US Universities: యుద్ధ ప్రాంతంగా మారిన ఎమోరీ యూనివర్శిటీ

వాషింగ్టన్‌ :    అమెరికావ్యాప్తంగా ఆందోళన చేపడుతున్న విద్యార్థులపై పోలీసుల దాడులతో యూనివర్శిటీలు ‘యుద్ధ ప్రాంతాలు’గా మారాయి. దాదాపు 550 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలస్తీనాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్‌ను కాల్పుల విరమణ చేపట్టాలంటూ అమెరికా వ్యాప్తంగా పలు యూనివర్శిటీల్లో విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

అట్లాంటాలోని ఎమోరా యూనివర్శిటీలో శాంతియుతంగా నిరసనలు చేపడుతున్న విద్యార్థులపై యాజమాన్యం ఆదేశాలతో పోలీసులు టేజర్‌లు, టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారని ప్రత్యక్ష సాక్షులైన కార్యకర్తలు, మీడియా తెలిపింది. ఈ దృశ్యాలు తన యుక్తవయసులో గ్వాటెమాలాలో జరిగిన అంతర్యుద్ధాన్ని గుర్తుకు చేశాయని యూనివర్శిటీలోని ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌ ఎమిల్‌ కెమె తెలిపారు. శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులను పోలీసులు బలవంతంగా తరలించడం ప్రారంభించారని, రబ్బరు బుల్లెట్లు, ఆయుధాలు ప్రయోగించడంతో తాను యుద్ధ ప్రాంతంలో ఉన్నట్లు భావించానని అన్నారు. తమని దూరంగా నెట్టివేశారని అన్నారు.

గాజాలోని పాలస్తీనియన్లకు సంఘీభావంగా విద్యార్థులు ఈ నిరసనలు చేపడుతున్నారు. ఇజ్రాయిల్‌తో ముడిపడి ఉన్న అంశాలు, గాజాలో యుద్ధానికి ఆజ్యం పోసే ఆయుధాలకు యూనివర్శిటీలు ఫండ్స్‌ నిలిపివేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. బ్లాక్‌రాక్‌, గూగుల్‌, అమెజాన్‌ క్లౌడ్‌ సర్వీస్‌, లాక్‌హీడ్‌ మార్టిన్‌, ఎయిర్‌బిఎన్‌బిలు నిధులను మళ్లిస్తున్నట్లు తెలిపాయి.

ఇద్దరు మహిళా ప్రొఫెసర్లపై పోలీసుల దాష్టీకానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వారిలో ఒకరిని పోలీస్‌ అధికారులు నేలపై పడేసి చేతులు వెనక్కి కట్టేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.    అట్లాంటా పోలీసులు, జార్జియా ట్రూపర్లు సంయుక్తంగా యూనవర్శిటీలో ఏర్పాటు చేసిన శిభిరాలను ధ్వంసం చేశారు. క్యాంపస్‌లో ప్రవేశించిన నిమిషాల వ్యవధిలోనే 28 మందిని అరెస్టు చేశారు.

➡️