అప్పుడలా…ఇప్పుడిలా…

May 12,2024 00:05 #guntur

-టిడిపి ప్రచార ఆస్త్రంగా ‘ల్యాండ్‌ టైట్లింగ్‌’

– 2019లో వైసిపి ప్రచార అస్త్రంగా డేటా చౌర్యం
-2024లో దస్తావేజుల జిరాక్స్‌ కాపీల అంశంతో తిప్పికొట్టిన చంద్రబాబు

-ఎన్‌డిఏ ప్రభుత్వానికి జగన్‌ జి హుజూర్‌ అన్నందుకు ఫలితం

ప్రజాశక్తి గుంటూరు జిల్లా ప్రతినిధి :సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కోసారి ఒక్కొ వివాదాస్పదమైన అంశం తెరపైకి వస్తోంది. ఈ అంశాలే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుంటాయి. రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వంపై అప్పటి ప్రతిపక్ష పార్టీ వైసిపి డేటా చౌర్యం అంశాన్ని తెర పైకి తెచ్చింది. తెలుగుదేశం. మళ్లీ అధికారంలోకి వస్తే మీ బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తాన్ని ప్రభుత్వం ఎప్పుడైనా లాగేసుకుంటుందని, ప్రజల ఆధార్‌ డేటా మొత్తం కొంతమంది ప్రయివేటు వ్యక్తులకి అప్పజెప్పారని, మొత్తం తస్కరణకు గురైందని వైసిపి అప్పట్లో తీవ్ర దుమారాన్నే లేపింది. ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా మార్చుకుంది. ప్రజల్లో భయాన్ని సృష్టించింది. బ్యాంకుల్లో ఎవరు ఖాతాలో ఎంత ఉన్నాయో తెలిసిపోతుందని ఎవరైనా సొమ్ములు లాగేసుకోవచ్చని భయపెడుతూ ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని వైసిపి ఊరూవాడా ప్రచారం చేసింది. అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌ రెడ్డి స్వయంగా ఇదే అంశాలను చెప్పటంతో భయం పెరిగి అప్పటి టిడిపి ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీసింది. అయితే ఈసారి ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని ప్రధాన అస్త్రంగా ఎంచుకుంది. ఈయాక్ట్‌ ద్వారా ప్రజల భూములను సిఎం జగన్‌, వైసిపి నాయకులు కాజేస్తారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పెద్దఎత్తున ప్రచారాన్ని చేశారు. టిడిపి అభ్యర్థులు కూడా ఇదే అంశాన్ని విస్తృతంగా ఉపయోగించారు. మీ భూములకు సంబంధించిన పాస్‌ పుస్తకంపై సిఎం జగన్‌ ఫోటో ఎందుకు? గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా పాస్‌ పుస్తకాలపై తన ఫోటో వేసుకున్నారా? సర్వే పేరుతో పొలాల్లో హద్దు రాళ్లపై సిఎం జగన్‌ ఫోటోలు వేసుకున్నారని మీ పొలంలో సిఎం ఫోటోలు ఎందుకు భవిష్యత్తులో మీ భూమి మీది కాదు.నాది అంటే ఏం చేస్తారు అని భయపెడుతున్నారు. అంతేగాక ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టుకు, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సంబంధం లేకపోయినా ఆస్తుల రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే ఇక మీదట ఒరిజినల్‌ దస్తావేజులు ఇవ్వరని, జిరాక్సులు మాత్రమే ఇస్తారట..ఓరిజినల్‌ దస్తావేజులు ప్రైవేటు ఏజెన్సీ వద్ద ఉంచి ప్రభుత్వం తాకట్టు పెట్టుకుని రుణం తెచ్చుకుంటే మీరేం చేస్తారు? మీరు ఒరిజినల్‌ దస్తావేజులు లేకుండా రుణం ఎలా పొందుతారు? క్రయ విక్రయాలు ఎలాచేస్తారని ప్రజలను టిడిపి తీవ్ర స్థాయిలో భయపెట్టింది. దీంతో ఇప్పటి వరకు వైసిపికి కొంత సానుకూలంగా ఉన్న గ్రామీణ వాసుల్లో తమ ఆస్తులకు రక్షణ లేదంటూ భయాందోళనకు గురయ్యారు. దీంతో గ్రామాల్లో వైసిపి నాయకులను ప్రజలు నిలదీసిన ఉదంతాలు కూడా కొనసాగాయి. మా పాసు పుస్తకాలపై సిఎం ఫొటో ఎందుకు అని పులివెందులలో జగన్‌ సతీమణి వైఎస్‌ భారతిని వైసిపికి చెందిన భాస్కరరెడ్డి అనే రైతు నిలదీసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. గత ఆరు నెలలుగా ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టుపై రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళన చేస్తున్నా సిఎం జగన్‌ ఎప్పుడూ స్పందించలేదు. తగిన వివరణ ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో టిడిపి, జనసేన నాయకులు ఇదే అంశాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా మార్చుకోవడంతో కంగారు పడిన వైసిపినాయకులు సిఎం జగన్‌పై ఒత్తిడి తెచ్చి గత వారం రోజుల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఈ చట్టం వల్ల ప్రజలకు నష్టం ఉండదని, శాశ్వత భూ హక్కు కల్పించే ప్రక్రియ కొనసాగుతోందని వివరణ ఇచ్చారు. పలువురు మంత్రులతోపాటు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం నీతి ఆయోగ్‌ సూచనల మేరకు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చట్టం తెచ్చామని వివరణ ఇచ్చారు. గత ఐదేళ్ల కాలంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా ఇతర రాష్ట్రాలు అమలు చేయకపోయినా ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రం చాలా వేగంగా ప్రజలను, ప్రజా ప్రతినిధులను, మేథావులను, సంబంధిత శాఖలను సంప్రదించకుండా ఎటువంటి చర్చ లేకుండా ఇలాంటి చట్టాలను వైసిపి ప్రభుత్వం ఏకపక్షంగా ప్రజలపై బలవంతంగా రుద్దింది. ప్రధానంగా 2011లోఉన్న కౌలు రైతు చట్టం స్థానంలో 2019 కౌలు రైతు చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం వల్ల భూ యజమాని అనుమతిలేకుండా కౌలు రైతులకు కనీసం గుర్తింపు కార్డు, బ్యాంకు రుణం, ఇతర సదుపాయాలు దక్కని పరిస్థితి నెలకొంది. రైతు సంఘాలు ఎన్ని సార్లు మొత్తుకున్నా వైసిపి ప్రభుత్వం భూ యజమాని అనుమతి నిబంధన తొలగించలేదు. నూతన విద్యా విధానం (ఎన్‌ఈపి) అమలుకు చేసిన చట్టం, పాఠశాల విద్యావ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చడం, వీలీనం పేరుతో పాఠశాలల ఎత్తివేత, ఐదేళ్లుగా ఉపాధ్యాయుల నియామకం చేయకపోవడంతో ప్రభుత్వ స్థాయిలో ప్రాథమిక, సెకండరీ విద్యా వ్యవస్థ దారుణంగా దెబ్బతినే పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్‌ సంస్కరణ బిల్లుకు అనుగుణంగా రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు స్మార్టు మీటర్ల బిగింపు నిర్ణయం అమలుతో ఉచిత విద్యుత్‌ విధానం ప్రశ్నార్ధకంగా మారింది. ఇలాంటి చట్టాల ద్వారా కేంద్రం చెప్పిన ప్రతి అంశానికి తలూపి ఏ రాష్ట్రంలో లేని విధంగా నూతన చట్టాలను అమలుకు పూనుకున్నారు. ఇందులో భాగంగానే ల్యాండ్‌ టైట్లింగ్‌ సర్వే ద్వారా కాంట్రాక్టు సేద్యానికి సానుకూలత పెంచేలా కార్పొరేట్‌ రంగాలకు మేలు చేసేలా చట్టం రూపకల్పన చేశారని విమర్శలు కూడా వచ్చాయి. ఈ చట్టానికి అసెంబ్లీలో మద్ధతు ఇచ్చినా చట్టంలో లొసుగులను టిడిపి ఎన్నికలలో ప్రచార అస్త్రాలుగా మార్చుకుని వైసిపికి ప్రజల్లో వ్యతిరేకత కల్పించడంలో ఇప్పటికే దాదాపుగా సఫలీకృతం అయ్యిందనే వాదన విన్పిస్తోంది. ఇదే అంశాన్ని వైసిపి నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. చట్టంలోని లొసుగులను చంద్రబాబుకు అనుకూలంగా ఉండే ఐఎఎస్‌లు ఉప్పందించారని దీన్ని మంచి అవకాశంగా తీసుకుందని సీనియర్‌ వైసిపి నాయకులు వాపోతున్నారు. ప్రజల్లో ఉన్న భయాలను తొలగించి టిడిపి విమర్శలను తిప్పికొట్టడంలో వైసిపి ఇప్పటికీ సఫలీకృతం కాలేకపోతుందని, జరగాల్సిన నష్టం జరిగిపోయిందని మాజీ మంత్రి ఒకరు తెలిపారు.

➡️