వేసవిలో చర్మ సంరక్షణ ఇలా..

మే నెల ప్రారంభమైంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో విపరీతమైన వేడి గాలులు, ఎండ తీవ్రత పెరిగిపోయాయి. ఈ క్రమంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ సీజన్‌లో స్కిన్‌ ఇన్‌ఫెక్షన్‌ ముప్పు కూడా పెరుగుతుంది. చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద, మంట, చర్మం నల్లబడటం వంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటారు. ఈ సమస్యలన్నింటి నుండి రక్షణ పొండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

వేసవిలో చర్మ కాంతి తగ్గిపోతుంది. సూర్యరశ్మి, దుమ్ము, అలర్జీ వల్ల చర్మ వ్యాధులు రావచ్చు. కొందరికి శరీరంపై ఎర్రటి దద్దుర్ల సమస్య కూడా పెరుగుతుంది. ఇది ఎక్కువగా వీపు వెనుక, ముఖం, చేతులపై కూడా కనిపిస్తుంది. ఈ రకమైన సమస్యను ఎదుర్కొంటున్నట్లైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. తీవ్రమైన ఎండలో ఎక్కువసేపు ఉండటం వల్ల చర్మం దెబ్బతిని ఇలాంటి సమస్యలు వస్తాయి.
ఎండలో బయటకు వెళ్లేటప్పుడు ముఖాన్ని, శరీరాన్ని కప్పి ఉంచాలి. బయటికి వెళ్లడానికి 15 నిమిషాల ముందు సన్‌స్క్రీన్‌ని అప్లై చేసుకోవాలి. వీలైతే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లడం మానుకోవాలి. బయటకు వెళ్లడం తప్పనిసరి అయితే పదే పదే నీరు తాగుతూ ఉండాలి. అలాగే సీజనల్‌ పండ్లను తినాలి. వాటర్‌ కంటెంట్‌ ఉన్న పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.
ఈ సీజన్‌లో చర్మంపై ఎలాంటి మచ్చలు కనిపించినా.. అకస్మాత్తుగా వీపుపై దద్దుర్లు కనిపించినా.. వెంటనే వైద్యులను సంప్రదించాలి. సకాలంలో చికిత్స చేస్తే చర్మవ్యాధులు తీవ్రతరం కాకుండా నివారించవచ్చు.

➡️