలని నిర్ణయించుకున్నాయి. కోతులు సింహంతో ‘రాజా! మీకు వినోదం కలిగించడానికి మడుగు దగ్గర నాట్యసభ ఏర్పాటు చేస్తున్నాము. నాట్యం చేయలేక ఆపిన జంతువుని అక్కడికక్కడే మీరు ఆరగించవచ్చు’ అని చెప్పాయి. ‘కోరి నాకు ఆహారంగా మారడానికి మీరంతా తరలి వస్తున్నారా?’ అని సింహం పెద్దగా నవ్వి ‘సరే’ అంది.ఒక పెద్ద చెట్టు కింద మడుగు చుట్టూ జంతువులన్నీ వృత్తాకారంలో నిలబడి నాట్యం చేస్తున్నాయి. సింహం చెట్టు కింద నిలబడి ఆనందంగా నాట్యం ఎవరు ఆపుతారా అని చూస్తోంది. ఉన్నట్లుండి దాని దృష్టి మడుగు మీద పడింది. అక్కడ ఒక కోతి కదలకుండా నిలబడి కనిపించింది. అంతే! ఆలోచించకుండా మడుగులోకి దూకింది. అది లోతైనది కావడంతో అందులో కూరుకుపోయింది.

హామ్మయ్యా! పాచిక పారిందనుకుంటూ చెట్టు మీద నుండి ఓ కోతి కిందకు దిగింది. తెలివిగా తన నీడను నీటిలో కనిపించేలా నిలబడి సింహాన్ని దానికదే మడుగులో పడేలా ప్రణాళిక చేసినందుకు జింకను జంతువులన్నీ మెచ్చుకున్నాయి. సింహం పీడా వడిలినందుకు ఆనందంగా పండగ చేసుకున్నాయి.

కె.వి.సుమలత,కృష్ణ జిల్లా,94926 56255.

➡️