కూలి పనులు చేసిన చోటే స్కూలు నిర్వహిస్తున్నాడు..

Apr 22,2024 08:06 #feachers, #Jeevana Stories, #school

‘కలలు కనే ధైర్యం చేయండి’, ‘మూలాలు మర్చిపోవద్ద’న్న స్ఫూర్తివంత మాటలు చాలామంది వినే వుంటారు. అయితే ఆచరణలో పెట్టేది కొందరే. ఒరిస్సాకు చెందిన డాక్టర్‌ ప్రదీప్‌ సేథీ మాత్రం ఆ మాటలను అక్షర సత్యాలు చేసి చూపించారు. పేదరిక కుటుంబంలో పుట్టిన అతను డాక్టరు కావాలన్న పెద్ద కల కన్నాడు. అది నెరవేరిన తరువాత తన దారి తాను చూసుకోలేదు. పేదరికం తన చదువుకోసం ఎన్ని ఆటంకాలు సృష్టించిందో ఆ పరిస్థితులు తన ఊరి పిల్లలకు రాకూడదని కంకణం కట్టుకున్నారు. ఫలితంగా ప్రాథమిక విద్యా సౌకర్యాలు కూడా అంతంత మాత్రం లభించే ఆ గ్రామంలో అంతర్జాతీయ స్థాయి పాఠశాలను నెలకొల్పి పేదపిల్లలకు ఉచితంగా విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ఎంతోమందికి ఆదర్శవంతంగా నిలుస్తున్న సేథీ ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్న సేథీ, ఒరిస్సాలోని బెరునపాడి గ్రామంలో పుట్టారు. ఉన్నత చదువులు చదవాలని బాల్యం నుండే కలలుకన్నారు. కానీ పాఠశాల విద్యను కూడా సక్రమంగా పూర్తిచేయలేని పరిస్థితులు కుటుంబంలో ఉండేవి. తండ్రికి తోడుగా స్కూలుకు వెళ్లకుండా కూలి పనులకు వెళ్లిన సందర్భాలు సేథీ జీవితంలో అనేకం ఉన్నాయి. ఎంబిబిఎస్‌ ఫీజు కట్టేందుకు వ్యవసాయ కూలీగా పొలం పనులు కూడా చేశారు. ఇన్ని ప్రతికూలతల మధ్య, తన చదువు సక్రమంగా సాగిందంటే దాతలు చేసిన సాయమే అని ఆయన చాలా సందర్భాల్లో గుర్తుచేసుకుంటారు. ‘నేను పుట్టి పెరిగిన గ్రామం, జిల్లా అంతగా అభివృద్ధి చెందినవి కాదు. మేము, రెండు పూటలా తిండి తిన్న రోజులు చాలా తక్కువ. ఒక్క జత బట్టలే వారం రోజులు వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పని ఉన్నప్పుడు నాన్నకు తోడుగా స్కూలుకు వెళ్లకుండా ఉండేవాడ్ని. అయితే ఇలా ఎంతకాలం? జీవితమంతా పశువులకు మేత వేస్తూ, పొలంలో గడ్డి కోస్తూ ఉండాల్సిందేనా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఈ పరిస్థితుల నుండి నన్ను బయటపడవేసేది చదువు మాత్రమే అని బలంగా నమ్మాను’ అంటూ గతాన్ని గుర్తుచేసుకున్న సేథీ, 12 ఏళ్లు వచ్చాకే స్కూలుకు వెళ్లడం ప్రారంభిం చారు.


‘ఆ స్కూల్లో నాకు నాణ్యమైన విద్య లభించింది. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కలలు కన్నాను. ఆ తరువాత డాక్టరు కావాలని ఆశపడ్డాను. నా వైద్య విద్య కోసం నాన్న మా ఇంటిని అమ్మేశాడు. ఫీజు చెల్లించేందుకు నేను కూడా రోజు కూలీగా వెళ్లాను. బాల్యంలో నాకు ఎదురైన కష్టాలు, నాలో ధైర్యాన్ని నింపాయి. కాలం ఎంత కష్టంగా గడిచింది అంటే, నెలకు రూ.1300 వచ్చే స్కాలర్‌షిప్పు డబ్బులతోనే పుస్తకాలు, మెస్‌ ఛార్జీలు కట్టేవాడ్ని’ అంటున్న సేథీకి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అలా ఆయన చదివిన ‘ఓ యోగి ఆత్మ కథ’ పుస్తకం, సేథీ జీవన పంథాను మార్చేసిందని, ‘చిన్న చిన్న పనులతోనే అద్భుతాలు సాధించవచ్చ’న్న స్ఫూర్తివంత మాటలు నన్ను బాగా ప్రభావం చేశాయ’ని సేథీ, గతాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకున్నారు.
‘2004లో ఎంబిబిఎస్‌ పూర్తి చేస,ఎయిమ్స్‌ కళాశాలలో ఎండి చేయాలని దరఖాస్తు చేసుకున్నాను. 2008 నాటికి వైద్యుడిగా స్థిరపడ్డాను. చదువంటే అమితాసక్తి గల నేను దాతల సాయంతోనే ఇంత ఉన్నతస్థానానికి చేరుకున్నాను. దుబారులో ఓ క్లినిక్‌, స్టెమ్‌ సెల్‌ ప్రాజెక్టు ప్రారంభించేంతగా ఎదిగాను. కానీ నా ఊరు, అక్కడి పిల్లలు నా గమ్యాన్ని మరో పంథాలోకి తీసుకెళ్లారు’ అంటూ తన స్కూలు ప్రారంభ రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు.

 

‘ఉత్కల్‌ గౌరవ్‌’కి ఇలా బీజం పడింది..
2016లో గ్రామంలో ‘ఉత్కల్‌ గౌరవ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌’ ప్రారంభించారు సేథీ. ‘నా చదువు కోసం ఉన్న ఒక్క ఇంటిని నాన్న అమ్మేశాడు. తను చనిపోయేలోగా ఎలాగైనా గ్రామంలోనే ఓ సొంత ఇంటిని నిర్మించుకోవాలని ఆయన కలకన్నాడు. ఆయన కల నెరవేర్చేందుకు ఇంటి నిర్మాణం ప్రారంభించాను. అయితే ఇల్లు పూర్తయిన కొంతకాలానికే ఉదర క్యాన్సర్‌తో నాన్న చనిపోయాడు. విశాలమైన ప్రాంగణంతో నిర్మించిన ఆ ఇల్లు కొంతకాలం పాటు నిరుపయోగంగా ఉండిపోయింది’ అంటున్న సేథీ, ఆ సమయంలోనే ఓ ఆలోచన చేశారు. గ్రామంలోని విద్యార్థులకు ఆంగ్లం, గణితం నేర్పేందుకు ఆ ఇంట్లో ఓ కోచింగ్‌ సెంటర్‌ని ప్రారంభించారు. వాలంటీర్లను నియమించి నాణ్యమైన విద్యనందించారు. దూర ప్రాంతాల విద్యార్థులకు అనువుగా వసతి కూడా కల్పించారు. 2016 నుండి 2023 వచ్చేసరికి కోచింగ్‌ సెంటర్‌లో 300 మంది విద్యార్థుల వరకు చేరారు. వందలాది మందిలో విద్యాచైతన్యం తీసుకొచ్చిన సేథీకి స్కూలు నిర్మిస్తే వేలాదిమంది బతుకులు బాగుచేయొచ్చన్న ఆలోచన కలిగింది. అలా ఉత్కల్‌ గౌరవ్‌కి బీజం పడింది.
‘అవకాశమే వ్యక్తికి, వ్యక్తికి మధ్య అంతరాన్ని పెంచుతుంద’ని బలంగా నమ్ముతాను. నేను కూడా అలా అందివచ్చిన అవకాశాలతోనే పైకి ఎదిగాను. ఇప్పుడు ఆ అవకాశం గ్రామాల్లోని పిల్లలకు అందివ్వాలనుకున్నాను’ అంటున్న సేథీ స్కూల్లో ప్రస్తుతం 450 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. భవిష్యత్తులో 2000 మందికి విద్యనందించాలని సేథీ కలకంటున్నారు. విద్యతో పాటు విద్యార్థుల అభిరుచులకు తగ్గట్టుగా వివిధ కళల్లో వారిని నిష్ణాతులుగా చేయాలని కూడా సేథీ సంకల్పించుకున్నారు. వ్యవసాయ పాఠాలు కూడా ఈ స్కూల్లో నేర్పిస్తున్నారు. అధునాతన వసతులతో అంతర్జాతీయ స్థాయిలో ఉచితంగా విద్యనందించడం అంత ఆషామాషీ కాదు. కానీ సేథీ అది సాధ్యం చేసి చూపిస్తున్నారు. ఇక్కడ మనం ఒక విషయం గురించి తప్పక తెలుసుకోవాలి. స్కూలు నిర్వహిస్తున్న స్థలంలోనే ఒకప్పుడు సేథీ రోజు కూలీగా వ్యవసాయ పనులు చేశారు.

➡️