ఐరాస ఉగ్రవాద నిరోధక ట్రస్ట్‌ పండ్‌కి భారత్‌ ఐదు లక్షల డాలర్ల సాయం

ఐరాస :    ఐరాస ఉగ్రవాద నిరోధక ట్రస్ట్‌ ఫండ్‌ (సిటిటిఎఫ్‌)కి భారత్‌ ఐదు లక్షల డాలర్లు (దాదాపు రూ.4,17,50,725 ) సాయం అందించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం సాగిస్తున్న పోరాటానికి స్థిరమైన సహకారం అందిస్తామని సూచించింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ మంగళవారం యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫీస్‌ ఆఫ్‌ కౌంటర్‌ టెర్రరిజమ్‌ (యుఎన్‌ఒసిటి) జనరల్‌ సెక్రటరీ వ్లాదిమిర్‌ వొర్నొకోవ్‌కు ఐదు మిలియన్‌ డాలర్లు స్వచ్ఛంద ఆర్థిక సహకారం అందించినట్లు తెలిపారు.

ఉగ్రవాద ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సభ్యదేశాల సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఐరాస ఉగ్రవాద నిరోధక కార్యాలయం చేపట్టిన ఆదేశం, కార్యనిర్వహణకు భారత్‌ ప్రాముఖ్యతనిస్తుందని యుఎన్‌ భారత శాశ్వత మిషన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐరాస నేతృత్వంలో ప్రపంచం సాగిస్తున్న పోరాటంలో బహుపాక్షిక ప్రయత్నాలకు మద్దతుగా అందించిన సహకారం భారతదేశ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని తెలిపింది.

ఉగ్రవాదానికి ఆర్థిక సాయం చేయడం, ఉగ్రవాదుల కదలికలు, ప్రయాణాన్ని నిరోధించడం వంటి క్లిష్టమైన సమస్యలను ఎదుర్కోవడానికి తూర్పు, దక్షిణ ఆఫ్రికాలోని సభ్య దేశాల సామర్థ్యాలను పెంపొందించడం లక్ష్యమని కౌంటరింగ్‌ పైనాన్సింగ్‌ ఆఫ్‌ టెర్రరిజమ్‌ (సిఎఫ్‌టి) ఓ ప్రక టనలో తెలిపింది.

ఆఫ్రికాలో పెరుగుతున్న ఉగ్రవాద ముప్పు సమస్యను పరిష్కరించడం గత కొన్ని సంవత్సరాలుగా భారత ఉగ్రవాద వ్యతిరేక ప్రాధాన్యతలలో ఒకటి.

➡️