వేసవిలో కురుల సంరక్షణ ఇలా …

Apr 24,2024 04:30 #jeevana

వేసవిలో ఆరోగ్యం, చర్మ సంరక్షణ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో జుట్టు సంరక్షణకూ అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ వేడికి వెంట్రుకలు నిర్జీవంగా తయారవుతాయి. సూర్యరశ్మిలోని అల్ట్రావైలెట్‌ కిరణాల వల్ల జుట్టు పొడిబారి, చివర్లు చిట్లి పోతాయి. వేసవిలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
– ఎండలో బయటకు వెళ్లేటప్పుడు జుట్టుకు, మాడుకు కొబ్బరి నూనె రాసుకోవాలి. లేదా జుట్టుకోసం ప్రత్యేకంగా సన్‌స్క్రీన్‌ కండీషనర్లు మార్కెట్లో ఉంటాయి. లోషన్‌ రాసుకుంటే ఇంటికి రాగానే లేదా రాత్రి పడుకోబోయే ముందు తలస్నానం చేయాలి.
– తలస్నానం తరువాత కండీషనర్‌ వాడకాన్ని అలవాటు చేసుకుంటే మంచిది. తలస్నానానికి చివరగా నిమ్మరసం కలిపిన నీటితో జట్టును తడపడం వల్ల జట్టు దృఢంగా మారుతుంది. అయితే పొడి జుట్టు ఉన్నవారు నిమ్మరసానికి బదులుగా కాఫీ డికాషన్‌ లాంటి కండీషనర్లను వాడాలి. షాంపూ చేసిన ప్రతిసారీ కండీషనర్‌ చేయడం వల్ల జుట్టు తేమను కోల్పోకుండా, ఒత్తుగా ఉంటుంది.
– మూడు కప్పుల మంచినీటిలో రెండు కప్పుల ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ కలిపి, తలస్నానం పూర్తయ్యాక జుట్టుకు పట్టించాలి. చుండ్రు సమస్య ఉంటే ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకూ బాగా పట్టించాలి.
– వేసవిలో కొందరు స్విమ్మింగ్‌ పూల్స్‌కు వెళ్లడం పరిపాటి. స్విమ్మింగ్‌ పూల్‌ నీటిలో క్లోరిన్‌ కలుపుతారు. ఉప్పు నీరూ ఉండవచ్చు. కాబట్టి స్విమ్మింగ్‌ క్యాప్‌ తప్పనిసరిగా ధరించాలి. లేదా పూల్‌లో దిగడానికి ముందే తలను మంచినీటితో తడుపుకోవాలి. జట్టు తగినంత నీరు పీల్చుకున్న తరువాత ఉప్పు నీటిని లేదా క్లోరిన్‌ నీటిని పీల్చుకోదు. స్విమ్మింగ్‌ తరువాత శుభ్రంగా తలస్నానం చేయాలి.
– వేసవిలో రసాయనాలు ఎక్కువగా ఉన్న షాంపూలు, హెయిర్‌ డ్రయ్యర్‌, హెయిర్‌ స్ప్రేలు వాడకపోవడం మంచిది.
– చెమట వల్ల చుండ్రు సమస్య అధికమవుతుంది. కొబ్బరి నూనెను లేదా, ఇతర హెయిర్‌ ఆయిల్‌ను గోరువెచ్చగా జుట్టుకు పట్టించి, మర్దనా చేసి టవల్‌ను గట్టిగా చుట్టాలి. తర్వాత షాంపూ చేయాలి. చెమట నుంచి జుట్టును రక్షించేందుకు రెండు రోజులకొకసారి షాంపూతో తలస్నానం చేయాలి.
– కొబ్బరి నీళ్లు, పళ్ల రసాలు, సలాడ్లను తరచూ తీసుకుంటుండాలి. ఇవి చర్మం, జుట్టు పొడిబారకుండా నిగారింపు సంతరించుకునేలా చేస్తాయి. శరీరంలోని మలినాలు చెమట రూపంలో బయటకు పోతాయి కాబట్టి ఎక్కువ నీరు తీసుకోవడం చాలా మంచిది.

➡️