బిజెపి నేత మైనర్‌ కుమారుడి ఓటు ‘వీడియో’ .. మండిపడిన ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ :    లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేత తన మైనర్‌ కుమారుడితో కలిసి ఓటు వేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల కమిషన్‌ను బిజెపి పిల్లల ఆటవస్తువుగా మార్చిందని ధ్వజమెత్తాయి. భోపాల్‌లోని బెరాసియా సెగ్మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం లోక్‌సభ మూడో విడత పోలింగ్‌ సమయంలో బిజెపి పంచాయితీ నేత వినయ్  మెహర్‌, తన కుమారుడితో కలిసి పోలింగ్‌ బూత్‌కు వెళ్లారు. ఓటు వేయడం గురించి ఆ బాలుడు వివరిస్తున్న 14 సెకండ్ల నిడివి కలిగిన వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.  బాలుడు, అతని తండ్రి ఇవిఎంలో  బిజెపి చిహ్నంపై ఓటువేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ఈ వీడియోపై కాంగ్రెస్‌ నేత కమల్‌నాథ్‌ మీడియా సలహాదారు పీయూష్‌ బబేల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ”పోలింగ్‌ బూత్‌లోకి మెబైల్‌ ఫోన్‌ను ఎలా అనుమతించారు, తండ్రితో పాటు బాలుడిని బూత్‌లోకి ఎందుకు అనుమతించారు ” అని ప్రశ్నించారు. ఎలక్షన్‌ కమిషన్‌ను బిజెపి పిల్లల ఆటవస్తువుగా మార్చిందని ధ్వజమెత్తారు.
ఈ వీడియోపై జిల్లా కలెక్టర్‌ కౌశలేంద్ర విక్రమ్‌ సింగ్‌ విచారణకు ఆదేశించారు. పోలింగ్‌ బూత్‌లోని ప్రిసైడింగ్‌ అధికారి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఈ వీడియోపై ఎన్నికల కమిషన్‌ స్పందించాల్సి వుంది.

➡️