టిడిపి కొంపముంచనున్న బిజెపి ప్రకటనలు

Apr 28,2024 01:17 #amaravathi

– ముస్లిం రిజర్వేషన్లపై విచిత్ర వైఖరి
-ఖండించని టిడిపి, జనసేన
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి, బిజెపి నాయకులు పియూష్‌ గోయల్‌ విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. అసలు అవి రిజర్వేషన్లు కావనే విధంగా ప్రకటించారు. దీంతో బిజెపితో పొత్తుపెట్టుకుని ఎన్నికల్లోకి వెళ్లిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది.
మతోన్మాద ఎజెండాను ముందుకు తీసుకెళుతున్న బిజెపి దానిలో భాగంగానే రాష్ట్రంలో ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు వీలుగా రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తెచ్చింది. ఇతర కులాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిందనే విమర్శలూ ఉన్నాయి. కేంద్రమంత్రి ప్రకటనతో రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనార్టీలలో తీవ్ర ఆందోళన మొదలైంది. దీనికితోడు ముస్లిములు అధికంగా ఉన్న ఒకటీ రెండు నియోజకవర్గాల్లో నేరుగా బిజెపి నేతలు రంగంలోకి దిగారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఏజెన్సీలోనూ ఎంపి అభ్యర్థిగా బిజెపి నాయకులను దింపారు. ఈ నేపథ్యంలో ముస్లింలు, గిరిజనుల్లో తీవ్ర అభద్రతా భావం ఏర్పడింది. అలాగే సిఎఎ అమలుపై ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. అతేకాదు, తాము తిరిగి కేంద్రంలో అధికారంలోకొస్తే సిఎఎను అమలు చేసి తీరతామని అమిత్‌షా వంటి వారు కుండబద్దలు కొడుతున్నారు. ఇది టిడిపి, జనసేన పార్టీలకు మైనార్టీల ఓటర్లను దూరం చేయనుందనే అభిప్రాయం టిడిపి సీనియర్‌ నేతల్లో వ్యక్తమవుతోంది. బిజెపి ప్రకటనల వల్ల మైనార్టీల నుండి రావాల్సిన ఓట్లు రావని కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాయకుల్లోనే ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది.
చాలా సీట్లపై ప్రభావం
రాష్ట్రంలో విజయవాడ పశ్చిమ, గుంటూరు ఈస్ట్‌, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్‌, కర్నూలు, కడప, అనంతపురం అర్బన్‌, నంద్యాల, ఆదోని, మదనపల్లి, ప్రొద్దుటూరు, చిత్తూరు, తెనాలి, పొన్నూరు, మచిలీపట్నం, ఒంగోలు, హిందూపురం, గుంతకల్లు, కదిరి, రాయచోటి, నరసరావుపేట, కావలి, చిలకలూరిపేట, ధర్మవరం, ఆళ్లగడ్డ, బనగానపల్లి, ఆత్మకూరు, నందికొట్కూరు, శ్రీశైలం నియోజకవర్గాల్లో ముస్లిములు పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు.
చాలా నియోజకవర్గాల్లో కనీసం 20 వేలకు పైబడి ముస్లిం ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం 36,17,713 మంది ముస్లిములు ఉన్నారు. ఇప్పుడు వారంతా బిజెపి విద్వేష ప్రకటనలతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మాట నెగ్గించుకునే ప్రయత్నం
బిజెపి నాయకులు ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించడం వెనుక పెద్ద ఎత్తున పార్టీ పథక రచన ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకూ బిజెపి నాయకులు చెబితే పట్టించుకునేవారు లేరు. ఇప్పుడు టిడిపి నాయకులు కూడా కచ్చితంగా వారేమి చెబుతున్నారో వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నికల తర్వాత ఒకవేళ తమ ఫ్రభుత్వం ఏర్పడితే తాము చేసిన ముస్లిం రిజర్వేషన్ల వ్యతిరేక ప్రకటన అంశమే తమకు ఓట్లు తెచ్చిపెట్టిందని ప్రచారం చేసుకుని మతోన్మాద భావజాలాన్ని మరింత విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లేందుకు తమకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే బిజెపి నాయకులు రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

➡️